Tirupati Stampede: తిరుపతి ఘటనపై స్పందించిన మాజీ మంత్రి రోజా.. వారిద్దరి వల్లే ఈ పరిస్థితి అంటూ ఆగ్రహం
Tirupati stampede: తిరుమలలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకొని ఆరుగురు భక్తులు మృతిచెందిన ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా స్పందించారు.

Roja Reacted on Tirupati stampede incident : తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట ఘటనలో ఆరుగురు భక్తులు మృతిచెందగా.. మరి కొందరు గాయాలపాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 25లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. అయితే, తాజాగా ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు రోజా స్పందించారు. తిరుమల చరిత్రలో ఇది ఘోరమైన ఘటన అన్నారు. జరిగిన ఘోరాన్ని ఇంకొకరిపై నెట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తున్నారంటూ విమర్శించారు. అధికారులపై నెపం నెట్టెయ్యాలని చంద్రబాబు చూడటం సరికాదని, అసమర్థుడిని టీటీడీ చైర్మన్ గా నియమించడంతోపాటు అసమర్థ కలెక్టర్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని రోజా ఆరోపించారు.
Also Read: Tirupati Stampede: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎంతంటే?
వెంటనే రాజీనామా చేయాలి..
గత ఐదేళ్లుగా చిన్న ఘటన జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగింది కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని రోజా ఆరోపించారు. టీటీడీ పాలక మండలి నుంచి సీఎం వరకూ అందరూ బాధ్యత వహించాలని, వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అధికారులపై కాదు.. చైర్మన్, కలెక్టర్, దేవాదాయ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎంలపై కేసు నమోదు చెయ్యాలని రోజా అన్నారు. సంబంధం లేకుండా జరిగిన ఘటనకు అల్లు అర్జున్ పై కేసు పెట్టారు. నిర్లక్ష్యంతో జరిగిన ఘటనను ప్రమాదంలా చిత్రీకరిస్తున్నారని రోజా అన్నారు. 105 కేసు పెట్టకుండా 194బీఎన్ఎస్ సెక్షన్ పెట్టారని విమర్శించారు.
Also Read: Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక.. అందులో ఏముందంటే?
సనాతన యోధుడు ఏమి చేస్తున్నాడు..
బీజేపీ నేతలు , పీఠాధిపతులు దీనిపై స్పందించాలి.. ఇంత ఘోరం జరిగితే సనాతన యోధుడు ఏమి చేస్తున్నాడంటూ రోజా విమర్శించారు. చంద్రబాబు పాలనలో తొక్కిసలాటలు జరుగుతూనే ఉంటాయి. శాంతి భద్రతలపై పట్టు లేదు. హోంమంత్రి మీడియా సమావేశాలు పెట్టి తిట్టడం తప్ప చేసేదేమీ లేదంటూ రోజా విమర్శించారు. చనిపోయిన వారి కుటుంబాలకు కోటి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి.. గాయపడిన వారికి రూ.25లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రోజా డిమాండ్ చేశారు.
గేమ్ ఛేంజర్ పై ఉన్న శ్రద్ధ భక్తులపై లేదా..
గేమ్ ఛేంజర్ ఈవెంట్ పై ఉన్న శ్రద్ద తిరుమల వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లకు లేదు. గేమ్ ఛేంజర్ ఈవెంట్ కు మంత్రులు, కలెక్టర్, ఎస్పీ సమీక్షలు చేశారు. భక్తులకు రక్షణ ఇవ్వడంలో శ్రద్ధ లేదంటూ రోజా విమర్శించారు. టీటీడీ చైర్మన్ స్టేట్మెంట్ చూస్తే తాగి మాట్లాడినట్లు ఉంది. అంతా దైవేచ్ఛ అనడం సిగ్గుచేటు అంటూ రోజా మండిపడ్డారు.