సీఎం జగన్‌కు సీబీఐ కోర్టులో ఊరట.. విదేశాలకు వెళ్లేందుకు అనుమతి

సీబీఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్.

Cm Jagan Foreign Tour : ఏపీ సీఎం జగన్ కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుండి జూన్ 1వరకు యూకే వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి కోరారు జగన్. సీబీఐ కోర్టు పర్మిషన్ ఇవ్వడంతో కుటుంబసభ్యులతో కలిసి ఈ నెల 17న లండన్ కు పయనం కాబోతున్నారు ఏపీ సీఎం జగన్.

తన కుటుంబంతో కలిసి లండన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ లో పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని, ఆ మేరకు బెయిల్ షరతు సడలించాలని సీఎం జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. లండన్‌లో తన కుమార్తెలు చదువుకుంటున్నారని.. వారితో కొన్ని రోజులు గడపడం కోసం కూడా అక్కడికి వెళుతున్నట్లు జగన్ చెప్పారు. కాగా జగన్ విదేశీ పర్యటనపై సీబీఐ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆస్తుల కేసులో విచారణ జరుగుతోందని, ఈ దశలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ వాదించింది. ఇప్పటికే ఓసారి ఆయన విదేశాలకు వెళ్లి వచ్చారని గుర్తు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను మే 14వ తేదీకి వాయిదా వేసింది. జగన్‌ విదేశీ పర్యటనకు అనుమతిస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది.

కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ నెల 17 నుంచి జూన్ 1 వరకు విదేశీ పర్యటనకు జగన్ వెళ్లనున్నారు. మే 13న ఏపీలో పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. పోలింగ్‌కి, ఫలితాలకు మధ్య 20 రోజుల సమయం ఉండటంతో కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు ప్లాన్ చేశారు జగన్.

ఆస్తుల కేసులో జగన్ కు షరుతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది సీబీఐ కోర్టు. బెయిల్ షరతుల ప్రకారం దేశం విడిచి వెళ్లరాదు. ఈ క్రమంలో విదేశీ పర్యటన కోసం అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జగన్. ముఖ్యమంత్రి జగన్ దంపతులు గతేడాదిలో కూడా లండన్ పర్యటనకు వెళ్లొచ్చారు.

Also Read : ఏపీలో గెలిచేది ఎవరు? ఎన్నికల ఫలితాలపై భారీగా బెట్టింగ్‌లు, చేతులు మారుతున్న కోట్ల రూపాయలు