ఇకపై చేరికలకు షరతులు.. టీడీపీ న్యూరూల్స్..! జాయినింగ్స్‌పై అధిష్ఠానం ఆలోచన ఏంటి?

టీడీపీ వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తుండటం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందట.

CM Chandrababu Naidu

అనుభవం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఈ విషయంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాలా ఫాస్ట్‌ ఉంటారు. అది ఓటమైనా, గెలుపైనా ఏదైనా సరే ఆ అనుభవం నుంచి తప్పులు రెక్టిఫై చేసుకోవడంలో ముందుంటారు. ఇప్పుడు చేరికల విషయంలోనూ సేమ్‌ స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు చంద్రబాబు. వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు చాలా మంది నేతలు వెయిట్ చేస్తున్నారు.

ఆ వరుసలో మాజీమంత్రులు, మాజీ కార్పొరేషన్‌ ఛైర్మన్లతో పాటు కీలక లీడర్లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం షాకింగ్ డెసిషన్‌ తీసుకుంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి నేతల వరకు ఎవరినీ..ఏ పార్టీ నుంచి లీడర్లనైనా టీడీపీలో చేర్చుకోవాలనుకుంటే మస్ట్‌గా పార్టీ హెడ్‌ ఆఫీస్‌కు సమాచారం ఆర్డర్స్‌ ఇచ్చేసింది. చంద్రబాబు ఆదేశాల అనుగుణంగానే చేరికలు ఉంటాయని స్పష్టం చేసింది.

Also Read: రోజుకో ట్విస్ట్‌తో కాక రేపుతోన్న కాళేశ్వరం విచారణ.. వాట్‌ నెక్స్ట్‌?

చేరికల విషయంలో టీడీపీ కండీషన్స్ పెట్టడానికి పెద్ద రీజనే ఉందట. మహానాడులో చంద్రబాబు చేసిన కామెంట్సే అందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు. కోవర్టులుగా కొందరు పార్టీలోకి వస్తున్నారు..వాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని క్యాడర్‌, లీడర్లకు పిలుపునిచ్చారు.వలస పక్షులు వస్తూంటాయి పోతూంటాయన్న తమ టార్గెట్‌లను ఫినిష్‌ చేసేందుకు కొందరు టీడీపీలో చేరి..డ్రామాలు ఆడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. ఆ తర్వాత టీడీపీ ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇతర పార్టీల నుంచి వచ్చి టీడీపీలో చేరే వారి విషయంలో ఒకటికి పదిసార్లు స్క్రీనింగ్ టెస్ట్ చేస్తామని స్పష్టం చేసింది.

అంతే కాదు జిల్లా కమిటీలు అన్నీ కూడా కేంద్ర నాయకత్వానికి పార్టీలో చేరే వారి వివరాలు ఇవ్వాలని కోరింది. దాంతో పాటు ఇక జాయినింగ్స్‌పై టీడీపీ అధినాయకత్వం పెద్దగా సుముఖత వ్యక్తం చేయడం లేదు అని అంటున్నారు. ఇప్పటికే టీడీపీ హౌస్ ఫుల్ గా ఉండడంతో పాటు ఇటీవల మహానాడులో తీసుకున్న ఆరు శాసనాలలో ప్రధానమైనదిగా ఉన్న కార్యకర్తే అధినేత అన్న దానికి కట్టుబడాలని చూస్తోందట. టీడీపీ వచ్చి చేరాలనుకున్న నాయకులు ఎంతో మంది ఉన్నా వద్దు అనే అనుకుంటోందట.

కోవర్టుల ప్రమేయంతోనే?
ఒంగోలు, మాచర్లలలో జరిగిన హత్యలు కోవర్టుల ప్రమేయంతో జరిగాయని భావిస్తోంది టీడీపీ హైకమాండ్. వైసీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగా కోవర్టులను టీడీపీలోకి పంపిస్తుందని అనుమానమంటున్నారు. కొందరు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు..ప్రభుత్వం మారగానే టీడీపీలోకి జంప్ అయ్యారని ఆలస్యంగా పసిగట్టారట. రాజకీయ రక్షణ కోసం టీడీపీలో చేరినట్లుగా నటిస్తూ పాతకక్షలు తీర్చుకోవడానికి..అధికార పార్టీగా ఉన్న టీడీపీని అస్త్రంగా వాడుకుంటున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరిందంటున్నారు.

పైగా టీడీపీ వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తుండటం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందట. పల్నాడు జంట హత్యల ఘటన వెనుక వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందనేది టీడీపీ హైకమాండ్‌ అనుమానమట. పిన్నెల్లి మద్దతుతోనే గుండ్లపాడు హత్యలు జరిగాయని..అధికారం పోవడంతోనే పిన్నెల్లికి సన్నిహితంగా ఉన్న కొందరు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించి..టీడీపీలో చేరి తమ నేతలను హతమార్చారని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. అందుకే చేరికల విషయంలో టీడీపీ స్ట్రాంగ్‌ డెసిషన్‌ తీసుకుందని అంటున్నారు.

చేరికల విషయంలో టీడీపీ నిర్ణయంతో చాలా మంది లీడర్ల ఫ్యూచర్ ఏమిటన్నది పెద్ద క్వశ్చన్‌ మార్క్. విశాఖ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లోని వైసీపీ మాజీ మంత్రులు కొందరు టీడీపీ వైపు చూస్తున్నారట. వారి ఆశలకు టీడీపీ విధానపరమైన ప్రకటన బ్రేకులు వేసే అవకాశం ఉందంటున్నారు.

దాంతో ఇంతకాలం వైసీపీలో సైలెంట్‌గా ఉన్నవారు బయటకు వచ్చి మరీ తాము పార్టీలోనే ఉన్నామని పుకార్లు నమ్మొద్దని చెప్పే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు. కొంతమంది నేతలు టీడీపీలో చేరేందుకు ముహూర్తాలు కూడా పెట్టుకున్నారని..ఇప్పుడు వాళ్లు డైలమాలో పడిపోయారని అంటున్నారు. వైసీపీలో ఉండలేక..ఇటు టీడీపీ డోర్లు క్లోజ్ చేయడంతో జంప్ అవుదామనుకున్న నేతలు రాజకీయం పూర్తిగా అయోమయంలో పడ్డారట. టీడీపీ తలుపులు ఎప్పుడు ఎలా ఎవరి కోసం తెరచుకుంటాయో చూడాలి మరి.