Somireddy Chandra Mohan Reddy : రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన సంచలన ప్రకటనపై టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. విజయసాయి రెడ్డిని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందన్నారాయన. సేద్యం చేస్తానంటున్నావ్.. దోచేసిన నల్ల డబ్బుతో చేస్తావా..ఏంటీ..? అని ప్రశ్నించారు.
ఇప్పుడు నువ్వు సేద్యంలో దిగితే రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారని నిలదీశారు. 2004 నుంచి 2009 వరకు అప్పటి సీఎం కుమారుడిని ముందు పెట్టి ఏ2గా సకల పాపాలు చేస్తివి అంటూ విజయసాయిరెడ్డిపై నిప్పులు చెరిగారు సోమిరెడ్డి. గత ఐదేళ్లూ అరాచక పాలనకు, దోపిడీకి రైట్ హ్యాండ్ గా నిలిచి ఏ2 స్థానాన్ని కొనసాగిస్తివి అని ధ్వజమెత్తారు.
”పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామా చేస్తానంటే పరిహారం జరిగేదెట్టా? ముందుగా.. అప్పుడు దోచుకున్న రూ.43 వేల కోట్లతో పాటు మొన్న ఐదేళ్లలో జగన్ రెడ్డితో కలిసి దోచేసిన రూ.లక్ష కోట్ల ప్రజల సొత్తు బయటపెట్టు. దోచేసిన మొత్తం పాపపు సొత్తు ఎక్కడుందో చెప్పు.. అప్పుడైనా నిన్ను భగవంతుడు క్షమించే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే చేసిన పాపాలకు సంబంధించిన కేసుల భయం స్పష్టంగా కనిపిస్తోంది.
అంతేనా లేక నీతో పాటు నీ అల్లుడి కంపెనీ అరబిందోను కాపాడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారా? ఈ రాజీనామాల పరంపర ఒక్క విజయసాయిరెడ్డితో ఆగేటట్టు కూడా లేదు. రాత్రికో, రేపు రాత్రి లోపల మరో ఒకరిద్దరు సభ్యులు కూడా రాజీనామా చేసినా ఆశ్చర్యపోనక్కర లేదు” అని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.
Also Read : ఇది ధర్మమా..! వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి బండ్ల గణేశ్ సంచలన ట్వీట్..
వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. శనివారం తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే, తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదన్నారు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బు ఆశించి తాను పదవికి రాజీనామా చేయడం లేదని తేల్చి చెప్పారు విజయసాయిరెడ్డి. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తిగతం అని స్పష్టం చేశారు. తనపై ఎలాంటి ఒత్తిళ్లు లేవన్నారు. తనను ఎవరూ ప్రభావితం చెయ్యలేదని క్లారిటీ ఇచ్చారు.