Aruna Arrest : లేడీడాన్ నిడిగుంట అరుణ అరెస్ట్.. కోవూరు పీఎస్‌కు తరలింపు
జీవిత ఖైదీ శ్రీకాంత్ ప్రియురాలు, నెల్లూరు జిల్లాలో లేడీడాన్‌గా పేరుగడించిన నిడిగుంట అరుణను (Aruna Arrest) పోలీసులు అరెస్టు చేశారు.

Aruna Arrest
Aruna Arrest : జీవిత ఖైదీ శ్రీకాంత్ ఎపిసోడ్‌లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా.. శ్రీకాంత్ ప్రియురాలు, నెల్లూరు జిల్లాలో లేడీడాన్‌గా పేరుగడించిన నిడిగుంట అరుణను (Aruna Arrest) పోలీసులు అరెస్టు చేశారు. కారులో విజయవాడ వైపు వెళ్తుండగా అద్దంకి టోల్ ప్లాజా దగ్గర మంగళవారం అర్ధరాత్రి సమయంలో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.
తనను అరెస్టు చేస్తారనే విషయాన్ని గమనించిన అరుణ మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, పోలీసులు మార్గం మధ్యలో ఆమెను అరెస్టు చేశారు. తనపై ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించిన ఆమె.. తనను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని అన్నారు. తనపై గంజాయి కేసు పెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అయితే, కోవూరులో ప్లాట్ యాజమానిని బెదిరించిన కేసులో అరుణను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆమెను కోర్టులో హాజరుపర్చనున్నారు.
నాలుగు రోజుల క్రితం సీఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారు. హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. గత ప్రభుత్వంలో రౌడీషీటర్ శ్రీకాంత్ సహకారంతో పలు నేరాలు, సెటిల్‌మెంట్లు చేశారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, శ్రీకాంత్ పెరోల్ విషయంలో అరుణ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. శ్రీకాంత్‌తో ఆమె సాన్నిహిత్యంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, అరుణ పూర్తి వ్యవహారంపై పోలీసులు, నిఘా వర్గాలు దర్యాప్తు చేపట్టాయి.