Vizayanagaram Lok Sabha Constituency : రాజుల కోట..కాకలు తీరిన నేతల అడ్డా..విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయం ఎవరిది?
చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో వైసీపీ పర్ఫెక్ట్ స్ర్టాంగ్‌గా కనిపిస్తోంది ఇక్కడే ! రాజకీయ వ్యవహారాలన్నీ బొత్స మేనల్లుడు చిన్న శ్రీనునే చూస్తుంటారు. నియోజకవవర్గాన్ని అభివృద్ధి చేస్తూ.. నేతల మధ్య విభేదాలు, వివాదాలు లేకుండా.. మంత్రి బొత్స, చిన్న శ్రీను జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

vijayanagaram
Vizayanagaram Lok Sabha Constituency : అది రాజుల ఖిల్లా.. రాజసం పలకరించే జిల్లా ! కాకలు తీరిన నేతలకు చిరునామాగా నిలిచిన నేల… అదే విజయనగరం. పూసపాటి వంశీయులు పాలించిన ప్రాంతం కావడంతో… దీనికి చారిత్రక విశిష్టత కూడా ఎక్కువే. ప్రజాస్వామ్య కాలంలోనూ.. రాజులదే ఇక్కడ ఆధిపత్యం. అలాంటి రాజుల కోటాలో ఫ్యాన్ పార్టీ చక్రం తిప్పింది. గత ఎన్నికల్లో టాప్ నంబర్‌లో తిరిగి.. క్లీన్‌స్వీప్ చేసింది. మరి ఇప్పుడు విజయనగరం పార్లమెంట్ రాజకీయం ఎలా ఉంది.. వైనాట్ 175 అంటున్న వైసీపీ మరోసారి ఇక్కడ క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమా.. రాజుల ప్రభావం ఎలా ఉండబోతోంది.. టీడీపీ బలాలేంటి బలహీనతలేంటి.. ఏ నియోజకవర్గంలో ఎవరు అధిపత్యంలో ఉన్నారు.. రెండు పార్టీలను కామన్‌గా ఒకే విషయం ఇబ్బందిపెడుతోందా.. విజయనగరంలో గెలుపు గుర్రాలు ఎవరు..
విజయనగరం యుద్ధంలో బరిలోకి దిగే సైనికులెవరు..? ఫ్యాన్ స్పీడ్‌కు టీడీపీ బ్రేకులు వేయగలుగుతుందా?
రాష్ట్ర రాజకీయాల్లో విజయనగరానికి ప్రత్యేక స్థానం ఉంది. అశోక్ గజపతిరాజు, బొత్స సత్యనారాయణలాంటి కీలక నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నేల ఇది ! పార్టీల అంచనాలు మారతాయేమో.. ప్రజల తీర్పు మాత్రం స్పష్టంగా ఉంటుంది ప్రతీసారి ! ఒకప్పుడు టీడీపీ కంచుకోట అయిన విజయనగరం పార్లమెంట్‌లో ఇప్పుడు ఫ్యాన్ పార్టీ పాగా వేసింది. 2009లో విజయనగరం పార్లమెంట్ స్థానం ఏర్పాటుకాగా.. మూడుసార్లు ఎన్నికలు జరిగితే.. కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ ఒక్కోసారి విజయం సాధించాయ్. బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. గత ఎన్నికల్లో విజయనగరం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీలను క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ.. ఈసారి కూడా ధీమాగా కనిపిస్తుండగా.. ఫ్యాన్ పార్టీ స్పీడ్‌కు బ్రేకులు వేయాలని టీడీపీ వ్యూహాలు సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ నామమాత్రంగానే మారగా.. విజయనగరం రాజకీయం ఆసక్తికరంగా మారింది.

chandrashekar,gajapathiraju
విజయనగరం ఎంపీగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లాన చంద్రశేఖర్.. 2024 ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలని ఆలోచనలో బెల్లాన
2019 లోక్‌సభ ఎన్నికల్లో అశోక్ గజపతిరాజుపై గెలిచి బెల్లాన చంద్రశేఖర్ రికార్డు క్రియేట్ చేశారు. పాలనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బెల్లాన.. తన పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలందరితో సమన్వయం చేసుకుంటూ.. అందరినీ కలుపుకుపోతున్నారు. ఆయనకు వ్యతిరేక వర్గం లేకపోవడం హైలైట్. అన్ని నియోజకవర్గాల్లో సొంత బలగం లేకపోయినా.. సొంత నియోజకవర్గం చీపురుపల్లి… పక్కనే ఉన్న ఎచ్చర్లలో బెల్లానకు మంచి పట్టు ఉంది. ఈ రెండు నియోజకవర్గాల్లో… గెలుపోటములు ఆయన కనుసన్నల్లో ఉంటాయని టాక్. చీపురుపల్లిలో బొత్స మేనల్లుడు శ్రీనుతో.. బెల్లానకు ఆధిపత్య పోరు నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బయటకు అంతా కూల్‌గానే కనిపించినా.. తెరవెనక వర్గపోరు పీక్స్‌లో ఉందనే ప్రచారం ఉంది. వచ్చే ఎన్నికల్లో ఎంపీ బెల్లాన విజయనగరం నుంచి పోటీకి విముఖత చూపుతున్నారన్న వాదన ఉంది. 2024 ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది. దీనికోసం ఎచ్చెర్ల అసెంబ్లీ స్థానాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం కూడా మొదలుపెట్టారని సమాచారం.

botsa satyanarayana
బొత్స కుటుంబంలోనే ఒకరికి ఎంపి టికెట్ ఇచ్చే చాన్స్.. అశోక్ గజపతి రాజు మరోసారి ఎంపిగా పోటీ చేస్తారా?
బెల్లాన వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తే.. ఎంపీ టికెట్ వైసీపీలో ఎవరికి కేటాయిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. బొత్స కుటుంబంలోనే ఒకరికి టికెట్ ఇచ్చే చాన్స్ ఉందనే ప్రచారం నడుస్తోంది. మంత్రి బొత్స పేరు కూడా ఈ లిస్టులో వినిపిస్తోంది. బొత్సను ఎంపీగా బరిలోకి దింపితే… చీపురుపల్లి అసెంబ్లీ టికెట్‌ను ఆయన మేనల్లుడు, జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావుకు కేటాయించే అవకాశాలు ఉన్నాయ్. బొత్స సతీమణి ఝాన్సీ పేరు కూడా టికెట్ రేసులో వినిపిస్తోంది. బొత్స కుటుంబం, అనుచరులు పోటీ చేస్తే తప్ప ఈ స్థానంలో విజయం సాధించడం ఇబ్బందే ! ఇక టీడీపీ నుంచి టీడీపీ నుంచి ఎవరు పోటీకి దిగుతారన్న విషయంలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. 2019లో సైకిల్ పార్టీ తరఫున పోటీ చేసిన అశోక్ గజపతి రాజు.. ఘోర పరాభవం చెందారు. దీంతో మళ్లీ ఆయన ఆయన ఎంపీగా పోటీ చేసే చాన్స్ లేదని టీడీపీలో చర్చ జరుగుతోంది. దీంతో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయ్. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు పేరు లిస్టులో వినిపిస్తోంది. ఐతే ఎంపీగా పోటీ చేసేందుకు ఆయన విముఖత చూపిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, బొబ్బిలి రాజు సుజయ కృష్ణ రంగారావు పేరు కూడా పరిశీలనలో ఉంది. 2019 ఎన్నికల తర్వాత రాజకీయాలకు అంటీముట్టనట్టుగా ఉంటున్నారు సుజయ. విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు కూడా రేసులో వినిపిస్తోంది. వీరితో పాటు నెల్లిమర్ల నియోజకవర్గ సీనియర్ నేత, డెంకాడ మాజీ ఎంపీపీ కంది చంద్రశేఖరరావు పేర్లు కూడా టీడీపీ నుంచి ఎంపీ రేసులో వినిపిస్తున్నాయ్.
విజయనగరం పార్లమెంట్ పరిధిలో విజయనగరం అసెంబ్లీతో పాటు నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, ఎచ్చెర్ల, రాజాం అసెంబ్లీ స్థానాలు ఉన్నాయ్. కొన్ని నియోజకవర్గాల్లో వైసీపీకి, మరికొన్నింట్లో టీడీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయ్.

sthayanarayan,gajapathiraju
విజయనగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కోలగట్ల వీరభద్రస్వామి..టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు పోటీ చేసే చాన్స్
విజయనగరం అసెంబ్లీ స్థానంలో కోలగట్ల వీరభద్రస్వామి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆర్య వైశ్య సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. బీసీల్లోనూ కోలగట్లకు మంచి పట్టు ఉంది. జనాలకు అందుబాటులో ఉండే నేతగా ఆయనకు మంచిపేరు ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ దాదాపు కన్మార్మ్ అయినా.. గ్రూప్ రాజకీయాలు కోలగట్లను టెన్షన్ పెడుతున్నాయ్. బొత్స వర్గంతో కోలగట్లకు ముందు నుంచి మంచి సంబంధాలు లేవు. కార్పొరేషన్ ఎన్నికల్లో టికెట్ల రగడ.. అధిష్టానం వరకు వెళ్లింది. అప్పటి నుంచి బొత్స, కోలగట్ల వర్గాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయ్. బీసీలకే టికెట్ ఇవ్వాలంటూ బొత్స అనుచరులు తీసుకొచ్చి నినాదం.. ఆయనకు తలపోటుగా మారింది. టీడీపీ నుంచి అదితి గజపతిరాజు ఇంచార్జిగా ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో అశోక్‌గజపతి రాజు పోటీచేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇది కోలగట్లకు సవాల్ విసిరే పరిణామమే. దీంతో వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ ఫైట్ మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం.
READ ALSO : Rajampet Lok Sabha Constituency : రసవత్తరంగా రాజంపేట పార్లమెంట్ రాజకీయం….ట్రయాంగిల్ ఫైట్ తప్పదా ?

appalanaidu
నెల్లిమర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా బడ్డుకొండ అప్పలనాయుడు.. గ్రూప్ రాజకీయాలు, అవినీతి ఆరోపణలతో సతమతం
విజయనగరం పార్లమెంట్ పరిధిలో అత్యంత కీలకమైన నియోజకవర్గం నెల్లిమర్ల. అటు విశాఖ, ఇటు విజయనగరం మధ్య విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం… పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం ఈ నియోజకవర్గంలోనే ఉండడంతో.. రాష్ట్ర రాజకీయం నెల్లిమర్ల పరిణామాలను ఆసక్తిగా గమనిస్తోంది. బడ్డుకొండ అప్పలనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ఇలాంటి స్థానంలో మళ్లీ వైసీపీ పట్టు నిలుపుకోవడం అంత ఈజీ కాదు. టికెట్ విషయంలో ఇబ్బందులు లేకపోయినా.. గ్రూప్ రాజకీయాలు, అవినీతి ఆరోపణలు.. అప్పలనాయుడుకు మైనస్‌గా మారే అవకాశం ఉంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ భూ సేకరణలో అవకతవకలు, మత్స్యకారులకు జెట్టీ నిర్మాణం, పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంలాంటివి.. అప్పలనాయుడుకు ప్రతికూలంగా మారాయ్. సొంత బంధువుల నుంచే అప్పలనాయుడుకు వ్యతిరేకత ఎదురవుతోంది. మంత్రి బొత్స సోదరుడు బొత్స లక్ష్మణరావు… అప్పలనాయుడుకు వ్యతిరేకంగా గ్రూపు రాజకీయాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. టీడీపీలో ఇంతకు పదిరెట్లు గ్రూప్ పాలిటిక్స్ కనిపిస్తున్నాయ్. ఇప్పటివరకు ఇక్కడ టీడీపీ ఇంచార్జి ఎవరో కూడా తేలలేదు. సీనియర్ నేత, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబంతో పాటు నెల్లిమర్లకు చెందిన కడగల ఆనంద్, డెంకాకు చెందిన కంది చంద్రశేఖర్, భోగాపురంకు చెందిన కర్రోతు బంగార్రాజు టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనకు మంచి ఓటు బ్యాంకు ఉంది. పొత్తుగా వెళ్తే.. ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయ్.

appalanarasaiah
గజపతినగరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా బొత్స అప్పలనర్సయ్య.. టీడీపీ గ్రూప్ తగాదాలు వైసీపీకి ప్లస్ అయ్యే చాన్స్
గజపతినగరంలో బొత్స అప్పల నర్సయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పార్టీలో ఆయనకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా.. వ్యక్తిగత ఆరోపణలు ఇబ్బందిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయ్. భూసెటిల్‌మెంట్లు, క్వారీల నిర్వహణతో బిజీగా ఉంటూ.. పార్టీ బలోపేతంపై పెద్దగా దృష్టిపెట్టలేదన్న వాదన ఉంది. నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదన్న విమర్శలు ఉన్నాయ్. వచ్చే ఎన్నికల్లో ఇవి అప్పలనర్సయ్యను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. గజపతినగరంలో టీడీపీ రెండువర్గాలుగా విడిపోయింది. పార్టీ ఇంచార్జి కేఏ నాయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని.. అశోక్ గజపతితో కానీ, అధిష్టానంతో కానీ.. అసలు టచ్‌లోనే ఉండరు అనే ప్రచారం ఉంది. దీంతో శివరామకృష్ణ మరో వర్గంగా విడిపోయి.. వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇలా ఇద్దరు నేతలు గ్రూప్ రాజకీయాలు నడుపుతూ.. సైకిల్ పార్టీని వీక్ చేస్తున్నారు. టీడీపీలో గ్రూప్ తగాదాలు వైసీపీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయ్.
READ ALSO : Bapatla Lok Sabha Constituency : సాగరతీరంలో కాక రేపుతున్నరాజకీయాలు.. బాపట్ల రాజకీయాలు చాలా హాట్ గురూ !

appalanaidu, babynayana
బొబ్బిలిలో టీడీపీ నుంచి వైసీపీకి గట్టి పోటీ ఖాయం.. బొబ్బిలిలో మొదటి నుంచి రాజులదే హవా !
బొబ్బిలిలో వైసీపీ నుంచి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2019లో సూపర్ మెజారిటీ సాధించినా.. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మునుపటి సానుకూలత ఆయనకు ఇప్పుడు లేదు. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయ్. ఈసారి టికెట్ ఆయనకే దాదాపు కన్ఫార్మ్ అని ప్రచారం జరుగుతున్నా.. ఈసారి టీడీపీ నుంచి వైసీపీకి గట్టి పోటీ ఖాయంగా కనిపిస్తోంది. బొబ్బిలిలో మొదటి నుంచి రాజులదే హవా ! మాజీ మంత్రి సుజయ కృష్ణ రంగారావు ఇక్కడ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో ఓడిన తర్వాత.. నియోజకవర్గానికి, రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. దీంతో రంగారావు సోదరుడు బేబీనాయనకు టీడీపీ ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అప్పటివరకు అన్నచాటు తమ్ముడిగా ఉన్న బేబీనాయన.. ఇంఛార్జిగా సమర్థవంతమైన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీని మరింత బలోపేతం చేశారు. జనాలకు అందుబాటులో ఉంటూ.. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్నారు. బేబీనాయన రూపంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి గట్టి పోటీ ఎదురుకావడం ఖాయంగా కనిపిస్తోంది.

botsa satyanarayana
చీపురుపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి బొత్స సత్యనారాయణ.. విజయం సాధించాలన్న ధీమాతో ఉన్న టిడిపి ఇంఛార్జి కిమిడి నాగార్జున
చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలో వైసీపీ పర్ఫెక్ట్ స్ర్టాంగ్‌గా కనిపిస్తోంది ఇక్కడే ! రాజకీయ వ్యవహారాలన్నీ బొత్స మేనల్లుడు చిన్న శ్రీనునే చూస్తుంటారు. నియోజకవవర్గాన్ని అభివృద్ధి చేస్తూ.. నేతల మధ్య విభేదాలు, వివాదాలు లేకుండా.. మంత్రి బొత్స, చిన్న శ్రీను జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తూ…. స్థానిక సమస్యలను పరిష్కరిస్తూ.. పార్టీని బలోపేతం చేస్తున్నారు. బొత్సకు మళ్లీ టికెట్ కన్ఫార్మ్ అయినా.. ఒకవేళ ఆయన విజయనగరం పార్లమెంట్‌కు వెళ్తే అల్లుడు శ్రీను టికెట్ రేసులో నిలబడే చాన్స్ ఉంది. ఇక టీడీపీ ఇంచార్జి కిమిడి నాగార్జున.. ఎట్టి పరిస్థితుల్లోనూ విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్నారు. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ.. పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

murali, jogulu
రాజాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కంబాల జోగులు.. టిడీపీలో కొండ్రు మురళి, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి మధ్య వర్గపోరు
ఎస్సీ రిజర్వ్‌డ్ అయిన రాజాం నియోజకవర్గంలో.. కంబాల జోగులు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సౌమ్యుడుగా ఆయనకు పేరు ఉన్నా.. జనాల మనసులు గెలవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్. నియోజకవర్గ అభివృద్ధి విషయంలో.. జోగులపై రకరకాల విమర్శలు వ్యక్తం అవుతున్నాయ్. వచ్చే ఎన్నికల్లోనూ కంబాలకే మళ్లీ టికెట్ ఖాయం అనే ప్రచారం జరుగుతుండగా.. ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ కనుసన్నల్లోనే నియోజకవర్గ పాలన నడుస్తుందనే ప్రచారం ఉంది. ఇది కంబాలకు మైనస్‌గా మారే చాన్స్ ఉంది. ఇక్కడ టీడీపీ పవనాలు బలంగా వీస్తున్నాయ్. దీంతో వైసీపీ గెలుపు అనుకున్నంత ఈజీ అయ్యే అవకాశం లేదు. రాజాం టీడీపీ ఇంచార్జిగా కొండ్రు మురళి కొనసాగుతున్నారు. ఎప్పుడూ జనాల మధ్యే ఉంటూ.. పార్టీని బలోపేతం చేయడంలో అధిష్టానం గుర్తింపు పొందారు. కొండ్రు మురళి, మాజీ స్పీకర్ ప్రతిభాభారతి మధ్య వర్గపోరు.. టీడీపీని టెన్షన్ పెడుతోంది. ఈ మధ్య చంద్రబాబు పర్యటనలోనూ ఈ విభేదాలు బహిర్గతం అయ్యాయ్. కొండ్రు మురళితో పాటు.. ప్రతిభాభారతి కూతురు గ్రీష్మ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. టీడీపీలో విభేదాలు ప్లస్ అవుతాయని వైసీపీ లెక్కలేస్తుంటే.. అధికార పార్టీపై వ్యతిరేకత తమను గెలిపిస్తుందని సైకిల్ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.

venkatarao,kiran
ఎచ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా గొర్లె కిరణ్ కుమార్.. కిరణ్ మీద వ్యతిరేక వర్గం తిరుగుబాటు బావుటా..టీడీపీ నుంచి బరిలో కళా వెంకట్రావు
విజయనగరం పార్లమెంట్ పరిధిలోని మరో కీలక నియోజకవర్గం ఎచ్చర్ల ! ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ అసెంబ్లీ స్థానం.. విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉంటుంది.
గొర్లె కిరణ్ కుమార్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ వైసీపీ రెండువర్గాలుగా విడిపోయింది. కిరణ్ మీద వ్యతిరేక వర్గం తిరుగుబాటు బావుటా ఎగురవేసింది. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కిరణ్‌కు మళ్లీ టికెట్ వస్తుందా రాదా అనే అనుమానాలు వినిపిస్తున్నాయ్. ఐతే విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.. ఎచ్చర్ల నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీ నుంచి కళా వెంకట్‌రావు పోటీకి దిగబోతున్నారు. ఆయనను విజయనగరం ఎంపీగా పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతున్నా.. దీనిపై ఆయన పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఒకవేళ ఆయన పార్లమెంట్‌కు వెళ్తే.. కళావెంకట్రావు కుటుంబం నుంచి ఒకరికి.. టీడీపీ టికెట్ దక్కే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎచ్చర్లలోనూ టీడీపీని వర్గవిభేదాలు టెన్షన్ పెడుతున్నాయ్. నలుగురు కీలక నేతలు.. కళావెంకట్రావు మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో ప్రభంజనం క్రియేట్ చేసిన వైసీపీ.. ఈసారి కూడా క్లీన్‌స్వీప్ మీద కన్నేసింది. ఐతే అది అనుకున్నంత ఈజీగా కనిపించడం లేదు. అంతర్గత కుమ్ములాటలు, నాయకుల్లో సమన్వయం లేకపోవడం.. వర్గవిభేధాలు ఫ్యాన్ పార్టీని టెన్షన్ పెడుతుంటే.. గత ఎన్నికలతో పోలిస్తే బలపరంగా పర్వాలేదనిపిస్తున్నా.. టీడీపీలోనూ ఇలాంటి గందరగోళ పరిస్థితులే కనిపిస్తున్నాయ్. దీంతో 2024లో విజయనగరం పార్లమెంట్ పరిధిలో రాజకీయం రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.