Income Tax Refund : టాక్స్ పేయర్లకు బిగ్ న్యూస్.. ఇకపై 17 రోజుల్లోనే ITR రీఫండ్ క్రెడిట్ అవుతుంది.. ఫుల్ డిటెయిల్స్..!
Income Tax Refund : 2025 సెప్టెంబర్ 15 వరకు ఎలాంటి రుసుము లేకుండా ITR దాఖలు చేయవచ్చు. రీఫండ్ పొందే సమయం కూడా 17 రోజులకు తగ్గింది.

Income Tax Refund
Income Tax Refund : పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేశారా? లాస్ట్ డేట్ దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 15, 2025 వరకు (Income Tax Refund) ఎలాంటి రుసుము లేకుండా ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.
అయితే, ఆదాయపు పన్ను రీఫండ్ విషయంలో ఇకపై ఆందోళన అవసరం లేదు. ఎందుకంటే.. గతంలో కన్నా అత్యంత వేగంగా ఐటీఆర్ రీఫండ్ పొందవచ్చు. గత 11 ఏళ్లలో టాక్స్ రీఫండ్ వేగంగా పెరగడమే కాకుండా ప్రాసెసింగ్ సమయం కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది.
93 రోజుల నుంచి 17 రోజులకు తగ్గింపు :
2013-14 ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను శాఖ మొత్తం రూ.83,008 కోట్ల రీఫండ్ జారీ చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.4.77 లక్షల కోట్లకు పెరిగింది. గత 11 ఏళ్లలో ఐటీఆర్ రీఫండ్‌లో 474 శాతం పెరిగింది. స్థూల పన్ను వసూళ్లలో 274 శాతం వృద్ధిని గణనీయంగా అధిగమించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే, ఆదాయపు పన్ను రీఫండ్ జారీకి పట్టే రోజుల సంఖ్య కూడా 81 శాతం తగ్గింది. అంతేకాదు.. గతంలో పన్ను రీఫండ్ పొందాలంటే సగటున 93 రోజుల సమయం పట్టేది. ఇప్పుడు ఈ సమయాన్ని కేవలం 17 రోజులకు తగ్గించారు. పన్ను చెల్లింపుదారులు ఇకపై రీఫండ్ కోసం ఎక్కువ రోజులు వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
పన్ను రిటర్నులలో 133 శాతం పెరుగుదల :
అలాగే, ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) దాఖలు చేసే వారి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా పెరిగింది. 2013 నుంచి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్నులలో 133 శాతం పెరుగుదల కనిపించింది. 2013 సంవత్సరంలో 3.8 కోట్ల ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయగా, 2024 నాటికి ఈ సంఖ్య 8.89 కోట్లకు పెరిగింది. అంతేకాదు.. స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 2013-14లో రూ.7.22 లక్షల కోట్ల నుంచి 2024-25 నాటికి రూ.27.03 లక్షల కోట్ల (274 శాతంగా)కు పెరిగాయి.
పన్ను వ్యవస్థ డిజిటలైజేషన్, స్పీడ్ ప్రాసెసింగ్ మెరుగైన టెక్నాలజీతో పన్ను వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ఎండ్-టు-ఎండ్ ఆన్‌లైన్ ఫైలింగ్, ఫేస్‌లెస్ అసెస్‌మెంట్ వంటి వాటి కారణంగా పన్ను రీఫండ్ జారీకి రోజుల సంఖ్య తగ్గిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ముందస్తుగా నింపిన రిటర్న్‌లను ప్రవేశపెట్టడం, రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఆటోమేషన్, రియల్-టైమ్ TDS సర్దుబాట్లు, ఆన్‌లైన్ ఫిర్యాదుల పరిష్కార విధానాలు జాప్యాలను తగ్గించాయి. ఫలితంగా పన్ను చెల్లింపుదారుల అనుభవాన్ని మెరుగుపరిచాయి. స్థూల ప్రత్యక్ష పన్నుల నిష్పత్తిలో రీఫండ్స్ కూడా 2013-14లో 11.5 శాతం నుంచి 2024-25 నాటికి 17.6 శాతానికి పెరిగాయి.