తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ.. ఏం జరగనుంది, దేశవ్యాప్తంగా ఉత్కంఠ..

కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్టుపై సమగ్ర వివరాలు కూడా అందజేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు.

తిరుమల లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ.. ఏం జరగనుంది, దేశవ్యాప్తంగా ఉత్కంఠ..

Ttd Laddu Row (Photo Credit : Google)

Updated On : September 29, 2024 / 4:40 PM IST

Ttd Laddu Row : తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను రేపు (సెప్టెంబర్ 30) సుప్రీంకోర్టు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు పిటిషన్లు వేశారు. జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్ లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను ఒకేసారి విచారించనుంది. కోర్టు పర్యవేక్షణలో నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి లడ్డూ ప్రసాదం కల్తీ అంశంపై సమగ్ర దర్యాఫ్తు జరిపించాలని వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ వేశారు.

అదే సమయంలో కల్తీ జరిగిందన్న ల్యాబ్ రిపోర్టుపై సమగ్ర వివరాలు కూడా అందజేయాలని పిటిషన్ లో పేర్కొన్నారు. కల్తీ నెయ్యి ఘటనపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాఫ్తు జరపాలని సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్ వేశారు. నెయ్యి కల్తీ జరిగిందంటూ వచ్చిన ల్యాబ్ రిపోర్టుపై సమగ్ర నివేదిక తెప్పించాలని కూడా పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ కల్తీ వ్యవహారంపై టీటీడీ స్థాయిలో అంతర్గతంగా తేల్చాల్సిందని, కానీ దీన్ని రాజకీయం చేస్తూ వేంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆయన ఆరోపించారు. టీటీడీకి సరఫరా చేసే నెయ్యి నాణ్యతలో విఫలమైతే దాన్ని వెనక్కి పంపే ఏర్పాటు ఉండాలన్నారు.

Also Read : తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ దూకుడు..

తిరుమల లడ్డూ వివాదం పిటిషన్ కోర్టులో ఐటెమ్ నెంబర్ 63గా లిస్ట్ అయ్యింది. లడ్డూ వివాదంపై దాఖలైన పిటిషన్లు అన్నింటిని ట్యాగ్ చేస్తూ సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది. వైవీ సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్యస్వామి సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లు కోర్టు విచారించనుంది. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంలో నిజానిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని, అసలు కల్తీ జరిగిందా లేదా, కోట్లాది మంది భక్తులు గందరగోళంలో ఉన్నారని, సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవి అంటూ సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్ లో పేర్కొన్నారు.

కోర్టు పర్యవేక్షణలోనే ఎంక్వైరీ జరగాలంటూ వైసీపీ ఎంపీ, మాజీ టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మరో పిటిషన్ వేశారు. వారే ఆరోపణలు చేసి, వారే ఎంక్వైరీ చేస్తే నిజాలు నిగ్గు తేలవని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే రిటైర్డ్ జడ్జి లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో నిపుణుల బృందంతో నెయ్యి కల్తీ జరిగిందా లేదా అన్నదానిపై విచారణ జరపాలని తన పిటిషన్ లో పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన నిరాధారమైన వ్యాఖ్యల వెనుక నిజాలు నిగ్గు తేలాలంటే కూడా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే దర్యాఫ్తు జరగాల్సి ఉందని సుబ్రమణ్యస్వామి చెబుతున్నారు.