Ttd
Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. వీఐపీ బ్రేక్ దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శని, ఆదివారాల్లోనూ వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు చేశారు. ఇప్పటికే శుక్రవారం వీఐపీ రద్దు చేశారు. వీఐపీల కోసం కేటాయించిన సమాయాన్ని కూడా సామాన్య భక్తులకు కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ నిర్ణయంతో సర్వదర్శనం భక్తులకు రోజుకు అదనంగా 2 గంటల దర్శన సమయం లభిస్తుంది.
ఇక తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13,000 చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను మొన్న టీటీడీ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23వ తేదీ బుధవారం నుంచి టీటీడీ ఆన్‌లైన్‌లో దర్శనం టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, ఫిబ్రవరి 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు అదనంగా రోజుకు 5,000 చొప్పున సర్వదర్శనం టోకెన్లను ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో భక్తులకు ఇవ్వనున్నట్లు అధికారులు ప్రకటించారు.
TTD : తిరుమలలో గరుడ పంచమి, ఎందుకు నిర్వహిస్తారు ?
ఇక మార్చి నెలకు సంబంధించి రోజుకు 25 వేలు చొప్పున 300రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను విడుదల చేశారు. అంతేకాకుండా, మార్చి నెలకు సంబంధించి రోజుకు 20 వేలు చొప్పున సర్వదర్శనం టోకెన్లు ఆఫ్‌లైన్‌లో తిరుపతిలోని కౌంటర్లలో అందజేయనున్నారు. టీటీడీ వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in/ ఆన్‌లైన్‌లో టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.
గత నెలలోనూ పరిమిత సంఖ్యలోనే టికెట్లు రిలీజ్ చేయగా.. కాసేపటికే అవి హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఈసారి టికెట్ల సంఖ్య పెంచినా కూడా కరోనా తగ్గుముఖం పట్టడంతో భక్తులు వెంటనే కొనేస్తున్నారు. టీటీడీ అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే టికెట్లు పొందవచ్చు. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీ స్పష్టం చేసింది.
Tirumala Food Stalls : తిరుమలలో ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల తొలగింపు.. భవిష్యత్ కార్యాచరణపై వ్యాపారుల చర్చ
మరోవైపు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ధరల విషయంలో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ప్రచారంలో నిజం లేదన్నారు. ధనవంతుల ప్రయోజనాలు పరిరక్షించే కుట్రతోనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సామాన్య భక్తులకు కేటాయించే ఆర్జిత సేవా టికెట్ల ధరలు పెంచుతున్నట్లు చెప్పామా? అని ఆయన నిలదీశారు.
రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న అవాస్తవ ప్రచారాన్ని భక్తులు నమ్మరని అన్నారు. స్వామివారి సేవా టికెట్ల జారీలో వీఐపీల ఒత్తిడి తగ్గించి సామాన్య భక్తులకు సేవా టికెట్లు మరిన్ని అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతో పాలకమండలి సమావేశంలో చర్చించామని వెల్లడించారు. అయితే, ఆ చర్చను వక్రీకరించి కొంతమంది వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దౌర్భాగ్యం అని వాపోయారు.