Surya Chakravarthy: ఉదయం పని, రాత్రి చదువు.. కోచింగ్ లేకుండానే.. జేఈఈ మెయిన్ క్లియర్ చేసిన తెలుగు విద్యార్థి సక్సెస్ స్టోరీ

సూర్య తెలివైన విద్యార్థి. 2023లో 8.1 CGPAతో హైస్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్‌లో 930/1000 సాధించాడు.

Surya Chakravarthy: కృషి, పట్టుదల, శ్రమించే తత్వం ఉంటే.. సాధించలేనిది ఏదీ లేదంటారు. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవు. అందుకు నిదర్శనమే ఈ తెలుగు కుర్రాడు. ఉదయం పని చేస్తూ, రాత్రి కష్టపడి చదువుకున్నాడు. అంతేకాదు.. కోచింగ్ కూడా తీసుకోలేదు. అయినా జేఈఈ మెయిన్ ను క్లియర్ చేసి శభాష్ అనిపించుకున్నాడు. అదీ 95శాతం పర్సంటైల్ తో. అతడి పేరు సూర్య చక్రవర్తి. రాజమండ్రికి చెందిన ఈ కుర్రాడి సక్సెస్ స్టోరీ విద్యార్థులకు స్ఫూర్తిదాయకం.

19 ఏళ్ల సూర్య చక్రవర్తి JEE మెయిన్ 2025 లో 95 పర్సంటైల్ సాధించి ఇంజనీరింగ్ లోకి అడుగు పెట్టాడు. ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో, అతను తన ప్రయాణం, సన్నాహక వ్యూహం, ఒత్తిడిని అధిగమించే మార్గాలు, భవిష్యత్తు ప్రయత్నాలు గురించి తెలియజేశాడు. అంతేకాదు తోటి విద్యార్థులకు విలువైన సలహాలు, సందేశం కూడా ఇచ్చాడు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రికి చెందిన 19 ఏళ్ల సూర్య చక్రవర్తి JEE మెయిన్ 2025లో 95 శాతం సాధించాడు. అతని సక్సెస్ స్టోరీ పట్టుదల, కృషితో నిండి ఉంది. అతను మంచి స్కోరు సాధించి ఇంజనీరింగ్‌లోకి అడుగుపెట్టాడు. అతని సంవత్సరాల కృషి ఈ ఫలితాలను తెచ్చి పెట్టింది. సాధారణంగా, విద్యార్థులు ఇంజనీరింగ్ లేదా మెడికల్‌ను ఎంచుకుంటారు. కానీ సూర్య రెండింటికీ వెళ్లాడు.

సూర్య తెలివైన విద్యార్థి. 2023లో 8.1 CGPAతో హైస్కూల్ పూర్తి చేశాడు. ఇంటర్మీడియట్‌లో 930/1000 సాధించాడు. తర్వాత, తన విజయ అవకాశాలను పెంచుకోవడానికి NEET, JEE రెండింటికీ హాజరు కావాలని నిర్ణయించుకున్నాడు. “రెండు పరీక్షలు కఠినమైనవని నాకు తెలుసు, కానీ నన్ను నేను సవాల్ చేసుకోవాలనుకున్నాను. రెండింటికీ సిద్ధం కావడం అంటే మరింత కష్టపడి పనిచేయడం, అలాగే విజయం సాధించడానికి మరిన్ని అవకాశాలు కూడా ఉన్నాయి” అని సూర్య అన్నాడు.

తండ్రి అకాల మరణంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడ్డాయి. కుటుంబ బాధ్యతను తన భుజాలపై వేసుకున్నాడు సూర్య. రెండు పరీక్షలకు హాజరు కావడం వెనుకన్న అతిపెద్ద ప్రేరణ ఇదే.

”నా సోదరుడు, తల్లి నాకు అండగా నిలిచారు. నా సోదరుడు నాకు స్ఫూర్తినిస్తాడు. నా చదువు కోసం అతను కష్టపడి పని చేశాడు. నేనది కళ్లారా చూశాను. నేను అలసిపోయినప్పుడు లేదా నన్ను నేను అనుమానించుకున్న ప్రతిసారీ, నేను నా తల్లి కుటుంబం గురించి ఆలోచించాను. అది ముందుకు సాగడానికి బలాన్ని ఇచ్చింది. నా తల్లి, సోదరుడి కష్టం వృథా అవ్వనివ్వకూడదని నేను నిర్ణయించుకున్నాను” అని సూర్య తెలిపాడు.

Also Read: ITR రీఫండ్ ఈసారి ఆలస్యం అవుతుందా? అసలు కారణాలేంటి? ట్రాకింగ్, ఫిర్యాదు, రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?

సూర్య 2024 జనవరిలో రెండు ప్రవేశ పరీక్షలకు సిద్ధం కావడం ప్రారంభించాడు. JEE NEET సిలబస్‌లు ఫిజిక్స్ కెమిస్ట్రీ కొంత సేమ్ గా ఉంటాయి. బయాలజీ, మ్యాథమెటిక్స్‌లో మాత్రం వ్యత్యాస్యం ఉంటుంది. సూర్య తన సమయాన్ని రెండింటికి కేటాయించాల్సి వచ్చింది. “నేను ప్రాథమికాలను బాగా అర్థం చేసుకోవడంపై దృష్టి పెట్టాను. నా సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఆన్‌లైన్ వీడియోలను ఉపయోగించాను. కొన్ని రోజులు నేను JEE కోసం, కొన్ని రోజులు NEET కోసం చదివాను. నేను ఎక్కువగా ఆలోచించకుండా క్రమం తప్పకుండా ఉండటానికి రెండింటికీ సమాన ప్రాముఖ్యత ఇవ్వడానికి ప్రయత్నించాను” అని సూర్య గుర్తుచేసుకున్నాడు.

మన దేశంలో కోచింగ్ అంటే ఖర్చుతో కూడుకున్నది. అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా సూర్యకు కోచింగ్ కు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో సెల్ఫ్ స్టడీ.. ఇన్ఫినిటీ లెర్న్, యూట్యూబ్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడాల్సి వచ్చింది.

సూర్య సోదరుడు కూడా వివిధ అంశాలపై తనకున్న నాల్డెజ్ ను పంచుకోవడం ద్వారా JEE మెయిన్‌లో సూర్యకి సహాయం చేశాడు. సూర్యకి ఫిజిక్స్ కష్టంగా అనిపించింది. అయితే, ఈ-లెర్నింగ్, సీనియర్ల మద్దతుతో సూర్య ఆ సమస్యను అధిగమించగలిగాడు. అతను తన సోదరుడిని తన “అతిపెద్ద ప్రేరణ”గా భావిస్తాడు. ఎందుకంటే అతను రాత్రంతా కష్టపడి పనిచేస్తున్నప్పటికీ చదువుకు సాయం చేశాడు. సూర్య కూడా తన కుటుంబం కోసం పనికి వెళ్లాడు. ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పని చేసేవాడు. ఇంటికి చేరుకున్న తర్వాత రాత్రి 8 గంటల నుండి తెల్లవారుజామున 2 గంటల వరకు చదువుకునే వాడు.

ప్రవేశ పరీక్షలకు సిద్ధమవడం చాలా ఒత్తిడితో కూడుకుంది. అలాంటిది పని చేస్తూ చదువుకోవడం అంటే మామూలు విషయం కాదు. చాలా అలసిపోతారు. ఆ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సూర్య తనదైన మార్గాన్ని ఫాలో అయ్యాడు. “నేను దేని కోసం పని చేస్తున్నానో గుర్తు చేసుకుంటూనే ఉన్నాను. నిరుత్సాహంగా అనిపించినప్పుడు లేదా నాపై నాకు అనుమానం కలిగినప్పుడల్లా.. నేను ఎంత దూరం వచ్చాను, నేను ఈ ప్రయాణాన్ని ఎందుకు ప్రారంభించాను.. అనే దాని గురించి ఆలోచించాను” అని సూర్య తెలిపాడు.

సూర్య ఉద్యోగం చేసే చోట కూడా చాలా సపోర్ట్ లభించింది. అంతేకాదు వారు సూర్యను మోటివేట్ చేసేవారు. నువ్వు సాధించగలవు అని ప్రోత్సహించారు. ప్రతిరోజూ అతని చుట్టూ విద్యార్థులు, ఉపాధ్యాయులు, లెర్నింగ్ మెటీరియల్ ఉండేవి. అటువంటి వాతావరణంలో ఉండటం వల్ల అతడిని పెద్ద కలలు కనేలా చేసింది. వాటిని సాధించగలననే నమ్మకాన్ని ఇచ్చాయి.

చివరికి సూర్య అనుకున్నది సాధించాడు. JEE మెయిన్‌లో 55,293 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)తో 95 పర్సంటైల్ సాధించాడు. ఆగస్టు 2025లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేయడానికి IIIT బెంగళూరులో చేరనున్నాడు.

“టెక్నాలజీ నన్ను ఆకర్షించింది. సమస్యలను పరిష్కరించడానికి దాన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలిసింది. అందుకే నేను నా భవిష్యత్తుకు ఇంజనీరింగ్ సరైన మార్గంగా భావించాను. IIIT బెంగళూరులో చేరడం నాకు గొప్ప క్షణం. నేను పని చేసిన ప్రతిదీ చివరకు రూపుదిద్దుకోవడం ప్రారంభించినట్లు అనిపించింది” అని సూర్య ఆనందం వ్యక్తం చేశాడు.

‘సరైన సమయం లేదా సెటప్ కోసం వేచి ఉండొద్దు. బదులుగా ఉన్నదాంతో ప్రారంభించాలి. స్థిరంగా ఉండాలి. మనపై మనకు నమ్మకం ఉండాలి. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగాలి. అలా మీరు మీ లక్ష్యాలకు చేరువ అవుతారు’ అని విద్యార్థులకు విలువైన సలహా ఇచ్చాడు సూర్య చక్రవర్తి.