Tirupati Stampede: తిరుపతి ఘటనలో మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎంతంటే?
తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి..

Minister Agani Sathyaprasad announced Exgratia to died families in tirupati stampede incident
TTD Stampede Victims Ex-Gratia: తిరుమల తిరుపతి దేవస్థానంలో తొక్కిసలాట చోటుచేసుకొని ఆరుగురు భక్తులు మృతిచెందిన విషయం తెలిసిందే. తిరుపతిలోని వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కేంద్రాల వద్ద బుధవారం రాత్రి ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో ఎనిమిది కేంద్రాల వద్ద స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్ల జారీకి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే, టికెట్ల కోసం భక్తులు పెద్దెత్తున కేంద్రాల వద్దకు వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగి ఆరుగురు మరణించారు. అయితే, ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.
Also Read: Tirupati Stampede: తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక.. అందులో ఏముందంటే?
మృతిచెందిన భక్తుల వివరాలు..
తిరుమలలో తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన వారిలో విశాఖపట్టణంకు చెందిన రజనీ (47), శాంతి (34), లావణ్య (40), నర్సీపట్నంకు చెందిన నాయుడు బాబు (51), కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన నిర్మల (50), తమిళనాడు సేలం ప్రాంతానికి చెందిన మల్లిగ (49) ఉన్నారు. మరో 40మందికిపైగా గాయాలు కావడంతో వారు ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే, మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ. 25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు.
Also Read: Supreme Court: కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. దక్కని ఊరట
తిరుపతిలో తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే తిరుపతి వెళ్లి గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని, వారి పరామర్శించి భరోసా కల్పించాలని మంత్రులు అనగాని సత్య ప్రసాద్, అనిత, సత్యకుమార్ లను ఆదేశించారు. దీంతో గురువారం ఉదయం దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డితో కలిసి తిరుపతి రుయా ఆస్పత్రిలో మృతుల కటుంబ సభ్యులను మంత్రులు పరామర్శించారు. స్విమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించి వైద్యులతో మాట్లాడారు.
బాధ్యులపై కఠిన చర్యలు..
అనంతరం మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి మొదలయ్యే సమయంలోనే ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఘటనకు కారణంపై విచారణ జరుగుతుందని చెప్పారు. బాధ్యులు ఏ స్థాయిలో ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే, మృతుల కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ. 25లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదిలాఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరికొద్ది సేపట్లో తిరుపతికి వెళ్లనున్నారు. తిరుపతి తొక్కిసలాట ఘటనలో గాయపడి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని చంద్రబాబు పరామర్శిస్తారు. వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీయనున్నారు. అనంతరం ఘటనకు కారణం ఏమిటి.. ఎవరి తప్పిదం వల్ల ఇలా జరిగింది అనే విషయాలపై అధికారుల నుంచి చంద్రబాబు వివరాలు తెలుసుకోనున్నారు. అదేవిధంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా సాయంత్రం తిరుపతి వెళ్లనున్నారు. ఘటనలో గాయపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందున్న వారిని ఆయన పరామర్శిస్తారు.