Scrub Typhus
Scrub Typhus : స్క్రబ్ టైఫస్ వ్యాధి ఏపీలో కలకలం రేపుతోంది. రోజురోజుకు ఈ వ్యాధి భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరణాలుసైతం గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Also Read : Gold Price Today : దిగొచ్చిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
ఏపీలో స్క్రబ్ టైఫస్ బారినపడి ఇప్పటికే 22 మంది మరణించారు. ప్రతీయేటా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత రెండేళ్లలోనూ ఏటా వెయ్యికిపైగా కేసులు వచ్చినా.. అధికారికంగా మరణాలు నమోదు కాలేదు. కానీ, ఈసారి మరణాలు సంఖ్య పెరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
దేశవ్యాప్తంగా స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు వస్తున్నా, ఏపీలోనే మరణాలు నమోదవుతుండటం కలవరానికి గురిచేస్తోంది. ఈ ఏడాది మొత్తం 11,271 పరీక్షలు నిర్వహించగా.. 2,150 మంది పాజిటివ్ గా నమోదైంది. అయితే, అంటువ్యాధుల కట్టడికి జాతీయ వైద్యసంస్థలు, కీలక రంగాల నిపుణులతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ టాస్క్‌ఫోర్స్ వ్యాధి నియంత్రణకు అవసరమైన సూచనలు, సలహాలు అందిస్తుంది. ఏపీలోని చిత్తూరు, తిరుపతి, కాకినాడ, విశాఖపట్టణంలో కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
స్క్రబ్ టైఫస్ ను సకాలంలో గుర్తిస్తే సమస్య ఉండదని అవగాహన కల్పిస్తున్నప్పటికీ.. తొలుత జ్వరాలకు వాడే సాధారణ మందులు వేసుకొని, పరిస్థితి చేయిదాటాక ఆస్పత్రుల్లో చేరుతుండటంతో ప్రాణాలమీదకు వస్తోందన వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాధి నిర్ధారణ జరిగితే సాధారణ యాంటిబయాటిక్స్ తో నయం అవుతుందని, అస్వస్థతకు గురవ్వగానే నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. అయితే, ఈ స్ర్కబ్ టైఫస్ కీటకం కొత్తగా పుట్టుకొచ్చింది కాదు. ఏళ్లుగా సంచరిస్తున్నదేనని నిపుణులు చెబుతున్నారు. కీటకం ప్రమాదకరంగా రూపాంతరం చెందడం వెనుక కారణాలు అంతుచిక్కడం లేదు.