ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్.. కుటుంబ నేపథ్యం ఇదే
సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించి.. ఏపీ మంత్రి వరకు ఎదిగారు విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్.

andhra pradesh minister kondapalli srinivas family and political background
Andhra Pradesh Minister Kondapalli Srinivas: విజయనగరం జిల్లా గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్(41).. చంద్రబాబు క్యాబినెట్‌లో చోటు సంపాదించారు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గజపతినగరంలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన, వైసీపీ అభ్యర్థి బొత్స అప్పలనర్సయ్యపై 24,302 ఓట్ల మెజార్టీతో గెలిచారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పాలిటిక్స్‌లోకి ఎంటరయ్యారు. విద్యాధికుడు అయిన ఆయన సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యారు. తాజాగా మంత్రి పదవిని కూడా దక్కించుకుని అందరి దృష్టిని ఆకర్షించారు.
చదువు, కుటుంబ నేపథ్యం
కొండపల్లి శ్రీనివాస్ 1983 ఏప్రిల్ 13న కొండపల్లి కొండలరావు, సుశీల దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్యాభ్యాసం విజయనగరం, అరకు ప్రాంతాల్లో సెయింట్ జోసఫ్ స్కూలులో సాగింది. ఇంటర్మీడియట్ విశాఖలోని విజ్ఞాన్ కాలేజీలో చదివారు. జేఎన్టీయూ హైదరాబాద్‌లో కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ చేశారు. అమెరికాలోని బాల్ స్టేట్ యూనివర్సిటీలో ఎంఎస్ పూర్తి చేశారు. 16 ఏళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా ఒరాకిల్ సంస్థలో పనిచేశారు. కంపెనీ తరపున పలు దేశాల్లో పర్యటించారు. శ్రీనివాస్ భార్య పేరు లక్ష్మి సింధు. వీరికి ఇద్దరు సంతానం.. కుమారుడు విహాన్, కుమార్తె మేధ.
కుటుంబ రాజకీయ నేపథ్యం
కొండపల్లి శ్రీనివాస్ కుటుంబానికి రాజకీయ నేపథ్యం వుంది. శ్రీనివాస్ తాతయ్య కొండపల్లి పైడితల్లి నాయుడు మూడుసార్లు బొబ్బిలి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. విజయనగరం జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా, విజయనగరం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడుగా పనిచేశారు. శ్రీనివాస్ తండ్రి కొండపల్లి కొండలరావు గంట్యాడ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికై సేవలు అందించారు. శ్రీనివాస్ తల్లి తరపు తాతయ్య అయిన అప్పికొండ సత్యం నాయుడు 1962-82 మధ్య కాలంలో సాలూరు సమితి అధ్యక్షుడిగా ఉన్నారు.
Also Read: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమాణస్వీకారోత్సవం ఎలా జరిగిదంటే..
వాణిజ్య రంగంలోనూ..
సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా పనిచేసిన శ్రీనివాస్ అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత వాణిజ్య రంగంలోకి అడుగుపెట్టారు. హాస్పిటాలిటీ, అగ్రి ప్రాసెసింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో తనదైన ముద్ర వేశారు. విజయనగరం జిల్లాలో హోటల్ కొండపల్లి గ్రాండ్, విహార రెంటల్ గెస్ట్ హౌస్, శ్రీ రాధాకృష్ణ ఆగ్రో ఫుడ్స్, రాధాకృష్ణ మోడర్న్ రైస్ మిల్స్ స్థాపించారు. విహాన్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థను ఏర్పాటు చేసి విజయనగరం, సాలూరు ప్రాంతాల్లో వ్యాపారం సాగించారు. తన సంస్థల ద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించారు. రోటరీ క్లబ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించిన శ్రీనివాస్ అనేక రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పాఠశాలల అభివృద్ధికి తనవంతు సహాయం చేశారు. కాగా, కొండపల్లి శ్రీనివాస్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు.