Visakhapatnam YSRCP : షాక్ మీద షాక్.. పరిపాలన రాజధాని నగరం వైసీపీకి అచ్చి రావడం లేదా?

Visakhapatnam YSRCP : నగరంపై పట్టు సాధించాలని వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి.

Visakhapatnam YSRCP

Visakhapatnam YSRCP –  Panchakarla Ramesh Babu : విశాఖ నగరంలో అధికార వైసీపీకి షాక్ మీద షాక్ తగులుతోంది. కిడ్నాప్ లు, భూకబ్జాలు, శాంతిభద్రతల సమస్యలు ఓవైపు సవాల్ విసురుతుంటే.. పార్టీలో అసమ్మతి సీఎం జగన్ కు తలనొప్పిగా మారుతోంది. ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేయడంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది. పరిపాలన రాజధాని నగరం వైసీపీకి అచ్చి రావడం లేదా?

స్టీల్ సిటీ విశాఖపై అధికార వైసీపీ చాలా ఎక్కువగానే ఫోకస్ పెట్టింది. మూడు రాజధానుల్లో ఒకటైన పరిపాలన రాజధానిగా వైజాగ్ ను ఎంపిక చేసిన వైసీపీ.. నగరంపై పట్టు మాత్రం సాధించలేకపోతోంది. గత ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా హవా నడిచినా విశాఖలో నాలుగు సీట్లు కోల్పోయింది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని టార్గెట్ పెట్టుకుంది. నాలుగేన్నరేళ్లుగా నగరంపై పట్టు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ కీలక నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు నగరంపై పూర్తి పట్టు సాధించి స్థానిక ఎన్నికల్లో గట్టు పునాది వేశారు. కానీ, కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే వైసీపీకి ఏమాత్రం కలిసి వస్తున్నట్లు కనిపించడం లేదు.(Visakhapatnam YSRCP)

Also Read..Ashok Gajapathi Raju: అంతుబట్టని అశోక్ గజపతిరాజు అంతరంగం.. ఇంతకీ ఆయన మనసులో ఏముంది?

నగరంపై పట్టు సాధించాలని వైసీపీ అధిష్టానం చేస్తున్న ప్రయత్నాలకు స్థానిక పరిస్థితులు షాక్ ఇస్తున్నాయి. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యుల కిడ్నాప్ వ్యవహారం, ఆ సమయంలో నిందితులు గంజాయి సేవించినట్లు వచ్చిన వార్తలు వైసీపీ అధిష్టానాన్ని చికాకు పెట్టాయి. ఎంపీ ఆరోపణలను సమర్థించలేని, ఖండించలేని పరిస్థితులు ఎదుర్కొంది వైసీపీ అధిష్టానం. రాజధాని నగరం చేయాలని భావిస్తున్న విశాఖలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుందనే విషయం కిడ్నాప ఇష్యూలో ప్రధానం కావడంతో వైసీపీ పెద్దలు ఇరకాటంలో పడిపోయారు. ఈ ఇష్యూ తెరమరుగు అవుతున్న సమయంలో సీఐ స్వర్ణలత అరెస్ట్ సంచలనం సృష్టించింది. ఆమెకు అధికార పార్టీతో సంబంధాలు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో దుమారం రేగింది.

ఈ వరుస పరిణామాలకు కొనసాగింపుగా ఇప్పుడు ఏకంగా జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రమేశ్ బాబు పెందుర్తి టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. కానీ, అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదీప్ రాజ్ కే అవకాశం ఇచ్చేలా కనిపిస్తుండటంతో రమేశ్ బాబు పక్కకి తప్పుకున్నారు.

Also Read.. Pawan Kalyan: నాపై దెబ్బ పడినట్లే లెక్క.. ఇక శ్రీకాళహస్తి వస్తా అక్కడే తేల్చుకుంటా: పవన్ కల్యాణ్

మరోవైపు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటోంది వైసీపీ అధిష్టానం. ఆ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వాసుపల్లి గణేశ్ కుమార్ గెలిచారు. ఎన్నికల తర్వాత ఆయన వైసీపీలో చేరారు. కానీ, ఆయనకు పోటీగా మరో ఇద్దరు అభ్యర్థులు ఆ నియోజకవర్గంలో ఉండటం వైసీపీకి తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గం నుంచి సీతంరాజు సుధాకర్, కోలా గురువులు టిక్కెట్ ఆశిస్తున్నారు. ఈ ఇద్దరిని ఎమ్మెల్సీలను చేయాలని భావిస్తే ఎన్నికల్లో ఓడిపోయి మళ్లీ విశాఖ దక్షిణ సీటుపై కన్నేయడం వైసీపీని ఇరుకున పెడుతోంది.

ఇలా రాజకీయంగా సమస్యలు ఎదురు కావడమే కాకుండా రుషికొండపై నిర్మాణాలు, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి వివాదాలు వైసీపీని వెంటాడుతున్నాయి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటోంది వైసీపీ నాయకత్వం. అయితే, ఈ సమస్యలన్నింటికి మూలం నగరంలో వైసీపీకి సరైనా నాయకత్వం లేకపోవడమే కారణం అనే టాక్ వినిపిస్తోంది. విజయసాయి రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి వంటి వారు సమన్వయ బాధ్యతలు చూస్తున్నా.. పార్టీ పై పట్టున్న స్థానిక నేత లేకపోవడమే ఈ సమస్యలన్నింటికి ప్రధాన కారణం అంటున్నారు.