Vijaysai Reddy, YS Jagan
భారత ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్‌ను కలిసి తన ఎంపీ పదవికి సంబంధించిన రాజీనామా లేఖను అందించానని విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన తన రాజీనామాను ఆమోదించారని తెలిపారు. వైసీపీకి రేపు రాజీనామా చేస్తానని చెప్పారు.
రాజీనామా విషయాన్ని లండన్‌లో ఉన్న వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి చెప్పానని విజయసాయిరెడ్డి వివరించారు. అయితే, రాజీనామా చేయొద్దని, తాను, పార్టీ అండగా ఉంటుందని జగన్ హామీ ఇచ్చారని తెలిపారు. రాజీనామా అంశం సరికాదని, దీనిపై పునరాలోచించాలని జగన్ సూచించారని అన్నారు.
వ్యక్తిగత కారణాలతో రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న జగన్‌తో అన్ని అంశాలు మాట్లాడిన తర్వాతే రాజీనామా చేశానని చెప్పారు. తాను రాజీనామా చేయడం కూటమికే లబ్ధి చేకూరుతుందని అన్నారు.
వైసీపీలో తన ప్రాతినిధ్యాన్ని ఎవరూ తక్కువ చేయలేరని విజయసాయిరెడ్డి తెలిపారు. తనలాంటి వాళ్లు 1000 మంది పార్టీ వీడినా జగన్‌కి, పార్టీకి నష్టం లేదని చెప్పారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నానని, ఇకపై తాను రాజకీయాల గురించి మాట్లాడనని తెలిపారు.
ఇప్పటివరకు తాను ఏరోజూ అసత్యాలు చెప్పలేదని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. 40 ఏళ్లుగా జగన్‌తో, ఆయన కుటుంబంతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఆయనతో ఎప్పుడూ విభేదాలు లేవని, భవిష్యత్‌లోనూ రావని అన్నారు. 2011 ఆగస్టులో ఎఫ్‌ఐఆర్‌తో పలు కేసులు పెట్టి కొందరు అప్రూవర్‌గా మారాలని ఎన్నో ఒత్తిడులు తీసుకువచ్చారని చెప్పారు.
అయినప్పటికీ తాను తలవంచలేదని, అలాంటి పరిస్థితులే ఇప్పుడు ఎదురయ్యాయని, తాను జగన్‌కు నమ్మక ద్రోహం చేయనని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం వచ్చాక తనపై కేసు నమోదు చేశారని, లుకౌట్ నోటీసులు ఇచ్చారని చెప్పారు. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని, విక్రాంత్ రెడ్డిని తాను పంపించలేదని తెలిపారు.
విక్రాంత్ రెడ్డికి, తనకు అంత సన్నిహిత సంబంధాలు కూడా లేవని, కేవలం పలకరింపులు మాత్రమే ఉన్నాయని అన్నారు. కేవీ రావుకు విక్రాంత్ రెడ్డిని తాను పరిచయం చేయలేదని, తనకు ఎలాంటి వ్యాపారాలు లేవని, దేనిలోనూ తాను భాగస్వామిని కాదని తెలిపారు. తన వియ్యంకుడు తనతో ఎప్పుడూ వాళ్ల వ్యాపార లావాదేవీల గురించి చర్చించరని, వారి వ్యాపారాల గురించి తనకూ తెలియదని అన్నారు. తనకు బెంగళూరు, విజయవాడల్లో ఇళ్లు, వైజాగ్‌లో ఒక అపార్ట్‌మెంట్ ఉన్నాయని, అవే తన ఆస్తులని తెలిపారు.
Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ శ్రేణుల్లో ఆందోళన.. ఆ పార్టీ నేతలు ఏమన్నారంటే?