Kuppam Municipality: కాక పుట్టిస్తున్న కుప్పం.. గెలుపెవరిది..?

ఏపీవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది కుప్పం మున్సిపాలిటీ. ఎవరు నెగ్గుతారు అనేదానిపై అందరి దృష్టి పడింది.

Kuppam Municipality: కాక పుట్టిస్తున్న కుప్పం.. గెలుపెవరిది..?

Kuppam

Updated On : November 17, 2021 / 5:15 PM IST

Kuppam Municipality: ఏపీవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది కుప్పం మున్సిపాలిటీ. ఎవరు నెగ్గుతారు అనేదానిపై అందరి దృష్టి పడింది. కాసేపట్లో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం అవుతుండడంతో ఫలితాలు ఎలా రాబోతున్నాయనే దానిపై సర్వత్రా ఉత్కంఠ రేగుతోంది. కుప్పం మున్సిపాలిటీని వైసీపీ కైవసం చేసుకుంటుందా..? లేక టీడీపీనే జెండా పాతుతుందా అనే దానిపై సందిగ్ధం నెలకొని ఉంది.

కుప్పంలో 25 వార్డులు ఉండగా.. ఇందులో ఒక వార్డు ఏకగ్రీవమైంది. మిగిలిన 24 వార్డులకు ఎన్నికలు జరిగాయి. ఇక్కడ 37వేల 664 మంది ఓటర్లు ఉండగా 28వేల 942 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ 24 వార్డుల్లో ఇవాళ లెక్కింపు జరగనుంది. మరోవైపు కుప్పం మున్సిపాలిటీ ఎన్నిక ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది.

కౌంటింగ్ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించింది హైకోర్టు. ఐఏఎస్‌ ప్రభాకర్‌రెడ్డిని నియమించాలని ఆదేశించింది. ఓట్ల లెక్కింపును వీడియో రికార్డు చేయాలని ఎస్‌ఈసీకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కౌంటింగ్ వీడియో రికార్డింగ్‌ను సోమవారం న్యాయస్థానానికి సమర్పించాలని ధర్మాసనం స్పష్టంచేసింది.

కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో తామే గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. వైసీపీ కూడా కుప్పం మున్సిపాలిటీ తమదేనని అంటున్నారు. కుప్పంలో దొంగ ఓట్లు వేశారనేది అబద్ధమని వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఓటమి కోసం ప్రయత్నిస్తామని, కుప్పంలో కూడా చంద్రబాబుని ఓడిస్తామన్నారు.