దటీజ్ చంద్రబాబు..! సంక్షోభాలనే అవకాశాలుగా మార్చుకున్న మేరునగధీరుడు

నేర్పు, ఓర్పు, ఊహించని ఎత్తుగడలతో అనుకున్నలక్ష్యాలన్నీ సాధిస్తారని.. ఆంధ్రుల అంచనాలు అందుకుంటారని, నమ్మకాలను నిలబెడతారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Cm Chandrababu Naidu Achievements : ఎత్తుపల్లాలు..ఒడిదుడుకులు, గెలుపోటములు లేకపోతే మనిషి జీవితానికి అర్ధం లేదు. ఇక రాజకీయ నేతల జీవన ప్రయాణంలో ఉత్థానపతనాలు సర్వసాధారణం. ఓ విజయం అసామాన్య వ్యక్తిగా పేరు తెస్తే… మరో పరాజయం నిలువునా కుదిపేస్తుంది. ఓ అపజయం అవమానభారం మిగిలిస్తే…మరో అసాధారణ గెలుపు అద్భుత అవకాశాలను అందిస్తుంది. లేచి పడడం, పడి లేవడం అసలైన నాయకుని సహజ లక్షణం. కానీ రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదని.. పదవి ఉంది అధికార దర్పం ప్రదర్శించడానికి కాదని… ప్రజలకు సేవ చేయడానికేనని గుర్తించడంలోనే అసలు గెలుపు సూత్రం దాగి ఉంది.

ఆ సూత్రాన్ని మనసా వచా నమ్మి… అందివచ్చిన అవకాశంతో అద్భుతాలు సృష్టించి… అసాధారణ దురంధరుడిగా మారి.. మేరునగధీరుడిగా ఎదిగి.. సరికొత్త చరిత్ర సృష్టించి… తాను సృష్టించిన చరిత్రను తానే తిరగరాసిన ఒకే ఒక్కడు నారా చంద్రబాబు నాయుడు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 74ఏళ్ల చంద్రబాబు ముందు నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణం రూపంలో అనేక సవాళ్లున్నాయి. అయితే అపార అనుభవం, వినూత్న ఆలోచనా విధానం మేలుకలయికతో ఆ సవాళ్లను చంద్రబాబు సమర్థవంతంగా ఎదుర్కోగలరన్నది ఆంధ్రుల అపారవిశ్వాసం.

ఆ మార్క్.. మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కారణమైంది..
నవ్యాంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. 74 ఏళ్ల ఆయన జీవితంలో 45 ఏళ్లగా ప్రజల నాయకుడిగానే ఉన్నారు. ఆయన జీవితంలో గెలుపోటములు అతిసాధారణం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉంటే.. 15 ఏళ్లు ప్రతిపక్షనేతగా ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రయ్యారు.

సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చి.. దేశ రాజకీయాల్లోనే కీలకమైన వ్యక్తిగా ఆయన ఎదిగిన ప్రస్థానం అసామాన్యం.. అనితర సాధ్యం. సుదీర్ఘకాలం టీడీపీ అధినేతగా, ప్రతిపక్షనేతగా పార్టీని చెక్కు చెదరకుండా కాపాడిన చంద్రబాబు…ముఖ్యమంత్రిగా ఉన్న అన్ని సమయాల్లోనూ తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా ఆయన చేపట్టిన కార్యక్రమాలు.. విభజిత ఆంధ్రప్రదేశ్‌ తొలి సీఎం అయ్యే అవకాశం కల్పించాయి. నవ్యాంధ్ర తొలి సీఎంగా చూపిన మార్క్.. మరోసారి ముఖ్యమంత్రి అయ్యేందుకు కారణమైంది.

అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు.. టీడీపీకి పునర్ వైభవం కల్పించారు..
2019 ఎన్నికల్లో కేవలం 23 స్థానాలకు పరిమితమైన టీడీపీ.. ఈ ఎన్నికల్లో జనసేన, బీజేపీతో కలిసి కూటమిగా మారి క్లీన్‌స్వీప్‌ చేసింది. ఘోర ఓటమిని.. ఘనవిజయంగా మార్చడం అందరికీ సాధ్యం కాదు. కానీ అది చేసి చూపారు చంద్రబాబు. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేయడంలోనూ కీలకంగా మారి.. జాతీయస్థాయిలో సత్తా చాటారు. టీడీపీకి పునర్‌ వైభవం కల్పించారు. టీడీపీ పని అయిపోయిందనుకున్నప్పుడల్లా పార్టీని అధికారంలోకి తీసుకురావడం చంద్రబాబు గొప్పతనం.

2004, 2009లో వరుసగా అధికారం కోల్పోయినప్పటికీ.. తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని తట్టుకుని పార్టీని పటిష్టంగా నిలిపిన చంద్రబాబు.. విభజన తర్వాత ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు. గత ఎన్నికల్లో 23 సీట్లే సాధించడంతో టీడీపీ మనుగడపై నెలకొన్న సందేహాలకు ఈ ఎన్నికల్లో 135 సీట్లు సాధించడం ద్వారా సమాధానమిచ్చారు. వచ్చే ఐదేళ్లలో నవ్యాంధ్రప్రదేశ్‌ను కూడా ఇలాగే అభివృద్ధిపరంగా పరుగులు పెట్టిస్తారని ఆంధ్రులు నమ్ముతున్నారు.

ప్రధానమంత్రులు, రాష్ట్రపతి ఎంపికలో కీలకపాత్ర..
1975లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టి.. నాలుగోసారి ముఖ్యమంత్రయ్యేదాకా రాజకీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజన్ 2020 కింద చేపట్టిన కార్యక్రమాలతో దేశ విదేశాల్లో గుర్తింపు పొందారు చంద్రబాబు. 1996-2004 మధ్య జాతీయ రాజకీయాల్లోనూ చంద్రబాబుది కీలక పాత్ర. యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్‌గా, ఎన్డీయే కన్వీనర్‌గా ఉన్న చంద్రబాబు… ప్రధానమంత్రులు, రాష్ట్రపతి ఎంపికలో కీలకపాత్ర పోషించారు. ప్రతిపక్షనేతగా ఉన్న సమయంలోనూ 2009లో తృతీయ ఫ్రంట్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు.

మరోసారి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం..
తర్వాత స్థానిక పరిస్థితులతో రాష్ట్రాల రాజకీయాలకే పరిమితమయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ ఘోర ఓటమి వ్యక్తిగతంగానూ ఆయనకు అనేక ఇబ్బందులు తెచ్చిపెట్టింది. 52రోజుల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ఆటుపోట్లన్నింటినీ ఎదుర్కొని.. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చారు చంద్రబాబు. ఈ ఎన్నికల రూపంలో మరోసారి ఆయనకు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం లభించింది.

చంద్రబాబు ముందు అనేక సవాళ్లు..
నవ్యాంధ్రప్రదేశ్‌లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు ముందు అనేక సవాళ్లున్నాయి. అమరావతిని పూర్తిస్థాయి రాజధానిగా తీర్చిదిద్దడం, పారిశ్రామికాభివృద్ధి, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన, పోలవరం నిర్మాణం వంటివి కొత్త ప్రభుత్వం ప్రాధాన్యాత అంశాలుగా చేపట్టి యుద్ధప్రాతిపదకన పూర్తి చేయాల్సి ఉంది. విభజన ఆంధ్రప్రదేశ్ తొలి సీఎంగా ఉన్నప్పటికంటే.. వచ్చే ఐదేళ్ల కాలమే చంద్రబాబుకు కఠిన పరీక్షలు ఎదురుకానున్నాయి.

చంద్రబాబు మీద బృహత్తర బాధ్యత..
టీడీపీ, జనసేన మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన భారీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాభివృద్ధిని పరుగులు పెట్టించాల్సిన బృహత్తర బాధ్యత చంద్రబాబు మీద ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న అపార అనుభవం, నూతన ఆలోచనలు, పోరాటతత్వం, ఏమీ లేని స్థాయి ఉంచి.. అన్నీ సృష్టించగల నేర్పు, ఓర్పు, ఊహించని ఎత్తుగడలతో చంద్రబాబు అనుకున్న లక్ష్యాలన్నీ సాధిస్తారని.. ఆంధ్రుల అంచనాలు అందుకుంటారని, నమ్మకాలను నిలబెడతారని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also Read : హోంమంత్రి ఎవరు, ఆర్థిక శాఖ ఎవరికి? పవన్‌కు ఇచ్చే పదవి ఏది? మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ

ట్రెండింగ్ వార్తలు