Praveen Prakash: ఐయామ్ సారీ.. మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాపం వెనుక కారణం ఏంటి? నెక్స్ట్ ఏం చేయబోతున్నారు?
ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు పశ్చాత్తాప పర్వం ప్రారంభించినప్పటికీ, రాజకీయ వ్యవస్థలో ఆయన వ్యవహరించిన తీరు ఎంతవరకు విముక్తి చేస్తుందో సమయమే నిర్ణయించాలి.
Praveen Prakash: ఏపీ రాజకీయాల్లో వివాదాస్పద అధికారిగా పేరుపొందిన మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్ పశ్చాత్తాప పర్వంలోకి అడుగుపెట్టారా? వైసీపీ హయాంలో కీలక పదవుల్లో పనిచేసిన ఆయన, ఆ సమయంలో తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరుపై స్వయంగా ఆత్మపరిశీలన చేసుకుంటున్నారా.. ఉన్నట్టుండి ఆ ఐఏఎస్ అధికారి ఎందుకు సారీ చెబుతున్నారు? ఆయన నెక్ట్స్ ఏం చేయబోతున్నారు.
ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడెందుకు దిగివచ్చారు?
వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఐఏఎస్ ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడెందుకు దిగివచ్చారు. ఇన్‌స్టా ద్వారా ఇద్దరు అధికారులకు ఆయన పబ్లిక్‌గా క్షమాపణలు చెప్పడం పొలిటికల్ సర్కిళ్లలో బిగ్ డిబేట్ పాయింట్‌గా మారింది. పొరపాట్లను బహిరంగంగా అంగీకరించడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. ముఖ్యంగా మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, మాజీ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిషోర్ విషయాల్లో గతంలో తాను అన్యాయంగా వ్యవహరించానని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాటల్లో కనిపించిన పశ్చాత్తాపం, మానసిక వేదన ఆయన అంతరాత్మలో జరిగిన సంఘర్షణను బయటపెడుతోంది.
ఇప్పటికే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాశ్ రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారనే ప్రచారం ఊపందుకుంది. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ రూట్‌లో వస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే ఏదైనా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలో చేరుతారా, లేక స్వతంత్రంగా ప్రజా వేదిక ఏర్పాటు చేసుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికర ప్రశ్నగా మారింది. విజయవాడ, గుంటూరు రాజకీయాల్లో ఆయనకు ఉన్న పరిచయం, స్థానిక అధికార వర్గాల్లో గల అనుబంధం వల్ల ఆయన ఈ ప్రాంతానికే ప్రాధాన్యత ఇవ్వవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారట.
ఇన్నాళ్ల తర్వాత ఆయన తన మనసులోని బాధ బయపెట్టారు. వివిధ హోదాల్లో రాష్ట్రంలో పని చేశానని, ఆయా ప్రాంత ప్రజలు తనపై అంతులేని ప్రేమ చూపించారని అన్నారు. గత ఏడాది జూన్-జూలైలో తనపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేశారని, అప్పటివరకు తల ఎత్తుకుని హీరోగా ఉన్న తాను, ఒక్కసారిగా విలన్ అయిపోయానని చెప్పుకొచ్చారు.
చేతులారా ప్రతిష్ఠను దెబ్బ తీసుకున్నారా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో నిజాయితీపరుడిగా పేరుపొందిన ప్రవీణ్ ప్రకాశ్.. తర్వాత దురుసు ప్రవర్తనతో వివాదాల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వంలో కీలక నిర్ణయాల సమయంలో ఆయన తీరు విమర్శలకు గురైంది. కొన్నిసార్లు రాజకీయ నిర్ణయాల్లో మునిగిపోయి, సర్వీస్ నిబంధనలను బ్రేక్ చేశారనే విమర్శలూ వచ్చాయి. వాటన్నింటిని ఇన్నాళ్లు తన మనసులో భారంగా దాచుకొని ఇప్పుడు ప్రాయశ్చిత్తం చేస్తున్నారని పలువురు మాజీ అధికారులు భావిస్తున్నారట.
తన చేతులారా తన ప్రతిష్ఠను దెబ్బ తీసుకున్నారని, ఇప్పుడు ఆ అంతరాత్మ గళమే ఆయనను బయటకు లాగుతోందని టాక్ వినిపిస్తోంది. ఇంత పెద్ద స్థాయి అధికారి తాను చేసిన తప్పులను అంగీకరించి ప్రజల ముందు పశ్చాత్తాపం వ్యక్తం చేయడం అరుదైన విషయమనే గాసిప్స్ వినిపిస్తోన్నాయి.
ప్రవీణ్ ప్రకాశ్ ఇప్పుడు పశ్చాత్తాప పర్వం ప్రారంభించినప్పటికీ, రాజకీయ వ్యవస్థలో ఆయన వ్యవహరించిన తీరు ఎంతవరకు విముక్తి చేస్తుందో సమయమే నిర్ణయించాలి. కానీ ఒక అధికారి తన తప్పులను అంగీకరించి, ఆత్మ పరిశీలనలోకి వెళ్లడం ఈ కాలంలో అరుదైన విషయమనే చెప్పాలి. తప్పును ఒప్పుకోవడం ఒక ధైర్యం, ప్రాయశ్చిత్తం చేయడం ఒక గుణమని ఆయన వ్యవహారం ప్రస్తుత రాజకీయ వర్గాలకు, అధికార వ్యవస్థకు ఒక పాఠంగా నిలుస్తోంది.
Also Read: పవన్ కల్యాణ్.. శేషాచలం అడవి భూములపైనే ఎందుకు ఫోకస్ పెట్టారు? ఆ నేత పేరునే ఎందుకు ప్రస్తావించారు?
