Chandrababu Naidu : చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ.. ఏయే అంశాలపై చర్చించారంటే

భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి.. మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని నిర్ణయించారు..

Chandrababu Meeting With Pawan Kalyan (Photo : Google)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ ముగిసింది. వీరి భేటీలో కీలక అంశాలపై చర్చించారు. చంద్రబాబు, పవన్ భేటీ వివరాలను జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఎన్నికల వ్యూహం, ఏపీకి చక్కటి పరిపాలన అందించేందుకు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం ఎలా కలిసి పని చేయాలి అనే అంశాలపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారు అని మనోహర్ తెలిపారు. వ్యూహాలు, రాజకీయ అంశాలు, పార్టీ పరంగా సంస్థాగతంగా చేయాల్సిన కార్యక్రమాలపై చర్చలు జరిగాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇరు పార్టీల నాయకులు కలిసికట్టుగా విజయం సాధించి.. మంచి ప్రభుత్వం, పరిపాలన అందించాలని నిర్ణయించారు అని నాదెండ్ల మనోహర్ వివరించారు.

”తప్పకుండా ఏపీ ప్రజలకు ఒక మంచి భవిష్యత్తు ఉండే విధంగా ఈ చర్చలు జరిగాయి. భవిష్యత్తులోనూ అన్ని కార్యక్రమాలను ఇరు పార్టీల కేడర్, నాయకులు కలిసికట్టుగా నిర్వహించడంపై డిస్కస్ చేశారు. రేపటి రోజున మంచి ప్రభుత్వం మంచి పరిపాలన అందించే విధంగా తగిన చర్యలు తీసుకుని ముందుకెళ్తామని ఇరు పార్టీల అధినేతలు నిర్ణయించారు. సీట్ల సర్దుబాటు, ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పనపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ సుదీర్ఘంగా రెండున్నర గంటల సేపు చర్చించారు” అని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Also Read : ఎన్నికల్లో గెలుపే లక్ష్యం అంటున్న పవన్ కల్యాణ్.. నేర్చుకోవాల్సింది ఏమిటి? సరిదిద్దుకోవాల్సింది ఏమిటి?

ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టీడీపీ-జనసేన వ్యూహాల్లో వేగం పెంచారు. ఇరు పార్టీల మధ్య పొత్తు బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. ఏపీ ఎన్నికలు, తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు. త్వరలో రాయలసీమలో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నాయి రెండు పార్టీలు. ఉమ్మడి మ్యానిఫెస్టోను ప్రకటించేందుకు కార్యాచరణను సిద్ధం చేసే అంశంపై చర్చించారు.

ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉమ్మడి మ్యానిఫెస్టో కోసం ఇరు పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ పలుమార్లు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అయితే, తొలిసారిగా పవన్ కల్యాణ్ ఇంటికి చంద్రబాబు వెళ్లారు. హైదరాబాద్ మాదాపూర్ లోని పవన్ కల్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. ఈ సందర్భంగా ఇరువురు ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Also Read : ఎన్నికల ఫలితాలు ఊహకు అందవు, 160 సీట్లలో గెలుపు గ్యారెంటీ- అచ్చెన్నాయుడు సంచలనం

దాదాపు పదేళ్ల తర్వాత పవన్ ఇంటికి వెళ్లారు చంద్రబాబు. 2014 ఎన్నికలకు ముందు పవన్‌ కల్యాణ్ నివాసానికి చంద్రబాబు వెళ్లారు. మళ్లీ వెళ్లడం ఇదే తొలిసారి. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతిచ్చింది. 2019 ఎన్నికల్లో వేర్వేరుగానే పోటీ చేశాయి. ఏపీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలిసి వెళ్లాలా? వద్దా? అనే అంశంపైనా చంద్రబాబు, పవన్ చర్చించినట్లు తెలుస్తోంది.