Vellampalli Srinivas
Vijayawada Girl Suicide : లైంగిక వేధింపులు తాళలేక విజయవాడలో 9వ తరగతి బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపుతోంది. బాలిక మృతికి సంతాపంగా విజయవాడలో వైసీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీసీ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. బాలికలు, మహిళలపై టీడీపీ నేతల అరాచకాలు నశించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
Lemon Tea : లెమన్ టీ తాగితే ఎక్కవకాలం జీవించవచ్చా?…
పాతబస్తీలో కాళేశ్వరరావు మార్కెట్ సెంటర్ లో పలు వీధుల్లో క్యాండిల్ ర్యాలీ సాగింది. ఆత్మహత్య చేసుకున్న బాలిక.. చదువులో టాపర్ అని మంత్రి వెల్లంపల్లి అన్నారు. గత రెండున్నర నెలలుగా నిందితుడు వినోద్ జైన్ తనను లైంగికంగా వేధించాడని, సూసైడ్ నోట్ లో బాలిక చెప్పిందని, వింటుంటే మాకే చాలా బాధగా అనిపించిందని మంత్రి వాపోయారు. మహిళలపై అరాచకాలు జరిగేది టీడీపీ వాళ్ల వల్లనే అని మంత్రి ఆరోపించారు. నారా లోకేష్ పీఏ తమను ఏడిపిస్తున్నాడని టీడీపీ మహిళా నేతలు ధర్నా చేశారని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం మహిళలకు అండగా నిలుస్తోందన్నారు. దిశ ద్వారా మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి వెల్లంపల్లి.
Budget 2022: కేంద్ర బడ్జెట్‌తో బ్యాంకుల బాదుడు షురూ
ఈ కేసులో నిందితుడు వినోద్ జైన్ పాతబస్తీలో టీడీపీ కార్పొరేటర్ అభ్యర్దిగా పోటీ చేశాడని, అతడి కోసం చంద్రబాబు, కేశినేని నాని ప్రచారం చేశారని మంత్రి చెప్పారు. బాలిక మృతిపై చంద్రబాబు, లోకేష్ సమాధానం చెప్పాలన్నారు. చంద్రబాబుకి మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. రేపటి మహిళా మీటింగ్ లో బాలికకు న్యాయం జరిగే విధంగా చంద్రబాబును మహిళలు నిలదీయాలని మంత్రి అన్నారు. ఈ కేసులో నిందితుడికి కఠినంగా శిక్షపడేలా కృషి చేస్తామన్నారు.
కాగా, బాలిక ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వినోద్ జైన్ పై టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంది. వినోద్ ను టీడీపీ నుంచి సస్పెండ్ చేసింది. దీనిపై మంత్రి వెల్లంపల్లి తీవ్రస్థాయిలో స్పందించారు. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే సరిపోదని, బాలిక ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు. వినోద్ జైన్ తనను ఎలా ఇబ్బంది పెట్టాడో ఆ బాలిక మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని వెల్లడించారు.
అసలు, అంత వయసున్న వ్యక్తికి ఈ బుద్ధి ఎలా వచ్చిందోనని అన్నారు. ఈ ఘటనపై ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని వాపోయారు. వినోద్ జైన్ ఎంపీ కేశినేని నానికి ముఖ్య అనుచరుడు అని, ఇటీవల జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో అతడి కోసం చంద్రబాబు కూడా ప్రచారం చేశాడని వెల్లంపల్లి ఆరోపించారు. ఇలాంటి నీచులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నాడని, అందుకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు.
మరోవైపు ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్ కేకే రాజు ఆధ్వర్యంలో అక్కయ్యపాలెం సెంటర్ లో వైసీపీ నేతలు నివాళి అర్పించారు. బాలికపై టీడీపీ నేత వినోద్ జైన్ లైంగిక వేధింపులకు పాల్పడటం బాధాకరం అన్నారు కేకే రాజు. ఈ కేసులో నిందితుడు వినోద్ జైన్.. చంద్రబాబుకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తి అన్నారు. ఉన్మాది వినోద్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇలాంటి ఘటనలు టీడీపీ హయాంలో చాలానే జరిగాయన్నారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బుద్ధా వెంకన్న, బోండా ఉమ కాల్ మనీ పేరుతో మహిళలను వేధించారని ఆరోపించారు. బాలిక ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు స్పందించాలన్నారు. చంద్రబాబు మహిళా వ్యతిరేకి అని మండిపడ్డారు. టీడీపీ పార్టీ ఆఫీసులో ఓ మహిళను వేధించారని, దీనిపై చంద్రబాబు సమాధానం చెప్పాలని అన్నారు. తమ ప్రభుత్వం మాత్రం మహిళల రక్షణ కోసం దిశ యాప్ తీసుకొచ్చిందన్నారు.