Visakhapatnam Lok Sabha Constituency : సాగరతీరంలో రాజకీయం గరంగరం…విశాఖ పార్లమెంట్‌ పరిధిలో పార్టీల వ్యూహాలేంటి ? వైసీపీని టీడీపీ క్లీన్‌బౌల్డ్ చేస్తుందా ?

విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు... నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు.. స్థానికుడు కాకపోయినా.. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరు ఉంది. మత్స్యకార సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. విద్యావంతులు, వ్యాపారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

Visakhapatnam Lok Sabha Constituency

Visakhapatnam Lok Sabha Constituency : విశాఖ.. హార్ట్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌.. హాట్‌ టాపిక్‌ ఆఫ్‌ ది పాలిటిక్స్‌ ! సాగరతీరంలో రాజకీయం గరంగరంగా కనిపిస్తోంది. ఇప్పుడే యుద్ధం మొదలుపెట్టిన పార్టీ ఒకటైతే.. సక్సెస్ స్పీచ్ సిద్ధం చేసుకున్న పార్టీ మరొకటి ! ఎవరి అంచనాలు వారివి.. ఎవరి వ్యూహాలు వారివి ! క్లీన్‌స్వీప్‌ చేయాలని వాళ్లు.. ప్రత్యర్థిని క్లీన్‌బౌల్డ్ చేయాలని వీళ్లు.. రాజకీయంలో ఎత్తులకు పైఎత్తులు కనిపిస్తున్న వేళ.. విశాఖ రాజకీయం రంజుగా మారుతోంది. రాజధాని ప్రకటన తర్వాత.. ఏపీ రాజకీయానికి అనధికారిక కేంద్రంగా మారిపోయింది వైజాగ్‌. టీడీపీ, వైసీపీ.. ఈ జిల్లాలను, పార్లమెంట్ స్థానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అందుకే ! కనిపించే ఆప్షన్‌ ఒక్కటే.. అదే విజయం అనే రేంజ్‌లో పార్టీలు తలపడుతున్నాయ్. మరి ఏ పార్టీ బలం ఏంటి.. ఏ పార్టీ బలహీనత ఏంటి.. పోటీలో నిలిచేదెవరు.. నిలిచి గెలిచే సత్తా ఉంది ఎవరికి.. విశాఖ పార్లమెంట్‌ పరిధితో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల రాజకీయం చెప్తుందేంటి.. ఈసారి పోటీలో గంటా కనిపించడం కష్టమేనా.. అవంతి శ్రీనివాస్‌ను టెన్షన్‌ పెడుతున్న విషయాలేంటి..

Visakhapatnam Lok Sabha Constituency

ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్‌వేలో రాజధాని రగడ, ఉక్కు ఫ్యాక్టరీ ఉక్కపోత

రాజధాని రగడ అక్కడే.. ఉక్కు ఫ్యాక్టరీ వ్యవహారం మిగిల్చిన రాజకీయ ఉక్కపోత అక్కడే.. అలల హోరుకు మించి వినిపించింది ప్రతిధ్వనిస్తుంది అక్కడి రాజకీయం తీరు ! అలాంటి విశాఖ రాజకీయం.. విధవిధాల ఆసక్తి రేపుతోందిప్పుడు ! ఉత్తరాంధ్ర రాజకీయాలకు గేట్‌వే.. ఉమ్మడి విశాఖ జిల్లా ! ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌ ప్రకటన తర్వాత మరింత ప్రాధాన్యత పెరిగింది. ప్రధాన పార్టీలన్నీ ముఖ్య కార్యక్రమాలకు స్టీల్ సిటీనే వేదికగా ఎంచుకుంటున్నాయ్. అనధికారిక పొలిటికల్ హెడ్ క్వార్టర్ అనేంతలా జరుగుతున్నాయ్ యాక్టివిటీస్‌! సామాజిక సమీకరణాల లెక్క చూస్తే.. తెలంగాణకు హైదరాబాద్‌ ఎలానో.. ఏపీకి విశాఖ అలాగా ! సంస్కృతి, సంప్రదాయాలు, సామాజికవర్గాలు, ఆర్థిక సమీకరణాలు అంతకుమించి అనిపిస్తుంటాయ్ అక్కడ ! అందుకే విశాఖలో సత్తా చాటాలని ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే పావులు కదుపుతున్నాయ్.

READ ALSO : Araku Lok Sabha Constituency : రాజకీయాలకు వార్ జోన్‌గా మారిన అరకు….ఆంధ్రా ఊటీ లో హాట్ హాట్ గా రాజకీయాలు

sathyanarayana

ఎంపీ అయినప్పటి నుంచి ఎంవీవీకి చేదు అనుభవాలే …సోషల్‌ ఇంజినీరింగ్ మంత్రాన్ని జపిస్తున్న వైసీపీ..

విశాఖ పార్లమెంట్‌ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయ్. గత ఎన్నికల్లో టీడీపీ 4, వైసీపీ మూడు స్థానాల్లో విజయం సాధించాయ్. క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా పెట్టుకున్న ఫ్యాన్ పార్టీ.. సోషల్‌ ఇంజినీరింగ్ మంత్రాన్ని నమ్ముకుంటోంది. అవసరం అనుకుంటే సిట్టింగ్‌ల్లో కొందరిని పక్కనపెట్టేందుకు కూడా జగన్ వెనకాడడం లేదు అనే చర్చ జరుగుతోంది. రాష్ట్రం అంతా షాక్ తగిలినా.. విశాఖ మాత్రం టీడీపీకి ఊరట కలిగించింది. 2024 పట్టు నిలుపుకోవడంతో పాటు జగన్‌ పార్టీకి ఝలక్ ఇవ్వాలని టీడీపీ పావుల కదుపుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ పార్లమెంట్‌ పరిధిలో టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య హోరాహోరీ పోరు నడవగా.. ఫ్యాన్‌ పార్టీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ.. టీడీపీ అభ్యర్థి భరత్‌పై 4వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎంపీగా విజయం సాధించినప్పటి నుంచి ఎంవీవీకి చేదు అనుభవాలే ఎదురవుతున్నాయ్. సొంత పార్టీలో వ్యతిరేకతతో పాటు.. ప్రత్యేక హోదా, రైల్వే జోన్‌, నిధుల కేటాయింపులు.. ఎంపీ మీద ఒత్తిడి తీసుకొచ్చాయ్. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎంపీ పదవికి రాజీనామా చేయాలని జనాల నుంచి డిమాండ్‌ ఎన్నోసార్లు వినిపించింది. వీటికితోడు భూవివాదాలు కూడా ఎంవీవీని చుట్టుముట్టాయ్. ఓ దశలో విజయసాయిరెడ్డితోనూ ఆయనకు మాటా మాట పెరిగిన పరిస్థితి కనిపించింది.

bharath,narasimham,lakshminarayana

READ ALSO : Vizayanagaram Lok Sabha Constituency : రాజుల కోట..కాకలు తీరిన నేతల అడ్డా..విజయనగరం పార్లమెంట్‌ పరిధిలో విజయం ఎవరిది?

పార్లమెంట్ విడిచి అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంవీవీ ప్రయత్నాలు..టీడీపీ నుంచి మళ్లీ బరిలోకి దిగబోతున్న భరత్‌

వివాదాలన్నీ వరుసగా కమ్ముకొస్తున్న వేళ.. పార్లమెంట్ విడిచి ఈసారి అసెంబ్లీకి పోటీ చేయాలని ఎంవీవీ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అధిష్టానం అంగీకరిస్తే.. విశాఖ తూర్పు నుంచి బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని టాక్‌. అదే జరిగితే ఎంపీ టికెట్‌ను బీసీ మహిళకు కేటాయించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత మేయర్ గోలగాని హరి వెంకట కుమారితో పాటు విశాఖ తూర్పు సమన్వయకర్త అక్రమాని విజయనిర్మల ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. టీడీపీ తరఫున గత ఎన్నికల్లో పోటీ చేసిన ఓడిన భరత్‌.. మళ్లీ బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. బీజేపీ నుంచి జీవీఎల్‌ నర్సింహరావు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. విశాఖలో సమస్యలపై వరుసగా గళం ఎత్తుతూ.. పొలిటికల్ అటెన్షన్‌ డ్రా చేసే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఓకే అయింది. మరి బీజేపీ కూడా చేరుతుందా.. చేరితో జీవీఎల్ కలల సంగతి ఏంటి అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ.. మూడు పార్టీలు విశాఖ మీద నజర్ పెంచాయ్. పొత్తు కుదిరితే తర్వాత ఎత్తు ఏంటి ఆసక్తికరంగా మారింది. 2019లో జనసేన నుంచి పోటీ చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. 2024లో స్వతంత్ర్య అభ్యర్థిగా పార్లమెంట్‌ బరిలో నిలిచే ప్రయత్నాలు చేస్తున్నారు.

విశాఖ పార్లమెంట్‌ పరిధిలో విశాఖ తూర్పు, దక్షిణ, పశ్చిమ, ఉత్తర నియోజకవర్గాలతో పాటు.. గాజువాక, భీమిలి, పెందుర్తి సెగ్మెంట్‌లు ఉన్నాయ్.

Avanthi Srinivas, lokesh

భీమిలి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి అవంతి… వైసీపీని టెన్షన్‌ పెడుతున్న గ్రూప్‌ రాజకీయాలు.. భీమిలి నుంచి లోకేశ్ పోటీ చేస్తారన్న ప్రచారం

భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం.. మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడం.. భీమిలి వైసీపీని టెన్షన్ పెడుతున్నాయ్. గ్రూప్‌ రాజకీయాలు గుబులు రేపుతున్నాయ్. దీనికితోడు ఆ మధ్య ఓ మహిళతో ఆడియో కాల్‌ వ్యవహారంలో ఆయన పేరు బయటకు వినిపించడం.. అవంతిని కార్నర్‌ చేసేలా చేస్తోంది. మరోసారి ఆయనే పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తుండగా.. వైసీపీ అధిష్టానం మాత్రం మరింత బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. భీమిలిలో నాయకత్వంపరంగా టీడీపీ వీక్‌గా కనిపిస్తోంది. మండల స్థాయి లీడర్‌ను ఇంచార్జిగా నియమించగా.. కేడర్ చెల్లాచెదురు అయింది. భీమిలి నుంచి టీడీపీ తరఫున లోకేశ్‌ పోటీకి దిగే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి పంచకర్ల సందీప్ మరోసారి భీమిలి బరిలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

READ ALSO : Srikakulam Lok Sabha Constituency : ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పొలిటికల్ సీన్ ఏంటి ? వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మధ్య టఫ్‌ ఫైట్‌ తప్పదా..

tippala nagireddy, pawankalyan

గాజువాకలో పోటీ చేసి ఓడిన పవన్ కల్యాణ్‌….సిట్టింగ్ ఎమ్మెల్యేగా తిప్పల నాగిరెడ్డి..టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ అయితే వచ్చే ఎన్నికల్లో భారీ ప్లస్‌

విశాఖ జిల్లాలో హాటెస్ట్‌ సెగ్మెంట్‌.. గాజువాక ! 2019లో జనసేనాని పవన్‌ పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం తిప్పల నాగిరెడ్డి ఎమ్మెల్యేగా కొనసాగుతుండగా.. వయోభారం కారణంగా ఆయనకు మరో చాన్స్‌ కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. గురుమూర్తి రెడ్డి, అమర్ లేదా నాగిరెడ్డి కుమారుల్లో ఎవరో ఒకరు బరిలో నిలిచే చాన్స్ ఉంది. టీడీపీ నుంచి పల్ల శ్రీనివాసులు రావుకు టికెట్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జనసేన నుంచి కోణ తాతారావు టికెట్‌ ఆశిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్‌ పోరాటం, నిర్వాసితుల సమస్యలు.. ఇక్కడ అధికార పార్టీని ఇబ్బంది పెడుతున్నాయ్. గాజువాకలో కాపు ఓటర్ల ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో ఓట్లు చీలినా.. ఈసారి కచ్చితమైన వైఖరితో ఉండాలని వారంతా ఫిక్స్ అయ్యారు. టీడీపీ, జనసేన పొత్తు ఫిక్స్ అయితే.. ఈ రెండు పార్టీలకు అది మేజర్ ప్లస్‌ కావడం ఖాయం.

adeepraj, sathyanarayana

READ ALSO : Anakapalle Lok Sabha Constituency : పేరు మాత్రం సాఫ్ట్…రాజకీయం మాత్రం మస్త్ హాట్…అనకాపల్లిలో పోటాపోటీగా పొలిటికల్ వార్

పెందుర్తి సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా అదీప్‌ రాజ్.. తలనొప్పిగా మారిన పార్టీలోని వర్గ విభేదాలు

పెందుర్తి నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన అదీప్‌ రాజ్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. వర్గ విభేదాలతో పాటు.. సీనియర్ నాయకులు టికెట్ రేసులో ఉండడం.. అదీప్‌రాజ్‌కు ప్రతీకూలంగా మారుతోంది. సీనియర్లు అంతా ఎవరికి వారే అన్నట్లు తమ పని తాము చేసుకుంటూ వెళ్లడం.. ఇక్కడ అధికార పార్టీలో విభేదాలకు కారణం అవుతోంది. అదీప్‌రాజ్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు టికెట్‌ రేసులో ఉన్నారు. టీడీపీ నుంచి సీనియర్ నాయకుడు బండారు సత్యనారాయణ లేదా ఆయన కుమారుడు పోటీలో దిగే అవకాశాలు ఉన్నాయ్. గండి బాబ్జీ పేరు కూడా ప్రముఖంగా పోటీలో వినిపిస్తోంది. బండారుకు బలమైన నాయకుడు అనే పేరు ఉన్నా.. ద్వితీయ శ్రేణి నాయకత్వం వీక్‌ కావడం.. ఇక్కడ టీడీపీ మేజర్ మైనస్‌.

Velagapudi Ramakrishna Babu

విశాఖ తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యేగా వెలగపూడి రామకృష్ణ బాబు…నాలుగోసారి పోటీకి సిద్ధం

విశాఖ తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నుంచి వరుసగా మూడుసార్లు గెలిచిన వెలగపూడి రామకృష్ణబాబు… నాలుగోసారి కూడా పోటీకి సిద్ధం అవుతున్నారు.. స్థానికుడు కాకపోయినా.. జనాలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నేతగా ఆయనకు పేరు ఉంది. మత్స్యకార సామాజికవర్గంలో మంచి పట్టు ఉంది. విద్యావంతులు, వ్యాపారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక్కడ వైసీపీ ఇంత వరకు విజయం సాధించలేదు. ఐతే ఈసారి ఎలాగైనా జెండా పాతాలన్న లక్ష్యంతో ఉన్న వైసీపీ.. సోషల్‌ ఇంజినీరింగ్ మొదలుపెట్టింది. అందులో భాగంగా హరివెంకటకుమారి, విజయనిర్మల, వంశీకృష్ణకు కీలక బాధ్యతలు కట్టబెట్టింది. విశాఖ పార్లమెంట్ వదిలి తూర్పులో పోటీకి ఎంవీవీ సత్యనారాయణ సిద్ధం అవుతున్నారు. అధిష్టానం కూడా ఈ విషయంలో పాజిటివ్‌గానే ఉన్నట్లు కనిపిస్తోంది. జనసేన నుంచి పీతల మూర్తి యాదవ్‌ టికెట్‌ ఆశిస్తున్నారు.

Vasupalli Ganesh, babji

READ ALSO : Amalapuram Lok Sabha constituency : కోనసీమలో పట్టుకోసం అధికార వైసీపి ఎత్తుగడలు.. రాజకీయ అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న టీడీపీ, జనసేన !

విశాఖ దక్షిణంలో వైసీపీని టెన్షన్‌ పెడుతున్న అంతర్గత విభేదాలు… గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి జంప్‌ అయిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్

విశాఖ పార్లమెంట్‌ పరిధిలో దక్షిణ నియోజకవర్గం చాలా కీలకం. 2019లో టీడీపీ నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్… ఆ తర్వాత వైసీపీ గూటికి చేరుకున్నారు. వాసుపల్లి రాకతో వైసీపీ మరింత బలోపేతం అయినా.. అంతర్గత రాజకీయాలు అధికార పార్టీలో అగ్గి రాజేస్తున్నాయ్. సీనియర్లతో సఖ్యత లేకపోవడం.. వాసుపల్లికి మైనస్‌గా మారే అవకాశాలు ఉన్నాయ్. వైసీపీ నుంచి విశాఖ సౌత్ రేసులో వాసుపల్లితో పాటు.. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే రెహమాన్‌ పేర్లు వినిపిస్తున్నాయ్. ఇక్కడ టీడీపీకి గండి బాబ్జీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. సైకిల్ పార్టీకి ఇక్కడ మంచి ఓటు బ్యాంకే ఉన్నా.. బాబ్జీ స్ధానికేతరుడు కావడంతో జనాలకు సరిగా చేరువ కాలేకపోతున్నారనే టాక్ ఉంది. టీడీపీ, జనసేన పొత్తు కొనసాగితే పర్లేదు.. ఎవరికి వారు అభ్యర్థులు నిలబెడితే.. ఇక్కడ అది వైసీపీకి అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయ్.

srinivasarao, vishnukumar, kkraju

విశాఖ ఉత్తరం సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు…టీడీపీని ఇబ్బంది పెడుతున్న నాయకత్వ సమస్య

విశాఖ ఉత్తరం నియోజకవర్గ రాజకీయాలు పొలిటికల్‌గా ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంటాయ్. విశాఖ పార్లమెంట్‌ పరిధిలోనే ఖరీదైన నియోజకవర్గం ఇది ! మాజీమంత్రి గంటా సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి కేకే రాజుపై 18వందల ఓట్ల తేడాతో గంటా విజయం సాధించారు. విశాఖ నార్త్‌పై వైసీపీ మంచి పట్టు సాధించింది. 2024లోనూ వైసీపీ నుంచి కేకే రాజు బరిలో నిలవడం దాదాపు కన్ఫార్మ్ అయింది. పార్టీవర్గాల నుంచి ఎలాంటి ప్రతికూలత లేదు. నిత్యం జనాలకు అందుబాటులో ఉండడం కేకే రాజుకు భారీ ప్లస్‌. నార్త్‌లో నాయకత్వ లేమి టీడీపీని ఇబ్బంది పెడుతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే గంటా.. ఇంచార్జిని నియమించి చేతులు దులుపుకున్నారు. దీంతో పార్టీ బాగా వీక్ అయింది. ద్వితీయ శ్రేణి నాయకత్వం అంతా వైసీపీ వైపు చూస్తోంది. ప్రస్తత సమీకరణాలతో వైసీపీకి అనుకూలంగా కనిపిస్తున్నా.. టీడీపీ, జనసేన పొత్తు కుదిరితే సీన్ మారే చాన్స్ ఉంది. ఇక్కడ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ తరఫున రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. జనసేన నుంచి పసుపులేటి ఉషకిరణ్ టికెట్ ఆశిస్తున్నారు.

READ ALSO : Kakinada Lok Sabha Constituency : కాకినాడలో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ లో తిరగనుందా?….ఈసారి ఎన్నికల్లో బలమైన కాపు సామాజిక వర్గం మద్దతు ఏపార్టీకి?

ganababu, anand

విశాఖ పశ్చిమం నుంచి వరుసగా రెండుసార్లు గణబాబు…వివాదరహితుడిగా పేరు

విశాఖ పశ్చిమ నుంచి… టీడీపీ ఎమ్మెల్యే గణబాబు వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేపై ఎలాంటి వ్యతిరేకత లేదు. పైగా వివాదరహితుగా పేరు ఉండడం.. గణబాబుకు కలిసిరావుంది. విశాఖ పశ్చిమంలో వైసీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. ఈసారి ఎలాగైనా విక్టరీ కొట్టాలని గత ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన మళ్ల విజయప్రసాద్‌ను వైసీపీ పక్కనపెట్టింది. ప్రముఖ పారిశ్రామికవేత్త అడారి ఆనంద్‌ను రంగంలోకి దించింది. గవర సామాజికవర్గంతో పాటు పారిశ్రామిక ప్రాంత ఓటర్లను టార్గెట్‌ చేయాలని వ్యూహాలు రచిస్తోంది. కాపు ఓటర్లు ఇక్కడ కీలకం కానున్నారు. జనసేన కలిస్తే టీడీపీకి భారీగా కలిసిరానుంది. టీడీపీ, వైసీపీ నుంచి పెద్దగా పేర్లు వినిపించకపోయినా.. గణబాబు, అడారి ఆనంద్‌ మధ్య పోటీ ఖాయం. ప్రస్తుతానికి ఏ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవు. ఎన్నికల నాటికి సీన్ ఎలా మారుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

విశాఖ కేంద్రం జరుగుతున్న పరిణామాలు.. మారుతున్న రాజకీయం అంతా ఇంతా కాదు ! దీంతో ఈ జిల్లాపై సత్తా చాటేదెవరు.. పార్లమెంట్‌ స్థానంలో జెండా ఎగురవేసేదెవరు.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాగా వేసేదెవరు అనే ఆసక్తి రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. వివాదాలు, వర్గపోరులు.. అసంతృప్తులు, అలకలు.. అన్నీ దాటుకొని ఎవరు విజేతగా నిలుస్తారు.. సాగరతీరం సాక్షిగా తొడకొట్టబోతున్నారని జనం డిస్కస్‌ చేసుకుంటున్నారు.