సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ ఆదేశం

సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీని ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఎస్ఈసీ ఆదేశం

Updated On : January 29, 2021 / 2:28 PM IST

SEC Nimmagadda another key decision : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై దూకుడు మీదున్న ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాశ్‌పై ఎస్ఈసీ చర్యలు ఉపక్రమించింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని ఏపీ సీఎస్ ఆధిత్యనాథ్‌ను ఆదేశించారు. ఈ మేరకు సీఎస్‌కు లేఖ రాసిన నిమ్మగడ్డ.. ఎన్నికల విధుల్లో ప్రవీణ్ ప్రకాశ్ పాల్గొనకుండా చూడాలని కోరారు.

కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షలు జరపకుండా ఆదేశాలివ్వాలని సూచించారు. జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ప్రకాశ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదని ఎస్‌ఈసీ లేఖలో తెలిపారు. పలువురు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్ ప్రకాశ్ విఫలమయ్యారని తెలిపారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో వీడియోకాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని ప్రవీణ్ ప్రకాశ్‌పై నిమ్మగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కాలేదని లేఖలో పేర్కొన్నారు.

అంతకముందు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు. పంచాయతీల్లో ఫొటో చేసే అభ్యర్థులకు జారీ చేసే కుల ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫోటోలు ఉంచటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసే తహశీల్దార్లకు ఆదేశాలివ్వాలని ప్రధాన కార్యదర్శిని నిమ్మగడ్డ ఆదేశించారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటోలు ఉంచటం వ్యతిరేకమన్నారు. ఇది ఎన్నికల నియమావళికి వ్యతిరేకమన్నారు. ధ్రువీకరణ పత్రాలపై ముఖ్యమంత్రి ఫోటో లేకుండా జారీ చేయాలని ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు.