Vijayasai Reddy: రాజీనామాకు కారణాలను వెల్లడించిన విజయసాయిరెడ్డి.. జగన్ గురించి మాట్లాడుతూ..

వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. శనివారం ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.

Vijayasai Reddy: రాజీనామాకు కారణాలను వెల్లడించిన విజయసాయిరెడ్డి.. జగన్ గురించి మాట్లాడుతూ..

Vijayasai Reddy

Updated On : January 25, 2025 / 1:48 PM IST

Vijayasai Reddy: వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఈ విషయాన్ని శుక్రవారం రాత్రి ట్విటర్ వేదికగా తెలిపిన విజయసాయిరెడ్డి.. శనివారం ఉదయం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ దన్కడ్ నివాసానికి వెళ్లిన విజయసాయిరెడ్డి.. తన రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన రాజీనామా పత్రాన్ని ఆయన అందజేశారు. రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు.

Also Read: Chandrababu Naidu: చంద్రబాబుకి బిల్‌గేట్స్ స్పెషల్ గిఫ్ట్.. అదేమిటో తెలుసా..? చంద్రబాబు ఏమన్నారంటే..

రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. పూర్తిగా వ్యక్తిగత కారణాలతోనే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని చెప్పారు. నా రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. నేను ముందు చెప్పినట్లుగా రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నా. వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడిన తరువాతే రాజీనామా నిర్ణయం తీసుకున్నా. లండన్ లో ఉన్న జగన్ తో ఫోన్లో మాట్లాడి అన్ని విషయాలను వివరించానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైఎస్ కుటుంబంతో నాకు మూడు తరాలుగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ జీవిత కాలంలో ఏరోజూ కూడా ఆ కుటుంబంతో విభేదాలు రావని విజయసాయిరెడ్డి తెలిపారు.

 

నేను రాజీనామా చేసినంత మాత్రాన జగన్ కు ప్రజాదరణ తగ్గదని విజయసాయిరెడ్డి అన్నారు. రాజకీయ జీవితంలో నేను ఎప్పడూ అబద్దం ఆడలేదు. నన్ను అప్రూవర్ గా మారాలని బలవంతం చేశారు. నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా అప్రూవర్ గా మారలేదు. కూటమి ప్రభుత్వం నాపై అక్రమ కేసులు పెట్టింది. పీవీ రావు ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఆయన చెప్పేది నిజమైతే ఆయన కుటుంబ సభ్యులపై ప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డి అన్నారు.

కేసుల నుంచి బయటపడటానికి రాజీనామా చేశారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. రాజకీయాల నుంచి వైదొలగడం వల్ల నేను ఇంకా బలహీనుడినవుతాను తప్ప బలవంతుడిని కాను. అలాంటప్పుడు కేసుల నుంచి ఎలా తప్పిస్తారని అన్నారు. అలాంటి ఆశలు, ఆలోచనలు ఏమీ లేవని చెప్పారు. నేను రాజీనామా చేయడం వల్ల కూటమి ప్రభుత్వమే లబ్ధి పొందుతుందే తప్ప వైసీపీకి కాదని విజయసాయిరెడ్డి చెప్పారు.