Tirumala Parakamani Case: తిరుమల పరకామణి కేసులో మృతి చెందిన ఫిర్యాదుదారు, టీటీడీ మాజీ ఏవీఎస్ వో సతీశ్ కుమార్ ది హత్యేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. శరీరంపై ఉన్న గాయాలను బట్టి సతీశ్ ది హత్య అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. గురువారం రాత్రి 2 గంటల నుండి 3 గంటల మధ్య ఘటన జరిగినట్టు చెబుతున్నారు. సతీష్ కుమార్ మృతదేహంపై వెనుక వైపు మాత్రమే గాయాలు ఉండడంతో ఇది హత్యే అని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో మృతదేహానికి సిటి స్కాన్ చేశారు. తల వెనుక గొడ్డలి లాంటి ఆయుధంతో నరికినట్లు గుర్తించారు.
సతీష్ తల వెనుక బలంగా కొట్టి హత్య చేసినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. రైల్లోనే తలపై కొట్టి కిందకు తోసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సతీష్ కుమార్ ప్రయాణించిన ఏ1 బోగీలో ప్రయాణికుల లిస్ట్ తెప్పించి విచారిస్తున్నారు పోలీసులు. అటు సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ అనంతపురం చేరుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష చేయనున్నారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారు అయిన సతీశ్.. సీఐడీ ముందు రెండోసారి విచారణకు వస్తూ హత్యకు గురయ్యారు. తాడిపత్రి వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో ఆయన డెడ్ బాడీ కనిపించింది.
గురువారం రాత్రి గుంతకల్లు రైల్వే స్టేషన్‌లో.. ఫస్ట్ ఏసీ బోగీలో ఎక్కిన సతీశ్ కుమార్.. తెల్లవారుజామున 2 నుంచి 4 గంటల మధ్య మృతి చెందినట్టు తేలింది. కోర్టు ఆదేశాలతో పరకామణి చోరీ కేసును విచారిస్తున్న సీఐడీ ముందు రెండోసారి విచారణకు వస్తూ సతీశ్ హత్యకు గురికావడం పలు అనుమానాలకు తావిచ్చింది.
అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం కోమలి వద్ద రైల్వే పట్టాల సమీపంలో సతీశ్ కుమార్ శవమై కనిపించారు. 2023 ఏప్రిల్‌లో టీటీడీ ఉద్యోగి రవికుమార్ శ్రీవారి ఆలయ పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ చేస్తూ పట్టుబడిన ఘటనపై ఏవీఎస్ఓ హోదాలో సతీష్‌కుమార్ ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై ఎలాంటి విచారణ లేకుండా నిందితుడు రవికుమార్, ఫిర్యాదుదారు సతీష్‌కుమార్ రాజీ కుదుర్చుకున్నారు. రవికుమార్ ఆస్తులను కొంతమేర టీటీడీకి విరాళంగా ఇవ్వగా.. మరికొంత తమ పేరున రాయించుకొని కేసు మాఫీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పరకామణి కేసు హైకోర్టు ఆదేశాలతో తిరిగి విచారణ ప్రారంభమైంది.
సతీష్‌కుమార్ విచారణతో కుట్రకోణం వెలుగులోకి వస్తుందని భావించారు. ఈ నెల 6న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ ఎదుట విచారణకు హాజరయ్యారు సతీష్‌కుమార్. పరకామణి కేసులో రాజీ వెనుక కారణాలను కొంతవరకు అధికారులకు వివరించినట్లు సమాచారం. సతీశ్ ప్రస్తుతం గుంతకల్లు రైల్వే డివిజన్‌లో జీఆర్‌పీఎఫ్ సీఐగా విధులు నిర్వహిస్తున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో చోరీని గుర్తించి కేసు పెట్టించింది అప్పటి ఏవీఎస్ వో సతీశ్ కుమారే. సీనియర్ అసిస్టెంట్ రవికుమార్ హుండీ సొమ్ము చోరీ చేస్తుండగా గుర్తించిన సతీశ్ కుమార్.. 2023లో ఫిర్యాదు చేశారు. సతీశ్ ఫిర్యాదుతోనే సీనియర్ అసిస్టెంట్ రవికుమార్‌పై 2023 మేలో విజిలెన్స్ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే సెప్టెంబర్ లో లోక్ అదాలత్‌లో రవికుమార్, సతీశ్ రాజీ కుదుర్చుకున్నారు. పరకామణి చోరీ కేసుకు సంబంధించి వైసీపీ నేతలపై టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఫిర్యాదుదారు అనుమానాస్పద మృతి సంచలనంగా మారింది.
Also Read: ఐయామ్ సారీ.. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వెనుక కారణం ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?