TDP Ticket Fight in Vizianagaram
ఎన్నికలకు సమయం సమీపిస్తోంది… వచ్చే 50-60 రోజుల్లోనే ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత ప్రకటిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల శంఖారావం పూరించేశారు. ఒకవైపు చంద్రబాబు.. మరోవైపు యువనేత లోకేశ్ సభలు సమావేశాలతో హోరెత్తిస్తున్నారు. ఎన్నికల యుద్ధానికి క్యాడర్‌ను సిద్ధం చేస్తున్నారు..
ఇంతవరకు అంతా బాగుంది సరే.. మరి యుద్ధంలో తలపడాల్సిన అభ్యర్థులో..? అభ్యర్థుల ప్రకటనపై ఈ నాన్చుడు ఎందుకో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రత్యర్థుల బలంగా ఉన్నచోట అభ్యర్థులపై స్పష్టత లేకపోతే.. వచ్చే 50-60 రోజుల్లో ఎన్నికల రణరంగంలో విజేతలుగా నిలవడం సాధ్యమా? అన్నదే తెలుగుతమ్ముళ్లను వేధిస్తున్న సందేహం.. మరి ఈ చిక్కుముడికి చినబాబు లోకేశ్ పర్యటనలోనైనా ముగింపు చెబుతారా?
మంత్రి బొత్స బ్రేకులు..
ఉమ్మడి విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కునికిపాట్లు తప్పడంలేదు. ఒకప్పుడు జిల్లాలో తిరుగులేని తెలుగుదేశం పార్టీకి మంత్రి బొత్స బ్రేకులు వేసేశారు. 2004 అసెంబ్లీ ఎన్నికల నుంచి టీడీపీకి విజయనగరం జిల్లా ఏ మాత్రం కలిసిరావడం లేదు. బొత్స నాయకత్వంలో వైసీపీ బలంగా ఉండటంతో గత ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసింది ఫ్యాన్ పార్టీ.
ఇక వచ్చే ఎన్నికలకు కూడా జిల్లాలో ఆ పార్టీలో మార్పులు చేర్పులు చేసే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో మూడు చోట్ల బొత్స కుటుంబ సభ్యులు, మరో మూడు చోట్ల ఆయన అనుచరులు.. ఇంకో మూడు ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో బలమైన నేతలతో వైసీపీ పటిష్టంగా కనిపిస్తోంది.. ఇదేసమయంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా తయారైంది.
ఆశావహులు ఇద్దరు, ముగ్గురేసి..
జిల్లాలో ఒకటి రెండు నియోజకవర్గాలు తప్పిస్తే, మిగిలిన ప్రతిచోటా టీడీపీలో టికెట్ ఫైట్ జరుగుతోంది. ఆశావహులు ఇద్దరు ముగ్గురేసి ఉండటం.. ఎవరి ప్రయత్నాల్లో వారు బిజీగా ఉంటూ గ్రూపురాజకీయాలకు తెరతీయడంతో ఆగమ్యగోచరంగా తయారైంది టీడీపీ పరిస్థితి. ఎవరు అభ్యర్థి అవుతారో తెలియక.. ఎవరి వెంట తిరగాలో తేల్చుకోలేక కార్యకర్తలు తర్జనభర్జన పడుతున్నారు. ఈ పరిస్థితిని చక్కదిద్దాల్సిన జిల్లా టీడీపీ నాయకత్వం కానీ, రాష్ట్ర పార్టీ కానీ నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తుండటంతో చుక్కాని లేని నావలా తయారైంది విజయనగరం జిల్లా టీడీపీ పరిస్థితి.
టికెట్ కోసం అంతర్యుద్ధం?
విజయనగరం, బొబ్బిలి మినహా మిగిలిన నియోజకవర్గాల్లో టికెట్ కోసం అంతర్యుద్ధమే జరుగుతున్నట్లు చెబుతున్నారు. కీలకమైన చీపురుపల్లి నియోజకవర్గంలో మంత్రి బొత్సకు ప్రత్యర్థిగా యువనేత నాగార్జునను ఎప్పుడో తేల్చేశారు అధినేత చంద్రబాబు. కానీ, ఎన్నికల ముందు ఐవీఆర్‌ఎస్ సర్వే పేరిట కొత్త పేర్లు ప్రచారంలోకి రావడంతో ఆ నియోజకవర్గంలో అయోమయ పరిస్థితి ఏర్పడుతోంది.
బొత్సకు దీటుగా నియోజకవర్గంలో దూసుకుపోతున్న నాగార్జునను తప్పించాలనే ఆలోచన లేకపోయినా, కొత్తపేర్లు తెరపైకి రావడంతో ఆయన వ్యతిరేక వర్గం కార్యకర్తల్లో అయోమయం సృష్టించే ప్రచారానికి శ్రీకారం చుట్టింది. ఇదేవిధంగా… పార్టీకి గట్టి పట్టున్న ఎస్.కోట నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి పోటీకి రెడీ అవుతున్నారు. ఆమెకు పోటీగా ఎన్‌ఆర్‌ఐ గొంప కృష్ణ టికెట్ రేసులోకి దూసుకొచ్చారు. తనకు అధిష్టానం మాటిచ్చిందని ఆయన ఓ వైపు తిరుగుతుండటంతో కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది.
పార్వతీపురం, సాలూరులోనూ..
ఇలాంటి వాతావరణం ఏ ఒక్క నియోజకవర్గానికో పరిమితం కాలేదు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లోనూ ఇదేపరిస్థితి కనిపిస్తోంది. పార్వతీపురం ఇన్‌చార్జిగా బోనెల విజయచంద్రను నియమించింది టీడీపీ అధిష్టానం. విజయచంద్రకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవుల వర్గం పనిచేస్తోందన్న వాదన ఉంది. ఇక్కడ మరో ముగ్గురు నేతలు కూడా టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పార్వతీపురం నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీశ్ కూడా విజయచంద్ర అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. కానీ, చంద్రబాబు విజయచంద్రనే అభ్యర్థిగా తేల్చేశారంటున్నారు. కానీ, ఈ గ్రూపు గోలే పార్టీలో అయోమయం సృష్టిస్తోంది. ఇక సాలూరు నియోజకవర్గంలో టికెట్టు పోరు మరీ తీవ్రంగా ఉంది. ఇన్‌చార్జ్ గుమ్మడి సంధ్యారాణికి టికెట్టు రాకుండా…. మాజీ ఎమ్మెల్యే ఆర్‌పీ భంజ్ దేవ్ వర్గం తీవ్రంగానే పోరాడుతోంది. సంధ్యారాణికి ప్రత్యామ్నాయంగా టీచర్ తేజోవతిని తెరపైకి తీసుకువస్తోంది భంజ్‌దేవ్ వర్గం.
గ్రూపు తగాదాలతో..
ఇక మరో ఎస్టీ నియోజకవర్గం కురుపాంలో కూడా అధికార పార్టీకి దీటుగా పోరాడాల్సిన టీడీపీ… గ్రూపు తగాదాలతో కొట్టుమిట్టాడుతోంది. కురుపాం టీడీపీ ఇన్‌చార్జిగా తోయిక జగదీశ్వరిని నియమించింది.. ఆమెకు మాజీ మంత్రి శత్రుచర్ల ఆశీస్సులు ఉండగా, ఇప్పుడు వైరిచర్ల వంశానికి చెందిన వీరేశ్ చంద్రదేవ్ టికెట్టు కోసం పావులు కదుపుతున్నారు. వీరేశ్ చంద్రదేవ్‌కు మాజీ మంత్రి అశోక్‌తో బంధుత్వం ఉండటంతో కురుపాం టికెట్‌పై సస్పెన్స్ ఎక్కువవుతోంది.
త్రిముఖ పోటీ
ఇదేవిధంగా గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడుతోపాటు ఆయన అన్న కుమారుడు కొండపల్లి శ్రీనివాసరావు, సీనియర్ నేత కరణం శివరామకృష్ణ మధ్య త్రిముఖ పోటీ కనిపిస్తోంది. జిల్లా పార్టీ పెద్ద అశోక్ గజపతిరాజుతో మాజీ ఎమ్మెల్యే కేఏ నాయుడికి వైరం నడుస్తోంది. దీంతో ఆశోక్ నిర్ణయంపైనే గజపతినగరం టికెట్ ఆధారపడివుంటుందంటున్నారు. ఇక నెల్లిమర్లలో పరిస్థితి మరోలా ఉంది.
టీడీపీ-జనసేన పార్టీల మధ్య పొత్తు ప్రభావం ఈ స్థానంపై ఉంటుందన్న టాక్ సర్వత్రా నడుస్తోంది. ఇక్కడ టీడీపీ ఇన్‌చార్జిగా కర్రోతు బంగార్రాజు ఉండగా, జనసేన ఇన్‌చార్జి లోకం మాధవితో ఆయన సీటుకు ఎసరు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పొత్తులో భాగంగా జనసేనకి టికెట్టు ఇవ్వాల్సివస్తే… అది నెల్లిమర్లనే అన్న టాక్ జోరుగా వినిపిస్తోంది. విజయనగరం నియోజకవర్గంలో కూడా కాస్త కన్ఫూజన్‌గానే ఉంది. తొలుత అశోక్ గజపతిరాజు పోటీ చేస్తారని అనుకున్నా, ఈ మధ్య అశోక్ కుమార్తె అదితి గజపతిరాజు మళ్లీ రంగంలోకి దిగారు. తండ్రీకూతుళ్లలో ఎవరు అభ్యర్థి అవుతారో తేలితే, విజయనగరం పార్లమెంట్ టికెట్‌పైనా స్పష్టత వస్తుందంటున్నారు.
ఇలా జిల్లావ్యాప్తంగా టీడీపీలో అయోమయం కనిపిస్తోంది. ఒకటి రెండు నియోజకవర్గాలు తప్ప, ఎక్కడా క్లారిటీ లేక, ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలో తేల్చుకోలేకపోతున్నారు కార్యకర్తలు. 14న జిల్లాకు వస్తున్న లోకేశ్ అయినా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు పార్టీ నేతలు. అంతర్గత కుమ్ములాటలకు పుల్‌స్టాప్ పెట్టి, అభ్యర్థులపై క్లారిటీ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో దెబ్బతినడం ఖాయమని అంటున్నారు.
Read Also: రాజోలు జనసేన టికెట్ కోసం పోటాపోటీ.. వీరిలో పవన్ ఎవరికి టికెట్ ఇస్తారు?