Tadipatri High Tension: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది.
దమ్ముంటే రా.. అంటూ.. ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. వారి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్ల పర్వం తాడిపత్రి రాజకీయాల్లో మరింత హీట్ పెంచింది.
ఇరువర్గాల మధ్య ఘర్షణ పూరిత వాతావరణంతో ఎప్పుడేం జరుగుతుందోనని స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మరోవైపు పోలీసులు అలర్ట్ అయ్యారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరక్కుండా భారీగా మోహరించారు. గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
హైకోర్టు పర్మిషన్ తో పోలీసుల భద్రతతో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి బయలుదేరారు. దీంతో తాడిపత్రిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
అప్రమత్తమైన పోలీసులు 750 మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారిన వేళ కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
నారాయణరెడ్డిపల్లి దగ్గర ఆయనను అడ్డగించారు. దీంతో పోలీసుల తీరుపై పెద్దారెడ్డి ఫైర్ అయ్యారు.
స్థానికంగా లా అండ్ ఆర్డర్ సమస్య ఉందని పోలీసులు కోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పుట్లూరు మండలం నారాయణరెడ్డిపల్లి వద్ద పెద్దారెడ్డి రోడ్డుపైనే ఉన్నారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పెద్దారెడ్డి.. జేసీ ప్రభాకర్ రెడ్డికి సవాల్ విసిరారు.
”నాకు దమ్ముందో లేదో తెలియాలంటే.. జేసీ ప్రభాకర్ రెడ్డిని..నిద్రలో లేపి అడగండి.. జేసీ ఉలిక్కిపడకపోతే, నాకు దమ్ము లేనట్లే.
జేసీ ఉలిక్కిపడితే ఆయనకు దమ్ముందో లేదో ఆయనకే తెలుస్తుంది. ప్రతి రోజు నా గురించి మాట్లాడుతున్నారు.
ఉలిక్కి పడుతున్నారు. నిద్ర లేని రాత్రులు గడిపేది నాకు తెలుసు. జేసీ ఒక ప్రోగ్రామ్ పెట్టాలంటే.. పొద్దున టిఫిన్ ఉందని..20 సార్లు ఫోన్ చేయాలి. (Tadipatri High Tension)
అలాంటి నీచమైన సంస్కృతి నాకు లేదు. డొంక తిరుగుడు మాట్లాడేది నాకు రాదు.
చేతనైతే జేసీ కొట్లాటకు వస్తే నేను కొట్లాడతా. రాకపోతే జేసీ పని జేసీ చేసుకుంటాడు. నా పని నేను చేసుకుంటా. నన్ను రోడ్డులో ఎందుకు కూర్చోపెట్టారు, ఇంట్లో కూర్చోపెట్టమని జేసీ పోలీసులతో చెప్పగలరా?
ఏదో ఒక రోజు నేనే చూసుకుంటాను అని చెప్పే దమ్ము ఉందా. జేసీకి అంత ధైర్యం లేదు. ఆయన వయసు 74ఏళ్లు. అలాంటి వ్యక్తితో నేను యుద్ధం చేయను.
కోర్టు ఆర్డర్ ఇవ్వడంతో పోలీసులు నాకు సెక్యూరిటీ ఇచ్చారు. పోలీసులను పావుగా వాడుకుని నన్ను ఇంటి నుంచి బయటకు పంపిస్తా వచ్చాడు. దమ్ముంటే రా అనడం కామెడీగా ఉంది.
జేసీ ధైర్యస్తుడే అయితే పోలీసులను అడ్డం పెట్టుకోవద్దు. జేసీకి దమ్ముంటే పోలీసులతో చెప్పాలి. నన్ను నా ఇంట్లోకి పంపమని చెప్పాలి” అని సవాల్ విసిరారు కేతిరెడ్డి పెద్దారెడ్డి.
Also Read: జస్ట్ నెల రోజుల్లో.. 18 కిలోల బరువు తగ్గిన సింగర్.. ఇదెలా సాధ్యమైంది.. సీక్రెట్ ఏంటి..