SIT Chief Sarvashreshth Tripathi (Photo Credit : Google)
SIT Chief Sarvashreshth Tripathi : టీటీడీ ఈవో శ్యామలరావుతో సిట్ బృందం సభ్యులు భేటీ అయ్యారు. విచారణ తీరు గురించి ఈవోతో చర్చించారు. బృందాలుగా ఏర్పడి విచారణ జరపనున్నట్లుగా సిట్ సభ్యులు ఈవోకు తెలిపారు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఏఆర్ డెయిరీపై నమోదైన కేసు గురించి చర్చించారు. ఈవోతో భేటీ తర్వాత తిగిరి పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు సిట్ సభ్యులు.
నెయ్యి కల్తీపై లోతైన విచారణ జరుపుతామని సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠీ తెలిపారు. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు సిట్ కు బదిలీ అయ్యిందని చెప్పారు. ఇక నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై విచారణ చేస్తామని వెల్లడించారు. సిట్ అధికారులు మూడు బృందాలుగా ఏర్పడి దర్యాఫ్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కల్తీ నెయ్యికి బాధ్యులైన అందరినీ విచారిస్తామన్నారు. నివేదిక సమర్పించేందుకు కాల పరిమితి లేదని తెలిపారు త్రిపాఠీ.
కల్తీ నెయ్యి వ్యవహారంపై రెండో రోజు సిట్ విచారణ కొనసాగుతోంది. తిరుపతి పోలీస్ గెస్ట్ హౌస్ లో మరోసారి సిట్ సభ్యులు భేటీ అయ్యారు. డీఐజీ గోపీనాథ్ జెట్టీ, ఎస్పీ హర్షవర్దన్ రాజు, అదనపు ఎస్పీ వెంకట్రావు నేతృత్వంలో దర్యాఫ్తు చేస్తున్నారు. టీటీడీ బోర్డు దగ్గరి నుంచి అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాలపై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ సభ్యులు పలు ప్రాంతాలకు వెళ్లి విచారణ చేపట్టనున్నారు. ఏఆర్ డెయిరీ ఫుడ్ సంస్థను పరిశీలించనున్నారు. లడ్డూ తయారీ ముడి సరుకులపై ఆరా తీయనున్నారు. లడ్డూ తయారీలో పాల్గొంటున్న వారిని ప్రశ్నించనున్నారు. టీటీడీ పరిపాలన భవనంలో మరో బృందం విచారణ చేపట్టింది. నెయ్యి కొనుగోలు, ఒప్పందాలు పరిశీలించనుంది. దీనికి సంబంధించి టీటీడీ, ఏఆర్ డెయిరీ మధ్య ఒప్పందాలపై ఆరా తియ్యనున్నారు. పూర్తి విచారణ తర్వాత సిట్ బృందం తన నివేదికను ప్రభుత్వానికి అందించనుంది.
”లడ్డూలో నెయ్యి కల్తీపై లోతైన విచారణ చేస్తాం. భిన్న కోణాల్లో కేసును దర్యాఫ్తు చేస్తాం. కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. మూడు బృందాలుగా ఏర్పడి దర్యాఫ్తు చేస్తున్నాం. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీపై ఎంక్వైరీ చేస్తాం. టీటీడీ అధికారులు, సిబ్బంది పాత్ర వరకు అన్ని అంశాల్లో దర్యాఫ్తు చేస్తాం. పూర్తి విచారణ తర్వాత నివేదికను అందజేస్తాం” అని సిట్ చీఫ్ త్రిపాఠి తెలిపారు.
Also Read : తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ.. ఏం జరగనుంది, దేశవ్యాప్తంగా ఉత్కంఠ..