Kotamreddy Sridhar Reddy : తనను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విషయం తెలియడంతో షాక్‌కి గురయ్యానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఆయన హత్యకు కుట్ర చేస్తున్నట్టుగా ఉన్న ఓ వీడియో బయటకు రావడంతో తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. రౌడీలు, గూండాలకు తాను భయపడబోనన్నారు. హుందా రాజకీయాలకు మారుపేరైన నెల్లూరు జిల్లాలో హత్యా రాజకీయాలకు తెరతీయడం దారుణమన్నారు.
Also Read: ఉత్తరాంధ్రపై కూటమి వ్యూహం అదేనా? సాగర తీరం నుంచి జనసేనాని ప్రత్యేక వ్యూహరచన
కొందరు రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వారు రూరల్ ఎమ్మెల్యేను చంపేస్తే డబ్బేడబ్బు అని ఒకరు అంటే చంపేద్దామని ఇంకొకరు అన్నారు. మరొకరు రేపు ఉదయం మాట్లాడుకుందాం అన్నట్టు వీడియోలో ఉంది. దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారని శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ విషయం తమకు మూడు రోజుల క్రితమే తెలుసన్న జిల్లా ఎస్పీ కామెంట్స్ పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల ముందు తెలిస్తే తనకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదని.. కనీసం భద్రతాపరంగా చర్యలు తీసుకోమనలేదన్నారు.
తనను హత్య చేస్తే డబ్బేడబ్బు అని అన్నట్టుగా ఉందని.. ఆ డబ్బు ఎవరిస్తారని శ్రీధర్ రెడ్డి ప్రశ్నించారు. దీనికి ఫలానా వాళ్లు కారణం అని తాను చెప్పకముందే వైసీపీ ఎందుకు భుజాలు తడుముకుంటోందని నిలదీశారు. కోటంరెడ్డి మిథున్ రెడ్డి కుట్ర అని ఎందుకు పుకార్లు లేపుతున్నారని ప్రశ్నించారు.
రాజ్యాధికారం కోసం, రాజ్యం కోసం సొంత ఇంట్లో కుటుంబసభ్యులను చంపుకునే సంప్రదాయం మీ కుటుంబంలో ఉందేమో కానీ తమకు లేదన్నారు. ఆస్తుల కోసం, అంతస్తుల కోసం తోడబుట్టిన వారిని వేధించి వెంటాడే చరిత్ర వైసీపీ డీఎన్‌ఏలో ఉందని తమ డీఎన్‌ఏలో లేదన్నారు. వాళ్ల బెదిరింపులకు తాను భయపడబోనన్నారు.
జగన్ పవర్ లో ఉన్నప్పుడే ఆయన్ను ధిక్కరించి బయటకు వచ్చానన్నారు. ‘నన్ను, మా తమ్ముడిని బండికి కట్టేసుకుని లేపేస్తామన్నారు. అలాంటి బెదిరింపులకు కూడా మేం భయపడం.’ అని కోటంరెడ్డి ప్రకటించారు. అవసరమైతే ఎవరితో అయినా ఢీకొంటానన్నారు. కొండలనైనా ఎదుర్కొంటానన్నారు.