Sajjala: లుక్‌అవుట్ నోటీసు ఇస్తే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఇస్తారు.. వీరు మాత్రం తిరిగి వస్తున్నప్పుడు ఇచ్చారు: సజ్జల

తాను కోర్టును ఆశ్రయిస్తున్నానని అక్కడ అన్నీ తెలుస్తాయని తెలిపారు.

Sajjala Ramakrishna Reddy

తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అమరావతిలో ఆయన ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తాను విదేశాలకు వెళ్తుంటే లుక్ అవుట్ నోటీసులు వచ్చి ఆగినట్టు పైత్యంతో కూడిన ప్రచారం చేస్తున్నారని అన్నారు.

అక్టోబర్ 7న తాను ఢిల్లీ వెళ్లి 14న విజయవాడకు వచ్చానని సజ్జల తెలిపారు. విజయవాడ వస్తుంటే విమానాశ్రయంలో గుంటూరు ఎస్పీ నుంచి లుక్ అవుట్ నోటీస్ ఇచ్చారని ప్రచారం చేస్తున్నారని అన్నారు. లుక్ అవుట్ నోటీసు ఇస్తే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఇస్తారని, వీరు మాత్రం తిరిగి వస్తున్నప్పుడు ఇచ్చారని తెలిపారు.

తాను వెళ్లానని తెలిసి అక్టోబరు10న నోటీసు ఇచ్చారని సజ్జల అన్నారు. దేశం విడిచి పారిపోవాల్సిన అవసరం తనకేంటని, తనపై తప్పుడు కేసు పెట్టారని చెప్పారు. తాను కోర్టును ఆశ్రయిస్తున్నానని అక్కడ అన్నీ తెలుస్తాయని తెలిపారు. తనకు అక్టోబర్ 25 వరకూ హై కోర్టు ప్రొటెక్షన్ ఉందని, ఇది తెలిసి కూడా లుక్ అవుట్ నోటీస్ ఇవ్వడం ఏంటని నిలదీశారు.

ప్రభుత్వ అరాచకానికి అడ్డూఅదుపూ లేకుండాపోతోందని సజ్జల ఆరోపించారు. వ్యవస్థకే పొగరు, బరితెగింపు తీసుకుని వచ్చారని తెలిపారు. అప్పట్లో జత్వాని కేసులో జగనే అన్నీ చేయించినట్టు స్టేట్మెంట్ ఇప్పిస్తున్నారని చెప్పారు. వందల మందిని విచారణ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని, అరెస్టులు చేస్తున్నారని అన్నారు. వైసీపీ అధ్యక్షుడితో పాటు కార్యకర్తల పై తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని చెప్పారు.

పాకిస్థాన్‌కు పాకిస్థాన్‌లోనే కౌంటర్‌ ఇచ్చిన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌