Srisailam
Tension Srisailam Temple : అర్ధరాత్రి రణరంగంగా మారిన శ్రీశైలంలో.. ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చింది. పోలీసు బలగాలు శ్రీశైలం వీధుల్లో పహారా కాస్తున్నాయి. అర్ధరాత్రి శ్రీశైలంలో హైటెన్షన్ నెలకొంది. వాటర్ బాటిల్ విషయంలో మొదలైన గొడవ చినికి చినికి గాలివానలా మారి శ్రీశైలంలో ఓ పెద్ద కలకలానికి దారి తీసింది. కర్రలతో వీధుల్లో తిరుగుతూ కన్నడ భక్తులు చేసిన బీభత్సంతో స్థానికులు, ఇతర భక్తులు వణికిపోయారు. అర్ధరాత్రి మొదలైన ఈ విధ్వంసకాండ తెల్లవారుజాము వరకు కొనసాగింది. ఈ ఘటనలో పలు షాపులు అగ్నికి ఆహుతి కాగా.. మరికొన్ని షాపులు, వాహనాలు ధ్వంసమయ్యాయి.
అర్ధరాత్రి కన్నడ భక్తుడు వాటర్ బాటిల్ కోసం ఓ షాప్‌కు వెళ్లడంతో ఈ గొడవ మొదలైంది. వాటర్ బాటిల్ విషయంలో కన్నడ భక్తుడు, షాప్ యజమాని మధ్య ఘర్షణ మొదలైంది. దీంతో షాప్ యజమాని దోశలు వేసే గరెటతో అతడిపై దాడి చేశాడు. ఈ విషయం తెలుసుకున్న కన్నడ భక్తులు ఆగ్రహంతో ఊగిపోయారు. కర్రలు పట్టుకొని వచ్చి ఆ షాప్‌ను ధ్వంసం చేశారు. షాప్‌లోని సామాను మొత్తం బయట పడేసి నిప్పు పెట్టారు. ఆ ఘర్షణ అక్కడితో ఆగలేదు. రోడ్డుపై ఉన్న వాహనాలు, ఇతర షాపులను ధ్వంసం చేశారు. రోడ్డుపై ఉన్న ఇతర భక్తులపై కూడా దాడులకు పాల్పడ్డారు. కాస్త ఆలస్యంగానైనా రంగంలోకి దిగిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కర్రలతో వీధుల్లో తిరుగుతున్న కన్నడ భక్తులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పరిస్థితి చేజారకుండా భారీగా పోలీసులను మోహరించారు.
Read More : Srisailam : శ్రీశైలం పుణ్యక్షేత్రంలో తీవ్ర ఉద్రిక్తత
దీంతో తెల్లవారుజామున 4 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కన్నడ భక్తుల దాడుల్లో 20కి పైగా షాపులు ధ్వంసమయ్యాయి.. 40 వరకు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు కోటి రూపాయలకు పైనే ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు. ఇక గొడవకు కారణమైన షాప్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘర్షణల్లో ఇద్దరు భక్తులకు గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు. సరైన సెక్యూరిటీ లేకపోవడంతోనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలంలో అర్ధరాత్రి దురదృష్టకర ఘటన జరిగిందన్నారు ఆలయ ఈవో లవన్న. భక్తులంతా సంయమనం పాటించాలని కోరారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపడుతామని తెలిపారు ఈవో.