Kodali Nani
Kodali Nani : ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో టీడీపీ విలీనానికి తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి అన్నారు. టీడీపీతో బీజేపీ, జనసేన ఎట్టిపరిస్థితుల్లోనూ కలవవని చంద్రబాబుకు తెలుసని.. అలాగే లోకేశ్ వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని చంద్రబాబుకి అర్థమైపోయిందని… ఈ క్రమంలో ఒంటరిగా పోటీ చేస్తే టీడీపీ గెలిచే అవకాశాలు లేవని చంద్రబాబు భావిస్తున్నారని, అందుకే పార్టీని బీజేపీలో కలిపేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి కొడాలి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబుపై మంత్రి కొడాలి నాని విమర్శలు చేశారు. చంద్రబాబు దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఆయన సొంత కులానికి న్యాయం చేసుకోవడమేనని విమర్శించారు. కానీ సీఎం జగన్ అన్ని వర్గాల వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చారని వెల్లడించారు. ఆర్థిక, సామాజికంగా వెనుకబడిన వారికి ఒకేసారి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, మహిళా సాధికారత కోసం సీఎం జగన్ కృషి చేస్తున్నారని మంత్రి చెప్పారు.
రైతుల ముసుగులో టీడీపీ నేతల నాటకాలాడుతున్నారంటూ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. రెండేళ్లలో 83 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదని, గత ఐదేళ్ల పాలనలో చెల్లించింది.. తాము ఏడాదిలోనే చెల్లించామన్నారు. ధాన్యం కొనుగోలు చేసి రైతులకు డబ్బులివ్వలేదని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు రూ. 5,056 కోట్లు చెల్లించాలని, ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాల్సిన ప్రతి పైసా ఇస్తామని కొడాలి నాని చెప్పారు.