Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనపై అనుమానాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు చంద్రబాబు.

Tirupati Stampede Incident : తొక్కిసలాట ఘటనపై అనుమానాలు ఉన్నాయి- సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Updated On : January 9, 2025 / 8:57 PM IST

Tirupati Stampede Incident : తిరుపతి తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తొక్కిసలాట ఘటనపై అనుమానాలు ఉన్నాయని ఆయన అన్నారు. న్యాయ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. తిరుపతిలో టికెట్ల జారీ గతంలో లేని సంప్రదాయం అన్నారు చంద్రబాబు. తిరుపతిలో టికెట్లు ఇవ్వడాన్ని గత ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు చంద్రబాబు.

ఇద్దరు అధికారులు సస్పెండ్, ముగ్గురు అధికారులు బదిలీ..
తిరుపతి ఘటనలో ఇద్దరు అధికారులను సస్పెండ్ చేశామని చంద్రబాబు తెలిపారు. ముగ్గురు అధికారులను బదిలీ చేశామన్నారు. డీఎస్పీ రమణకుమార్ బాధ్యత లేకుండా పని చేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. డీఎస్పీ రమణకుమార్, గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశామన్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ జరిపిస్తామన్నారు చంద్రబాబు.

తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే..
ఇది జరగకూడని ఘటన అని, చాలా బాధాకరం అని వాపోయారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తొక్కిసలాట వార్త ఎంతగానో కలిచివేసిందన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎలాంటి అపచారాలు జరగకూడదన్నది తన భావన అన్నారాయన. ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి తీసుకోదగ్గ చర్యలపై అధికారులతో చర్చించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. మన చర్యల వల్ల దేవుని పవిత్రత దెబ్బ తినకూడదన్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు చంద్రబాబు.

Also Read : తిరుపతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. వారిద్దరి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆగ్రహం

తిరుపతిలో దర్శనం టోకెన్లు ఇవ్వడం కరెక్ట్ కాదని భక్తులు భావిస్తున్నారు..
‘తిరుపతిలో దర్శనం టోకెన్లు ఇవ్వడం కొత్త సంప్రదాయం. ఇది కరెక్ట్ కాదని భక్తులు భావిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు కొనసాగించాలని ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తెలియడం లేదు. శాస్త్రంలో ఇది లేదు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇస్తాము. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం (కాంట్రాక్ట్) ఇస్తాం. తీవ్రంగా గాయపడ్డ వారికి 5 లక్షలు, గాయాలపాలైన 33 మందికి 2 లక్షల రూపాయల చొప్పున పరిహారంగా ఇస్తాము.

దీనిపై జ్యుడీషియల్ విచారణ చేస్తాము..
ఇలాంటి ఘటనలు జరగకుండా పరిపాలన సక్రమంగా ఉండాలి. కానీ, ఈ విషయంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి. డీఎస్పీ రమణ కుమార్, ఎస్వీ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నాం. జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జేఈవో గౌతమి, టీటీడీ ముఖ్య భద్రతాధికారి శ్రీధర్ ను బదిలీ చేస్తున్నాం. దీనిపై జ్యుడీషియల్ విచారణ చేస్తాము” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

పాత సంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది..
‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఒక భక్తుడిగా తిరుమలలో ఎలాంటి అపచారం జరగకూడదని కోరుకుంటున్నా. రాజకీయాలకు అతీతంగా స్వామి వారికి సేవ చేస్తున్నామనే భావన కలగాలి. దివ్యక్షేత్రం పవిత్రతను కాపాడేందుకు మనస్ఫూర్తిగా పని చేస్తున్నా. ఎలాంటి అపచారాలు జరగకూడదని మనసావాచా కోరుకుంటున్నా.

తిరుపతిలో టికెట్లు ఇవ్వడం గతంలో లేని సంప్రదాయం. తిరుపతిలో టికెట్లు ఇవ్వడాన్ని గత ప్రభుత్వం ప్రారంభించింది. పాత సంప్రదాయాన్ని కంటిన్యూ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగింది. పాత సంప్రదాయాల్లో కొన్నింటిని మార్చేశాం. మరిన్ని మార్చాల్సి ఉంది. అనాలోచిత నిర్ణయాలతో దేవుడిని అప్రతిష్ఠపాలు చేయొద్దు. ఎప్పుడూ లేని విధానాలను గత ప్రభుత్వం తీసుకొచ్చింది. భవిష్యతులో ఇలాంటి ఘటనలు జరగకుండా నిర్ణయం తీసుకుంటాం.

 

Also Read : తిరుపతి తొక్కిసలాట ఘటన దురదృష్టకరం.. ప్రభుత్వ వైఫల్యమే కారణం : అంబటి రాంబాబు