విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ నేతల షాకింగ్ రియాక్షన్స్..
విజయసాయి రెడ్డి రాజీనామా విషయం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో

jagan and Vijayasai Reddy (File Photo)
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు.. వైసీపీలో కీలక నేతగా కొనసాగుతున్న విజయసాయిరెడ్డి రాజీనామా ఆ పార్టీ శ్రేణులను షాక్ కు గురిచేసిందనే చెప్పొచ్చు. తాను రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నానని.. రాబోయే కాలంలో ఏ పార్టీలో చేరనంటూ ఆయన ట్వీట్ చేసిన సమయం నుంచి పార్టీలో అసలేం జరుగుతుందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆ పార్టీ శ్రేణులు ప్రయత్నిస్తున్నారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని పలువురు వైసీపీ నేతలు విజయసాయిరెడ్డిని కోరినప్పటికీ ఫలితం లేకపోయింది. శనివారం ఉదయం ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ నివాసానికి వెళ్లి విజయసాయిరెడ్డి తన రాజీనామా లేఖ సమర్పించారు. కొద్ది గంటలకే చైర్మన్ విజయసాయి రెడ్డి రాజీనామాను ఆమోదించారు.
Also Read: Vijayasai Reddy: విజయసాయిరెడ్డి రాజీనామాకు అసలు కారణం అదేనా.. టీడీపీ నేతల రియాక్షన్ ఏమిటంటే..
విజయసాయి రెడ్డి రాజీనామా విషయం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తెలియకుండానే జరిగిందన్న చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జోరుగా జరిగింది. అయితే, ఆ విషయంపై విజయసాయిరెడ్డి రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నానని, లండన్ లో ఉన్న జగన్ తో ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలను వివరించానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంతో నాకు మూడు తరాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ జీవిత కాలంలో ఏరోజూ కూడా ఆ కుటుంబంతో విభేదాలు రావని విజయసాయిరెడ్డి తెలిపారు.
Also Read: Vijayasai Reddy: రాజీనామాకు కారణాలను వెల్లడించిన విజయసాయిరెడ్డి.. జగన్ గురించి మాట్లాడుతూ..
విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి స్పందిస్తూ.. విజయసాయిరెడ్డి పార్టీలో లేనిలోటు కచ్చితంగా ఉంటుంది. పార్టీలో పాత నీళ్లు పొతాయి.. కొత్త నీళ్లు వస్తాయి. పార్టీకి రాజీనామా చేయడం ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం అని పేర్కొన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ నేతలు క్యాడర్ అంతా విజయసాయి రెడ్డి రాజీనామాపై విస్మయానికి గురయ్యాం. బాధపడుతున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడి పోరాటం చెయ్యాల్సిన నాయకులు బయటికి వెళ్లడం కరెక్ట్ కాదు. అధికారంలో ఉండగా పదువులు పొంది కష్టాల్లో ఉన్నప్పుడు బయటికి వెళ్లడం సమంజసం కాదని అభిప్రాయ పడ్డారు.