Varaha Lakshmi Narasimha Swamy (1)
Varaha Lakshmi Narasimha Swamy : సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిజరూప దర్శనం, చందనోత్సవం ఘనంగా జరుగుతున్నాయి. వంశ పారంపర్య ధర్మకర్త అశోక్ గజపతి రాజు, ఆయన కుటుంబ సభ్యులు ఆలయానికి చేరుకున్నారు. చందనోత్సవ ప్రత్యేక అధికారులు, దేవస్థాన అధికారులు వారికి స్వాగతం పలికారు. అనువంశధర్మకర్త అశోక్ గజపతిరాజు మొదట పూజ నిర్వహించారు. సింహాచల వరాహ లక్ష్మీనరసింహ స్వామికి డిప్యూటీ సీఎం కొట్టు సత్య నారాయణ, జిల్లా మంత్రి గుడివాడ అమర్నాథ్ పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు.
సింహాచల వరాహ లక్ష్మీ నరసింహ స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరుపున టీటీడీ ఛైర్మన్ వై వి సుబ్బారెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించి దర్శనం చేసుకున్నారు. ఆనవాయితీ ప్రకారం స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించామని తెలిపారు. అప్పన్న స్వామి, టీటీడీ ఆశీస్సులతో జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుoటున్నానని తెలిపారు. స్వామివారి చందనోత్సవానికి వచ్చే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. భక్తులు ఓపికగా స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
Tirumala : తిరుమలలో కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు.. మూడేళ్ల తర్వాత పున:ప్రారంభం
అప్పన్న స్వామి చందనోత్సవానికి అందరూ సమన్వయంతో పని చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. ఏర్పాట్ల కోసం నెల రోజులు ముందు నుంచి చర్యలు తీసుకున్నామని తెలిపారు. సాయంత్రం 7 గంటలకు స్వామివారికి సహస్ర గట్టాభిషేకం జరుగుతుందని వెల్లడించారు. ఆ కార్యక్రమం పూర్తైన వెంటనే స్వామివారికి విశ్రాంతి ఇవ్వటం జరుగుతుందన్నారు. రాష్ట్రం సర్వతో ముఖాభివృద్ధి చెందాలని, స్వామివారి కరుణాకటాక్షాలు ప్రభుత్వంపై సమృద్ధిగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు.
మరోవైపు చందనోత్సవములో భక్తులకు కష్టాలు తప్పడం లేదు. వీవీఐపీ, వీఐపీ ప్రాధాన్యతతో సాధారణ భక్తులకు తిప్పలు పడుతున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచి క్యూలైన్లు కదలడం లేదు. సింహాచలం కొండపై ట్రాఫిక్ నిలిచిపోయింది. పదుల సంఖ్యలో బస్సులు నిలిచిపోవడంతో భక్తులు అష్ట కష్టాలు పడుతున్నారు. దేవస్థానం సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణమంటూ భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు భక్తులకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వడం లేదంటూ టీడీపీ మహిళ అధ్యక్షరాలు అనిత మండిపడ్డారు.