Ramanaidu Studio Lands: రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం.. సుప్రీంకోర్టులో సురేశ్ ప్రొడక్షన్స్‌కి దక్కని ఊరట

ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సురేష్ ప్రొడక్షన్స్.

Ramanaidu Studios

Ramanaidu Studio Lands: విశాఖ రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సురేశ్ ప్రొడక్షన్స్ కి ఊరట దక్కలేదు. ఫిలిం సిటీ కోసం కేటాయించిన భూములను ఇతర అవసరాలకు వాడుకోవచ్చని జగన్ ప్రభుత్వం అనుమతించింది. గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని షోకాజ్ నోటీసు ఇచ్చింది కూటమి ప్రభుత్వం. ప్రభుత్వ షోకాజ్ నోటీసును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు సురేష్ ప్రొడక్షన్స్.

దీనిపై జస్టిస్ అభయ్, ఎస్ ఒకా ధర్మాసనం విచారణ జరిపింది. ఈ పిటిషన్ లో జోక్యం చేసుకునేందుకు ధర్మాసనం నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం అడుగుతున్నారు, అది కుదరదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. అవసరం అనుకుంటే.. ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలన్నారు. తమ పిటిషన్ ను ఉపసంహరించుకుంటామని సురేశ్ ప్రొడక్షన్స్ తెలపగా, అందుకు ధర్మాసనం అనుమతించింది.

అసలేంటీ వివాదం?
విశాఖలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2003లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భీమిలి బీచ్‌ రోడ్డులో మధురవాడలో 34.44 ఎకరాల భూమిని రామానాయుడు స్టూడియో కోసం సురేశ్ ప్రొడక్షన్‌కు ఎకరా 52 లక్షలు చొప్పున కేటాయించింది. అప్పడు భూమి ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు వెనక్కి తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

రామానాయుడు స్టూడియోకు 34.44 ఎకరాలు కేటాయిస్తే.. అందులోని 15.17 ఎకరాలను వైసీపీ ముఖ్య నేతలు రియల్‌ ఎస్టేట్‌ ల్యాండ్‌గా మార్చేశారంటూ కూటమి సర్కార్ ఆధారాలు చూపిస్తోంది. స్టూడియో కోసం ఇచ్చిన భూముల్లో లేఅవుట్ వేస్తున్నామని, దానికి అనుమతులు ఇవ్వాలని జీవీఎంసీకి 2023 మార్చి 2న సురేశ్ ప్రొడక్షన్స్‌పై ఒత్తిడి తెచ్చి దరఖాస్తు చేయించారట.

Also Read: వంద పాకిస్థాన్‌లు వచ్చినా భారత్‌ను ఏమీచేయలేవన్న లోకేశ్.. ఏపీలో అందరూ కోరుకున్నట్లే జరిగిందన్న పవన్

అధికారుల నుంచి పర్మిషన్ రాకుండానే భూమిని లేఅవుట్‌గా మార్చేసి ప్లాట్లుగా విభిజించారని లోకల్‌ టాక్. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ నేతలు.. స్టూడియో భూముల్ని అడ్డగోలుగా కొట్టేసే కుట్ర చేస్తున్నారని జనసేన నేతలు గతంలో నిరసనలు కూడా చేశారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. దీంతో ఆ భూమిలో లేఅవుట్ వేయకుండా కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఆ విల్లాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి.

కూటమి ప్రభుత్వం రావడంతో విశాఖ తూర్పు ఎమ్మెల్యేగా మళ్లీ గెలిచిన రామకృష్ణబాబు ఈ భూములు వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ భూముల అంశంపై నివేదిక ఇవ్వాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను కోరింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థ 15.17 ఎకరాల్లో లేఅవుట్ వేసిన మాట నిజమేనని కలెక్టర్ నివేదించినట్లు తెలుస్తోంది. భూమిని కేవలం ఫిల్మ్ స్టూడియో అభివృద్ధి, అనుబంధ పరిశ్రమల స్థాపన కోసం ఉపయోగించాలనే నిబంధనలు ఉన్నాయి.

ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ.. 15.17 ఎకరాల భూమిని నివాస యాజమాన్యంగా మార్చేందుకు అనుమతి కోరినట్లు పక్కా అధారాల్ని నివేదికలో పొందుపరిచారట కలెక్టర్. దీంతో సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు విశాఖలో కేటాయించిన 34.44 ఎకరాల భూమిలో 15.17 ఎకరాల భూమిని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఫిలిం స్టూడియో, అనుబంధ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన భూమిని ఇతర అవసరాలకు వాడటంపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. విచారణ చేసి భూ వినియోగ మార్పు హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉందని రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నివేదిక అందజేశారు. దీంతో, నిబంధనలు ఉల్లఘించినందుకు ఆ 15.17 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని కూటమి ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది.