Tax Refund: ITR రీఫండ్ ఈసారి ఆలస్యం అవుతుందా? అసలు కారణాలేంటి? ట్రాకింగ్, ఫిర్యాదు, రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి?
Tax Refund : ITR ఫారమ్‌లను ఆలస్యంగా విడుదల, బ్యాకెండ్ ప్రాసెసింగ్ సమస్యల కారణంగా 2025-26 సంవత్సరానికి ఆదాయపు పన్ను రీఫండ్ ఆలస్యం కానుంది.

Tax Refund
Tax Refund : టాక్స్ పేయర్లకు బిగ్ అలర్ట్.. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేశారా? ఇప్పుడు మీ టాక్స్ రీఫండ్ కోసం చూస్తున్నారా? ఈ ఏడాది చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ చాలా త్వరగా పొందారు. కానీ, మరికొంత మంది మాత్రం ఇప్పటికీ రీఫండ్ విషయంలో ఆందోళన చెందుతున్నారు.
వారాలు గడుస్తున్నా తమ చేతికి డబ్బు అందలేదు. ఇలాంటి పరిస్థితిలో టాక్స్ రీఫండ్ రావడానికి ఎంత సమయం పడుతుందనే ప్రశ్న తలెత్తుతుంది? ఎందుకు ఇంతగా ఆలస్యం అవుతుంది? రీఫండ్ పూర్తిగా నిలిచిపోతుందా? డబ్బు రాకపోతే ఏమి చేయాలి? ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఈసారి గతంలో కన్నా టాక్స్ సిస్టమ్ అప్‌గ్రేడ్ అయింది. అలాగే, ఆదాయ పన్ను శాఖ ఇన్విస్టిగేషన్ విధానం కూడా మరింత కఠినంగా మారింది. ఒకవైపు, ఆదాయపు పన్ను శాఖ అధునాతన టెక్నాలజీ ద్వారా ITR రీఫండ్ ప్రాసెస్‌ను గతంలో కన్నా వేగవంతం చేసింది. మరోవైపు, చాలా మంది పన్ను చెల్లింపుదారులు తమ డబ్బు ఇంకా ఎందుకు రాలేదని ఆందోళన చెందుతున్నారు.
టాక్స్ రీఫండ్ ఆలస్యానికి అసలు కారణాలివే..
2025-26 అసెస్‌మెంట్ ఇయర్‌కు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు ప్రక్రియ ఈసారి కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. సాధారణంగా, ప్రతి ఏడాదిలో ఏప్రిల్‌లో రిటర్న్‌లను దాఖలు చేసే ప్రక్రియ ప్రారంభమవుతుంది, కానీ, ఈ ఏడాది ఆదాయపు పన్ను శాఖ నుంచి ITR ఫారమ్‌లు, యుటిలిటీలను విడుదల చేయడంలో ఆలస్యం జరిగింది. మే చివరి నాటికి, ITR-1, ITR-4 యుటిలిటీని మాత్రమే విడుదల చేసింది. ITR-2, ITR-3 వంటి సంక్లిష్టమైన ITR ఫారమ్‌ల కోసం ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ యుటిలిటీలు ఇంకా అందుబాటులో లేవు.
ఈ ఆలస్యం ప్రభావం ఇప్పటివరకు దాఖలు చేసిన ఐటీఆర్లపై కనిపిస్తోంది. అనేక మంది పన్ను చెల్లింపుదారులు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో రిటర్న్ దాఖలు చేసి వారాలు గడిచినప్పటికీ, తమకు ఇంకా రీఫండ్ అందలేదని ఫిర్యాదు చేస్తున్నారు. ఇంతకీ టాక్స్ రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? ఎలా ట్రాక్ చేయాలి? ఆలస్యం జరిగితే ఎవరిని సంప్రదించాలి? తొందరగా పేమెంట్ పొందాలంటే ఏం చేయాలి? అనే వివరాలను తప్పక తెలుసుకోవాలి.
ITR రీఫండ్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి? :
పన్ను చెల్లింపుదారులు ముందుగా రీఫండ్ జారీ అయిందో లేదో తెలుసుకోవాలి. ఇందుకోసం రెండు సులభమైన ఆప్షన్లు ఉన్నాయి.
ముందుగా, ఆదాయపు పన్ను శాఖ వెబ్‌సైట్ (incometax.gov.in)కు లాగిన్ అయి ‘Refund/Demand Status’ సెక్షన్‌కు వెళ్లి మీ రిటర్న్ స్టేటస్ చెక్ చేయండి.
రెండవది.. NSDL వెబ్‌సైట్‌లో పాన్, అసెస్‌మెంట్ ఇయర్ వివరాలను రిజిస్టర్ చేయడం ద్వారా కూడా రీఫండ్ స్టేటస్ చెక్ చేయవచ్చు.
ఒకవేళ రీఫండ్ జారీ అయినట్టు కనిపించినా బ్యాంక్ అకౌంట్లలో జమ కాకపోతే.. రిజిస్టర్ అయి వెరిఫై అయిందో లేదో బ్యాంక్ (IFSC కోడ్, అకౌంట్ నంబర్) ఒకటికి రెండుసార్లు చెక్ చేయండి. కొన్నిసార్లు పేమెంట్లలో ఆలస్యం బ్యాంక్ ధృవీకరణ కారణంగా జరుగుతుంది. ఈ రీఫండ్ పేమెంట్లకు సంబంధించి బాధ్యత ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తీసుకుంది. బ్యాంకు అధికారులను సంప్రదించవచ్చు.
టాక్స్ రీఫండ్ ఎందుకు ఆలస్యమవుతోంది? :
టాక్స్ రీఫండ్ ఆలస్యం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. మొదటి ప్రధాన కారణం.. ఆదాయపు పన్ను శాఖ బ్యాకెండ్ సిస్టమ్ అప్‌గ్రేడ్. ఏప్రిల్ 2024 బడ్జెట్ తర్వాత పన్ను స్లాబ్‌లలో మార్పులు, వ్యవస్థలోని కొత్త సమ్మతి నిబంధనలను అప్‌లోడ్ చేసేందుకు శాఖ సాంకేతికంగా అనేక మార్పులు చేస్తోంది. ఫైలింగ్, ప్రాసెసింగ్ రెండింటినీ ప్రభావితం చేసింది.
రెండో కారణం.. రిటర్న్‌లను దాఖలు సమయంలో చేసే సాధారణ తప్పులు కావచ్చు. తప్పుడు వివరాలను అందించడం, ఆదాయ వనరులను పూర్తిగా వెల్లడించకపోవడం లేదా బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ సరిగా లేకపోవడం వంటివి కూడా కారణాలు కావచ్చు. ఇలాంటి పరిస్థితులలో మీ రిటర్న్ ప్రాసెస్ కాదు. రీఫండ్ కూడా నిలిచిపోతుంది.
రీఫండ్ ఆలస్యమైతే ఏం చేయాలి? :
మీ రిటర్న్ ప్రాసెస్ అయినా రీఫండ్ ఇంకా అందకపోతే.. మీరు e-Nivaran పోర్టల్ లేదా CPGRAMS విజిట్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. ఆదాయపు పన్ను శాఖ ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియను గతంలో కన్నా వేగవంతం చేసింది. కంప్లయింట్స్ సెక్షన్‌కు వెళ్లి ‘Refund not received’ ఎంచుకోవడం ద్వారా మీ సమస్యను వివరంగా వివరించవచ్చు. ఇందులో మీ పాన్, అసెస్‌మెంట్ సంవత్సరం, రసీదు సంఖ్య, కాంటాక్టు ఇన్ఫర్మేషన్ అందించాలి.
ఫిర్యాదు 15 నుంచి 20 రోజుల్లో పరిష్కారం కాకపోతే.. మీరు కేసును ఉన్నత అధికారికి ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం CPC-బెంగళూరు, ప్రాంతీయ ఆదాయపు పన్ను కార్యాలయం లేదా ఐటీ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించవచ్చు. పన్ను చెల్లింపుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
త్వరగా టాక్స్ రీఫండ్ పొందాలంటే? :
- మీరు రీఫండ్ ప్రాసెసింగ్ త్వరగా పూర్తి చేయాలంటే కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోండి :
- ITR త్వరగా నింపండి. వెంటనే ఇ-వెరిఫై చేయండి.
- ఇ-వెరిఫికేషన్ లేకుండా మీ రిటర్న్ ప్రాసెస్ కాదు.
- సరైన ITR ఫారమ్‌ను ఎంచుకోండి.
- జీతం పొందే క్లాస్ ITR-1, బిజినెస్ ITR-3 లేదా ITR-4ని ఉపయోగించాలి.
- మీ బ్యాంక్ అకౌంట్ వెరిఫై చేయండి.
- ఆదాయపు పన్ను పోర్టల్‌లో లాగిన్ అయి ‘Prevalidate Bank Account’ ఆప్షన్ ఎంచుకోండి.
- రీఫండ్ చెక్ చేస్తు ఉండండి.
- ప్రతి 7 రోజుల నుంచి 10 రోజులకు ఒకసారి స్టేటస్ చేస్తూ ఉండండి.
- ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే రిపోర్టు చేయండి.
ఐటీఆర్ గడువు పొడిగింపు, వడ్డీ పొందొచ్చు :
ఈ సంవత్సరం, ఆదాయపు పన్ను శాఖ ITR దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 15, 2025 వరకు పొడిగించింది. సాధారణంగా జూలై 31 వరకు మాత్రమే. రీఫండ్ ఆలస్యం అయితే.. సెక్షన్ 244A కింద ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి పన్ను చెల్లింపుదారులు ఈ పొడిగింపు నుంచి భారీగా ప్రయోజనం పొందవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
చాలా మంది పన్ను చెల్లింపుదారులు రీఫండ్‌తో పాటు అదనపు వడ్డీని పొందవచ్చు. అయితే, కేంద్ర ప్రభుత్వంపై రీఫండ్ పేమెంట్ అదనపు భారాన్ని పెంచుతుంది. పన్ను చెల్లింపుదారులు సరైన సమాచారం, డాక్యుమెంట్లతో సకాలంలో రిటర్న్‌లను దాఖలు చేయడం ఎంతైనా మంచిది. తద్వారా రీఫండ్ ఆలస్యం జరిగే అవకాశం ఉండదు.