Student Protest: విజయవాడలో ఉద్రిక్తంగా మారిన విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి

రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య ఆనందరావును ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి

Student Protest: విజయవాడలో శనివారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రాజ్ భవన్ ముట్టడికి వచ్చిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకోవడంతో, పోలీసులకు విద్యార్థి సంఘాలకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. రాయలసీమ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ (వీసీ) ఆచార్య ఆనందరావును ప్రభుత్వం రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చాయి. ఆచార్య ఆనందరావు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, ఈ విషయం ప్రభుత్వ దృష్టికి వచ్చినా స్పందించలేదంటూ విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈక్రమంలో ఆచార్య ఆనందరావును వీసీగా రీకాల్ చేయాలనీ డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడికి పిలుపునిచ్చారు.

Also read:Minister Ktr: నాగార్జున సాగర్ నియోజకవర్గంలో నేడు మంత్రి కేటీఆర్ పర్యటన.. ఆరుగురు మంత్రులు అక్కడే..

అయితే విద్యార్థి సంఘాల నిరసనకు అనుమతి లేదని పోలీసులు పేర్కొన్నారు. విద్యార్థుల నిరసనను అడ్డుకునేందుకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలువురు విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. శనివారం విజయవాడ ధర్నాచౌక్ నుండి రాజ్ భవన్ కు తరలి వెళ్తున్న విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాచౌక్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు.

Other Stories:Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు

దీంతో విద్యార్థి సంఘాల రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. గాంధీనగర్ అలంకార్ సెంటర్ వద్ద విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో విద్యార్థి సంఘాల నేతలు వాగ్వాదానికి దిగారు. అనంతరం జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థి సంఘ నేతలను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు.

ట్రెండింగ్ వార్తలు