TTD : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. తిరుమల వెళ్లే మహిళా ప్రయాణికులకు గుడ్‌న్యూస్..

TTD: తిరుమల వెళ్లే మహిళా ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు..

TTD

TTD : స్త్రీ శక్తి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత  ప్రయాణ సౌకర్యాన్ని ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, ఉచిత బస్సు పథకం గ్రాండ్ సక్సెస్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. సూపర్ సిక్స్ హామీల్లో ఉచిత బస్సు పథకానికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చినట్లు వెల్లడించింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. (TTD)

Also Read: Aruna Arrest : లేడీడాన్ నిడిగుంట అరుణ అరెస్ట్.. కోవూరు పీఎస్‌కు తరలింపు

మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల తిరుపతి దేవస్థానం కొండపై వరకు పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ చెప్పారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఆర్టీసీ బస్సు డిపోను ఎమ్మెల్యే మండలి బుద్దప్రసాద్, ఆర్టీసీ ఆర్ఎం వెంకటేశ్వర్లుతో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు చెప్పారు. స్త్రీ శక్తి – మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకానికి అపూర్వ స్పందన లభిస్తోందని అన్నారు.

ముఖ్యంగా ఆస్పత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లే వారు, చిరుద్యోగాలు చేసే మహిళలు ఈ ఉచిత బస్సు ప్రయాణంను సద్వినియోగం చేసుకుంటున్నారని నారాయణ చెప్పారు. రాష్ట్రంలో ఈనెల 16న 10లక్షల మంది, 17వ తేదీన 15లక్షల మంది, 18వ తేదీన 18లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారని అన్నారు.

తిరుమల సమాచారం..
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. 30 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. మంగళవారం శ్రీవారిని 76,033 మంది భక్తులు దర్శించుకున్నారు. అదేవిధంగా రూ.5.30 కోట్లు శ్రీవారి హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.