కాంగ్రెస్ బ్లేమ్ గేమ్‌కు బీజేపీ, బీఆర్ఎస్ పరేషాన్.. ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పోటీ చేస్తాయా?
గతంలో బీఆర్ఎస్‌తో పొత్తు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో 2018 , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని నేతలు గుర్తు చేస్తున్నారట.
BRS: అటు.. ఇటు తిరిగింది.. కథ మళ్లీ మొదటికి వచ్చింది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ అప్పుడు చర్చ టాక్స్. కారు, కమలం పొత్తు అంటూ లేటెస్ట్ హాట్ టాపిక్. పంచాయతీ ఎన్నికల వేళ అటు గులాబీ క్యాడర్‌లో..ఇటు కాషాయ దళంలో చర్చకు దారితీస్తోన్న అతిపెద్ద అంశమిది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని గత ఎన్నికలప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు.
బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అని..గులాబీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ రకరకాల విమర్శలు, ఆరోపణలు, గాసిప్‌లు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ జరుగుతున్న టైమ్‌లో బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు కొత్త రచ్చ..అటు కారు..ఇటు కమలం క్యాడర్‌లో ఇంట్రెస్టింగ్ డిస్కషన్‌గా మారింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ పొత్తు పెట్టుకోబోతున్నాయని..బీజేపీ హైకమాండ్‌తో గలాబీ పార్టీ నేతల ప్రాథమిక చర్చలు కంప్లీట్ అయ్యాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాదిలో బీజేపీ, బీఆర్ఎస్ ఎన్నికల పొత్తుపై స్పష్టత వస్తుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
Also Read: కాంగ్రెస్ నేతలకు పంచాయతీ ఎన్నికల టాస్క్.. ఉన్న పదవి ఊస్ట్ కావొద్దన్నా.. పదోన్నతి రావాలన్నా..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్‌తో బీజేపీ పొత్తు ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఇటు బీజేపీలో, అటు గులాబీ పార్టీలో చర్చ జరుగుతోంది. కేవలం చర్చ మాత్రమే కాదు..ఈ రెండు పార్టీల్లో కొంత మంది నాయకులు అది జరుగుతుందని నమ్ముతున్నారట కూడా.
ఓ వైపు ప్రచారం.. మరోవైపు కొట్టిపారేస్తున్న నేతలు
బీజేపీ, బీఆర్ఎస్.. రెండు పార్టీలు ఒక్కటేనని పదే పదే అధికార కాంగ్రెస్ ప్రచారం చేయడం కూడా ఇందుకు కారణమన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవకతవకలు విచారణలు చేపించకపోవడానికి..కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో గులాబీ పార్టీకి ఉన్న మధ్య రహస్య బంధమే కారణమని ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. దానికి కొనసాగింపులో భాగంగానే రాబోయే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ కలిపి పోటీ చేస్తాయన్న చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్‌తో పొత్తు ప్రచారాన్ని బీజేపీ అధిష్టానం కొట్టిపారేసినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ వచ్చిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో బీఆర్ఎస్‌తో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు..అలాంటిదేమి లేదని క్లారిటీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ఎవరితో పొత్తు ఉండదని, అపోహలు మాని వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సంతోష్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
పొత్తులకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఇలా ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చినా తెలంగాణ కమలనాథులకు మాత్రం ఎక్కడో డౌట్ కొడుతోందట. కాంగ్రెస్ పార్టీ సందర్భం దొరికినప్పుడల్లా బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నా..బీజేపీ పెద్దలు మాత్రం అంతర్గత సమావేశాల్లో అలాంటిదేమి లేదని చెప్పడం మినహా.. దీటుగా తిప్పికొట్టడం లేదన్న టాక్ వినిపిస్తోంది.
గతంలో బీఆర్ఎస్‌తో పొత్తు ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలం కావడంతో 2018 , 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి నష్టం జరిగిందని నేతలు గుర్తు చేస్తున్నారట. 2018 ఎన్నికలకు ముందు అప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు ఉండదని చెప్పినా..కొంత మంది బీజేపీ ముఖ్యనేతలు నమ్మలేని అంటున్నారు. ఇలా కొందరు నాయకులు అనుమానంతోనే కాలం వెల్లదీయడంతో ఆ ప్రభావం అప్పటి ఎన్నికల్లో గట్టిగానే పడిందన్న చర్చ జరుగుతోంది.
ఇక రెండేళ్ల క్రితం 2023లో జరిగిన ఎన్నికల్లోను బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటేనన్న ప్రచారం జోరుగా జరిగింది. దాన్ని తిప్పికొట్టడంలో బీజేపీ విఫలమైందని, అందుకే ఇంకా కొన్ని ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకోవాల్సి ఉన్నా.. 8కి పరిమితం కావాల్సి వచ్చిందని అంటున్నారట. ఇక బీజేపీతో పొత్తుపై ఇటు బీఆర్ఎస్ పార్టీలోనూ చర్చ జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు సందర్భం వచ్చినప్పుడల్లా ఎవరితో పొత్తు ఉండదని చెబుతూనే ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. అయినా రెండు పార్టీల నేతల్లో ఎక్కడో చిన్న అనుమానం మాత్రం ఉందట. మరి పొత్తు ఉంటుందో లేదో కాలం..రాజకీయ పరిస్థితులే డిసైడ్ చేయాలి.
