Vaikunthadwara darshan for Tirupati stampede victims
Tirupati stampede: తిరుపతిలోని వైకుంఠద్వార దర్శనాల టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. పలువురు గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి వెళ్లి ఘటన స్థలాన్ని పరిశీలించారు. తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శించారు. ఈ సందర్భంగా పలువురు వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో తొక్కిసలాట ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Also Read: AP Govt: సంక్రాంతి వేళ గుడ్‌న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రియల్ ఎస్టేట్ రంగం వేగం పుంజుకుంటుందా
సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాలతో మొత్తం 52 మందికి వైకుంఠ ఏకాదశి సందర్భంగా టీటీడీ అధికారులు శుక్రవారం ఉదయం ప్రత్యేక దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా గాయపడిన వారిలో పలువురు మాట్లాడుతూ.. తిరుపతిలో అనుకోని సంఘటన జరిగింది. దానికి ఎవరూ బాధ్యులు కాదు. సీఎం చంద్రబాబు నాయుడు మా దగ్గరకు వచ్చి పరామర్శించారు. ఘటనకు సంబంధించి అన్ని విషయాలు తెలుసుకున్నారు. మాకు ఎలాంటి ఏర్పాట్లు కావాలో అన్నీ చేశారు. మెరుగైన వైద్యం అందించారు. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మా విజ్ఞప్తి మేరకు వైకుంఠ ద్వార దర్శనం రోజు మాకు చక్కని దర్శన భాగ్యాన్ని కల్పించారు. మంచి వైద్యం అందించి, వైకుంఠద్వార దర్శనం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, టీటీడీ చైర్మన్, అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని వారు పేర్కొన్నారు.
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 25లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాక.. మృతిచెందిన వారి కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరికి రూ. 5లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేయడంతోపాటు.. వారి ఆరోగ్య స్థితి మెరుగుపడే వరకు ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని, అదేవిధంగా స్వల్పంగా గాయపడిన 33 మంది బాధితులకు రూ. 2లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు చంద్రబాబు గురువారం మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. ఈ క్రమంలో గాయపడిన 35 మందితోపాటు వారి వెంట ఉన్నవారికి వైకుంఠ ద్వార దర్శనం చేయించాలని, ప్రభుత్వ ఖర్చులతో వారి సొంతూళ్లకు చేర్చాలని టీటీడీ అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం టీటీడీ అధికారులు 52 మందికి వైకుంఠ ద్వారా దర్శనం చేయించారు.
Also Read: Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనపై అనుమానాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
తిరుపతి తొక్కిసలాట ఘటనలో మొత్తం ఆరుగురు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వారిలో.. ఎస్. లావణ్య (విశాఖపట్నం), శాంతి (విశాఖపట్నం), బొడ్డేటి నాయుడు బాబు (నర్సీపట్నం), రజని (విశాఖపట్నం), నిర్మిల (కోయంబత్తూరు), మల్లిక (మెట్టు సేలం). తీవ్రంగా గాయపడిన వారిలో తిమ్మక్క, ఈశ్వరమ్మలు ఉన్నారు.
మరోవైపు తొక్కిసలాట ఘటనలో డీఎస్పీ రమణ కుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు, జాయింట్ కమిషనర్ గౌతమి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీధర్ పై బదిలీ వేటు వేసింది.