Tirumala Pink Diamond
Tirumala Pink Diamond : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పింక్ డైమండ్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో డైమండ్ లేదని, రూబీలు, కొన్ని రత్నాలు మాత్రమే అమర్చినట్లు సాక్ష్యాలు వెలుగులోకి వచ్చాయి.
గతంలో రాజకీయ విమర్శలతో పింక్ డైమండ్ వ్యవహారం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని, టీటీడీని ఇరుకున పెట్టేలా అప్పట్లో వైసీపీ చేసిన ప్రచారం అసత్యమని తేల్చి చెప్పేలా కొన్ని ఆధారాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ మునిరత్నం రెడ్డి బయటపెట్టారు. మైసూరు మహారాజు సమర్పించిన హారంలో ఉన్నది రూబీ మాత్రమేనని సాక్షాలతో ఆయన నిరూపించారు.
మైసూరు మహారాజు శ్రీవారికి సమర్పించిన హారంలో కోట్లు విలువైన పింక్ డైమండ్ మాయమైందని 2018లో మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు ఆరోపించిన విషయం తెలిసిందే. పింక్ డైమండ్‌ను అపహరించి జెనీవాలో జరిగిన వేలంలో విక్రయించారంటూ అప్పట్లో ఆయన సంచలన ఆరోపణలు చేశారు. అయితే, రమణ దీక్షితులు ఆరోపణల్లో వాస్తవం లేదని ఆయన వ్యాఖ్యలను టీటీడీ కొట్టిపారేసింది.
భక్తుల మనోభావాలను, టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా వ్యాఖ్యలు చేసిన రమణ దీక్షితులు, అప్పటి వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై టీటీడీ రెండు వందల కోట్లకు పరువు నష్టం దావా వేసిన విషయం తెలిసిందే. దావాకోసం రెండు కోట్ల రూపాయలు ఫీజును అప్పటి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ చెల్లించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కేసును టీటీడీ వెనక్కు తీసుకుంది. దేవుడి సొమ్ము రూ.2కోట్లను దుబారా అయ్యాయని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.