Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు

ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోగా..పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు

Maharashtra Village: శివాజీ విగ్రహ తొలగింపుపై గ్రామస్థుల మధ్య రగడ: 30 మంది పోలీసులకు గాయాలు

Police

Maharashtra Village: గ్రామ ప్రవేశ ద్వారానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరు పెట్టె విషయంలో ఇద్దరి గ్రామస్థుల మధ్య తలెత్తిన చిన్న పాటి వివాదం..చిలికిచిలికి గాలి వానలా మారినట్టు..ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయి కొట్టుకున్న ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఇరువర్గాల వారు రాళ్లు, కర్రలతో దాడి చేసుకోగా..పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు వెళ్లిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. ఈఘటనలో ఒక అడిషనల్ ఎస్పీ సహా 30 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మహారాష్ట్రలోని జల్నా జిల్లా చందాయ్ ఏకో గ్రామంలో గురువారం చోటుచేసుకున్న ఈ ఘర్షణలో 300 మంది గ్రామస్తులపై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..చందాయ్ ఏకో గ్రామంలో ఛత్రపతి శివాజీ విగ్రహం ఉంది. ఈక్రమంలో గ్రామంలో నిర్మించిన ప్రవేశ ద్వారానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ పేరునే పెట్టాలని గ్రామస్తుడొకరు సూచించారు.

Read Others:Prashant kishor : ఆ రాజకీయ నాయకుడు అంటే ప్రశాంత్ కిషోర్‌కు అమితమైన ఇష్టమట.. ఎవరా నేత?

ఇంతలో కలగజేసుకున్న మరొక గ్రామస్తుడు..గ్రామ ప్రవేశ ద్వారానికి దివంగత బీజేపీ నేత గోపినాథ్ ముండే పేరు పెట్టాలని సూచించాడు. ఈవిషయంలో గురువారం ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, చివరకు వివాదానికి కారణమైంది. ఇదే విషయమై ఊరు ఊరంతా రెండు వర్గాలుగా చీలిపోయి..రాళ్లు రువ్వుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న హస్నాబాద్ పోలీసులు.. గ్రామానికి చేరుకొని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. అయితే అదే రోజు సాయంత్రం గ్రామంలో మళ్ళీ ఘర్షణలు చెలరేగాయి. కొందరు గ్రామస్తులు స్థానికంగా ఉన్న శివాజీ మహారాజ్ విగ్రహాన్ని కూల్చేందుకు ప్రయత్నించగా..తీవ్ర వివాదం చెలరేగి..చివరకు ఘర్షణలకు దారి తీసింది. ఈక్రమంలో గ్రామస్థులను అదుపుచేసేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపి, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈమొత్తం దాడిలో 10 మంది గ్రామస్తులు గాయపడ్డారు. దీంతో పోలీసులపై పగబట్టిన గ్రామస్తులు…చందాయ్ ఏకో గ్రామానికి వచ్చే రోడ్లను దిగ్బంధించారు.

Read Others:Delhi Mundka fire: ఢిల్లీ అగ్ని ప్రమాదం.. ఇద్దరిపై కేసు నమోదు

పరిస్థితి చేయి ధాటి పోతుండడంతో భారీగా పోలీసు బలగాలు మోహరించి, రిజర్వు ఫోర్స్ ను కూడా రంగంలోకి దింపారు. పోలీసులపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. ఈఘటనలో ఒక అడిషనల్ ఎస్పీ సహా మొత్తం 30 మంది పోలీసు సిబ్బంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని పోలీసు ఉన్నతాధికారులు..ఆసుపత్రికి తరలించారు. ఈనేపధ్యంలో శుక్రవారం సాయంత్రం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిన అనంతరం చందాయ్ ఏకో గ్రామానికి చేరుకున్న పోలీసుల బృందం దాడికి పాల్పడిన మొత్తం 300 మందిపై కేసులు నమోదు చేశారు. ఈఘటనలో 3 పోలీస్ వాహనాలు ధ్వంసం కాగా, 34 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం చందాయ్ ఏకో గ్రామం సాయుధ దళాల పహారాలో ఉందని, పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఇంచార్జి ఎస్పీ హర్ష పొద్దార్ వివరించారు.