హోంమంత్రి ఎవరు, ఆర్థిక శాఖ ఎవరికి? పవన్‌కు ఇచ్చే పదవి ఏది? మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ

ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పని చేశారు.

హోంమంత్రి ఎవరు, ఆర్థిక శాఖ ఎవరికి? పవన్‌కు ఇచ్చే పదవి ఏది? మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ

Updated On : June 12, 2024 / 4:23 PM IST

Chandrababu Cabinet : చంద్రబాబు కేబినెట్ కొలువుదీరింది. ప్రధాని మోదీ సమక్షంలో వేలాది మంది కార్యకర్తల సాక్షిగా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు చంద్రబాబు. ఆయనతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. ఇక కొత్త మంత్రులకు కేటాయించే శాఖలపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు కేబినెట్ లో కొత్త వారే అధికంగా మంత్రులు అయ్యారు. మొత్తం 24 మందిలో 17మంది కొత్తవారు తొలిసారి మంత్రులు కాగా, వీరిలో 8 మంది తొలిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో కీలక శాఖలు ఎవరికి అప్పగిస్తారు? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆర్థిక, హోం, రెవెన్యూ, వైద్య, ఆరోగ్య, విద్య, పట్టణాభివృద్ది, పరిశ్రమల శాఖలను కీలకంగా చెప్తారు. ముఖ్యంగా అత్యంత ప్రధానమైన ఆర్థిక మంత్రి పదవిని ఎవరికి కేటాయిస్తారు అన్నది ఆసక్తి రేపుతోంది. గతంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు మంత్రివర్గంలో అశోక్ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఆ ఇద్దరు లేకపోవడం వల్ల ఆర్థికశాఖ ఎవరికి కేటాయిస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన ఆనం రామనారాయణ రెడ్డి.. ప్రస్తుతం మంత్రిగా ప్రమాణం చేశారు. ఇక ఆర్థిక అంశాల్లో పట్టున్న పయ్యావుల కేశవ్ కూడా మంత్రి అయ్యారు. ఈ ఇద్దరిలో ఒకరికి ఆర్థిక శాఖ కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఇక శాంతి భద్రతలను పర్యవేక్షించే హోంశాఖ మంత్రి ఎవరు అవుతారు? అనేది సస్పెన్స్ గా మారుతోంది.

ఇక జనసేనాని పవన్ కల్యాణ్ కు హోంశాఖ ఇస్తారా? లేక ఇంకేదైనా కీలక శాఖ అప్పగిస్తారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ మహిళను హోంశాఖ మంత్రిగా ఎంపిక చేయాలనుకుంటే.. తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేరు పరిశీలిస్తారని అంటున్నారు. గత ప్రభుత్వంపై అలుపెరుగని పోరాటం చేసి తన సమర్థత చాటుకున్నారు అనిత. ఇక జనసేన నుంచి మంత్రులుగా ప్రమాణం చేసిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ కు ఏ శాఖ కేటాయిస్తారనేది ఉత్కంఠ రేపుతోంది. మనోహర్ గతంలో స్పీకర్ గా పని చేయగా, తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు దుర్గేశ్.

Also Read: ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్‌ టు స్టేట్ మినిస్టర్

గతంలో మంత్రులుగా పని చేసిన నారా లోకేశ్, పి.నారాయణ, ఫరూక్, కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, అచ్చెన్నాయుడు సేవలను ఎలా వినియోగించుకుంటారు? అనేది ఆసక్తి రేపుతోంది. లోకేశ్ గతంలో ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా పని చేశారు. మళ్లీ అదే శాఖ తీసుకుంటారా? లేక ఇంకేదైనా కీలక శాఖకు మారుతారా? అన్నది చూడాల్సి ఉంది. అదే విధంగా అమరావతి నిర్మాణం కోసం నారాయణకు గతంలో మున్సిపల్ శాఖ కేటాయించారు చంద్రబాబు. ఇప్పుడు మళ్లీ అదే శాఖ ఇస్తారా? లేక కొత్త శాఖకు మారుస్తారా? అన్నది చూడాల్సి ఉంది.

Also Read : ఇవాళ మెగా ఫ్యాన్స్‌కి పండగే.. చిరు, పవన్‌ని దగ్గరకు తీసుకున్న మోదీ.. నేషనల్ లెవల్‌లో మెగా క్రేజ్..

చంద్రబాబు గత క్యాబినెట్ లో కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర పని చేశారు. ఈసారి ఈ ఇద్దరికి కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందంటున్నారు. టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడిగా గత ఐదేళ్లు పని చేసిన రవీంద్రకు బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది వేచి చూడాల్సి ఉంది. అదే విధంగా కొత్తగా మంత్రులైన గుమ్మడి సంధ్యారాణి, కొత్తపల్లి శ్రీనివాస్, వాసంశెట్టి సుభాష్, రాంప్రసాద్ రెడ్డికి ఏ బాధ్యత అప్పగిస్తారు? అన్నది ఉత్కంఠగా మారింది.