×
Ad

జనసేన ఎమ్మెల్యేకు టీడీపీ ఇంచార్జ్‌ నుంచి సెగలు.. తానే ఎమ్మెల్యేను అన్నట్లుగా టీడీపీ ఇంచార్జ్ పనిచేస్తున్నారా?

కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంటే, క్యాడర్ వార్‌కు దారితీస్తుందని.. అదే జరిగితే స్థానిక, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోందట క్యాడర్.

Tadepalligudem: పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కూటమి పాలిటిక్స్‌ ఆసక్తికరంగా మారాయి. కూటమిలో కీలకంగా ఉన్న జనసేన, టీడీపీ నేతల మధ్య దూరం అంతకంతకూ పెరుగుతూనే ఉంది తప్ప, గ్యాప్‌ తగ్గడం లేదు. లేటెస్ట్‌గా మరోసారి స్వయంగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలతో దుమారం మరింత తీవ్రంగా మారుతున్నట్లు తెలుస్తుంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే మాణిక్యాలరావును మిత్రపక్షాలు ఇబ్బందిపెడితే, ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌కు కూడా మిత్రపక్షాలే పక్కలో బల్లెంలా తయారయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో సీటు కేటాయింపు నుంచి.. తాడేపల్లిగూడెం టీడీపీ ఇంచార్జ్‌ వలవల బాబ్జీ.. జనసేన ఇంచార్జ్‌, ఇప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మధ్య గ్యాప్ నడుస్తూనే ఉందట. రాజీ కుదిర్చి ఆ ఇద్దరు నేతలను ఒకేతాటిపైకి తెచ్చేందుకు కూటమి అధినేతలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా వర్కౌట్ కావట్లేదట. తాను పోతే, తన తర్వాత ఎమ్మెల్యే అవుతానంటూ కొందరు చెప్పుకుంటున్నారంటూ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు జనసేన క్యాడర్‌తో పాటు, ప్రజల్లో కూడా చర్చకు దారితీశాయి. ఒకరు ఉండగానే, అలా ఎలా మాట్లాడతారంటూ, టీడీపీ నేతల తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించినట్లు టాక్ నడుస్తోంది.

Also Read: కాంగ్రెస్ బ్లేమ్‌ గేమ్‌కు బీజేపీ, బీఆర్ఎస్ పరేషాన్.. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?

టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జీని ఉద్దేశించే బొలిశెట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. పెద్దలు జోక్యం చేసుకోవడం, ఇద్దరి మధ్య రాజీ చేయడం, ఆ తర్వాత వలవల బాబ్జీకి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్ పదవి ఇవ్వడంతో, అంతా సెట్‌ అయిపోయిందనుకున్నారట. కానీ..బొలిశెట్టి శ్రీనివాస్‌ను కాదని..తానే ఎమ్మెల్యేను అన్నట్లుగా అధికారులను, లీడర్లను బెదిరిస్తున్నారంటూ బాబ్జీ మీద ఆరోపణలు చేస్తున్నారు జనసేన నేతలు.

కుటుంబం అన్నాక చిన్న చిన్న ఇష్యూస్‌ కామన్ అని సర్దిచెప్పుకున్నవారంతా..తాజా పరిణామాలతో మళ్లీ ఇంటర్నల్ వార్ రచ్చకెక్కేలా ఉందని టెన్షన్ పడుతున్నారట. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పార్టీ గేట్లు ఎత్తి, జనసేన పార్టీలోకి చేరికలను ఆహ్వానించారట. దీంతో తాడేపల్లిగూడెం మండలం చిన్నతాడేపల్లిలో వైసీపీ నుంచి జనసేనలో చేరికలు జరిగాయి. అయితే అదే వేదికపై, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు, గూడెం కూటమిలో కుంపటికి నిదర్శనమన్న టాక్ వినిపిస్తోంది.

అగ్గిరాజేసినంత పనిచేసిన బొలిశెట్టి వ్యాఖ్యలు
తాను ఉండగానే, రాబోయే ఎన్నికల్లో తానే ఎమ్మెల్యే అంటూ అధికారులనూ, నాయకులనూ, కొందరు బెదిరిస్తున్నారంటూ బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు అగ్గిరాజేసినంత పనిచేశాయి. టీడీపీ ఇంచార్జ్‌ వలవల బాబ్జీని ఉద్దేశించే బొలిశెట్టి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారంటూ, క్యాడర్ చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యే మీటింగ్‌కు ఎవరూ వెళ్లకూడదు అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారని జనసేన లోకల్ లీడర్లు వాపోతున్నారు. అయితే తానే ఎమ్మెల్యేనంటూ అధికారులను, లోకల్ లీడర్లను బెదిరిస్తున్న వారిపై సీఎం సీరియస్ అయినట్లు తెలుస్తుంది మరోవైపు జనసేన ఎమ్మెల్యేలు అంటే అంత చులకనా..? అంటూ ఫైర్ అవుతున్నారట మరికొందరు వీరాభిమానులు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పట్టుమని రెండేళ్లు కాలేదు. కానీ అప్పుడే తాడేపల్లిగూడెంలో సీటు ఫైట్ నడుస్తుందన్న చర్చకు దారితీస్తోంది. అయితే జనసేన ఎమ్మెల్యేతో పాటు జననేత నేతల నుంచి ఇండైరెక్ట్‌గా ఇన్ని ఆరోపణలు వస్తున్నా టీడీపీ నేతలు రియాక్ట్ కాకపోవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది. అంటే మౌనం అంగీకారమా లేక..జనసేన ఎమ్మెల్యేపై వ్యాఖ్యలు చేస్తున్నది తాము కాదని చెప్పాలనుకుంటున్నారా అన్నది హట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ ఇద్దరి నేతల మధ్య కోల్డ్‌వార్‌..తాడేపల్లి గూడెంలో కూటమి క్యాడర్‌ను అయోమయానికి గురిచేస్తోందట.

కూటమి నేతల మధ్య గ్యాప్ ఉంటే, క్యాడర్ వార్‌కు దారితీస్తుందని.. అదే జరిగితే స్థానిక, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతోందట క్యాడర్. ఇప్పటికైనా గూడెం పాలిటిక్స్‌లో నేతల ఫైట్‌కు చెక్ పెట్టాలని కోరుతున్నారట కార్యకర్తలు. మొత్తానికి, విపక్షానికి అవకాశం ఇవ్వకుండా, మిత్రపక్షాలే విమర్శించుకుంటూ, కాలుదువ్వుకుంటున్న తాడేపల్లిగూడెం కూటమి పాలిటిక్స్‌ అయితే ఆసక్తికరంగా మారాయి.

బొలిశెట్టి వర్సెస్ బాబ్జీ మధ్య గ్యాప్‌ను అధినేతలు సెట్ చేస్తారా..? జనసేన ఎమ్మెల్యే ఆవేదనపై అధినేత పవన్ స్పందిస్తారా..? తెలుగు తమ్ముళ్లపై వస్తున్న ఆరోపణలను టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పుడు ముగిస్తారనేది.తాడేపల్లిగూడెం రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కూటమి లీడర్ల వార్‌కు ఎలాంటి ముగింపు పలుకుతారో చూడాలి మరి.