Rajampet Lok Sabha Constituency : రసవత్తరంగా రాజంపేట పార్లమెంట్ రాజకీయం….ట్రయాంగిల్ ఫైట్ తప్పదా ?
తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తమ్ముడు.. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ఇక్కడ మిశ్రమ స్పందన ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడిగా గుర్తింపు తప్ప.... ద్వారకనాథ్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలాంటి పేరు సంపాదించుకోలేకపోయారనే అభిప్రాయం ఉంది.

rajampet
Rajampet Lok Sabha Constituency : రాజంపేట రాజకీయాలను అంచనా వేయడం అంత వీజీ కాదు. అందుకే ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా కనిపిస్తుంటాయ్ ఇక్కడి రాజకీయాలు ! రాజంపేట లోక్‌సభతో పాటు… పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీలను క్లీన్‌స్వీప్ చేసిన వైసీపీ.. ఇప్పుడు మరోసారి అదే టార్గెట్‌గా అడుగులు వేస్తోంది. ఐతే ఫ్యాన్ పార్టీకి దీటుగా టీడీపీ వ్యూహాలు రచిస్తోంది. జగన్‌కు ఝలక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తోంది. ఇక పార్లమెంట్‌లో పాగా వేసేందుకు బీజేపీ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ముక్కోణ యుద్ధం ఖాయంగా కనిపిస్తోంది. ఎంపీ సంగతి సరే.. మరి అసెంబ్లీలో సీన్ ఏంటి.. పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రభావం ఎంతలా ఉండబోతోంది.. ఏ అసెంబ్లీ స్థానాలపై టీడీపీ భారీ ఆశలు పెట్టుకుంది. జనసేన ఎక్కడెక్కడి నుంచి బరిలో దిగబోతోంది.. వైసీపీలో సిట్టింగ్‌లందరికీ మళ్లీ టికెట్ ఖాయమా.. టీడీపీ నుంచి బరిలో నిలవబోయేది ఎవరు..

Midhun Reddy
వైసీపీకి చెక్ పెట్టడంలో టీడీపీ సక్సెస్ అవుతుందా ? రాజంపేట సిట్టింగ్ ఎంపీగా మిథున్ రెడ్డి మరోసారి బరిలో
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం 1957లో ఏర్పాటు అయింది. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉండే రాజంపేట.. వైసీపీ ఆవిర్భావం తర్వాత.. ఫ్యాన్ పార్టీ సొంతం అయింది. రాజంపేట పార్లమెంట్‌కు ఓ ప్రత్యేకతను ఉంది. ఇక్కడ అత్యధికంగా కాపు సామాజికవర్గానికి చెందిన వారే ఎంపీగా గెలుస్తూ వచ్చారు. ప్రతీ ఎన్నికల్లోనూ ఇక్కడ నువ్వా నేనా అన్నట్లుగా పోటీ కనిపిస్తుంది. ఈసారి మాత్రం అంతకుమించి అనిపించేలా ఉంది సీన్ ! గెలుపే లక్షఅయంగా రాజకీయ పార్టీలు… తమ వ్యూహాలను, అభ్యర్థులను ఖరారు చేస్తున్నాయ్. రాజంపేట లోక్‌సభ స్థానంలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున మళ్లీ ఆయనే బరిలో నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్. వైఎస్ కుటుంబానికి పెట్టని కోటలాంటి ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. దీంతోప్రతిపక్ష టీడీపీతో పాటు బీజేపీ అభ్యర్థి ఎంపిక నుంచి.. ఎన్నికల వ్యూహాల వరకు ఆచీతూచీ అడుగులు వేస్తున్నాయ్.

ganta narahari
టీడీపీ తరఫున భారీగా ఆశావహులు…వ్యాపారవేత్త గంటా నరహరి పేరు ఖరారు చేసే అవకాశం
రాజంపేట నుంచి పోటీ చేసేందుకు టీడీపీ తరఫున భారీగా ఆశావహుల లిస్టు కనిపిస్తోంది. వ్యాపారవేత్త గంటా నరహరి పేరు ప్రస్తుతం ఖరారయినట్లు వినిపిస్తున్నా.. రోజురోజుకు టికెట్ మీద ఆశలు పెట్టుకునే వారి సంఖ్య సైకిల్ పార్టీలో పెరుగుతూనే ఉంది. రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి ఎమ్మెల్యేగా పనిచేసిన సుగవాసి పాలకొండ్రాయుడు కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యం కూడా ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈయనతో పాటు లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి పేరును కూడా టీడీపీ పరిశీలిస్తుందనే టాక్ వినిపిస్తోంది. వైసీపీని బలంగా ఢీకొట్టడమే లక్ష్యంగా తమ అభ్యర్థిని టీడీపీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయ్. బీజేపీ నుంచి మాజీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సాయిప్రతాప్ అల్లుడు సాయి లోకేష్ బరిలో నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయ్. లోక్‌సభ పరిధిలో తన సామాజికవర్గ ఓటర్లు భారీగా ఉండడంతో పాటు.. మామకు ఉన్న మంచిపేరు కలిసి వస్తుందని సాయి లోకేశ్ అంచనా వేస్తున్నారు. పార్టీలన్నీ ఎవరికి వారు వ్యూహాలు రచిస్తుండడంతో.. ఈసారి రాజంపేట పోరు మరింత ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
రాజంపేట పార్లమెంట్ పరిధిలో రాజంపేట అసెంబ్లీతో పాటు.. రైల్వేకోడురు, రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు సెగ్మెంట్‌లు ఉన్నాయ్. ఇందులో రైల్వేకోడూరు ఎస్సీ రిజర్వ్‌డ్ నియోజకవర్గం కాగా.. మిగిలిన ఆరు కూడా జనరల్ స్థానాలు.

mallikarjun reddy
రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యేగా మేడా మల్లిఖార్జున రెడ్డి వివాదరహితుడిగా పేరు.. పొత్తులో భాగంగా జనసేనకు సీటు కేటాయించే చాన్స్
రాజంపేట అసెంబ్లీలో మేడా మల్లిఖార్జున రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరు ఉన్న మేడా.. ఎమ్మెల్యేగా తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. రాజంపేట నుంచి పోటీకి వైసీపీలో టికెట్ ఫైట్ భారీగానే కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మేడాతో పాటు.. ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్ రెడ్డి.. టికెట్ సాధించేందుకు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దీంతో టికెట్ ఎవరికి దక్కుతుందన్న ఆసక్తి ప్రతీ ఒక్కరిలో కనిపిస్తున్నా.. ఈసారి కూడా మేడానే మళ్లీ బరిలో దిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నది చాలామంది అభిప్రాయం. టీడీపీ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడుతో పాటు రాజు విద్యాసంస్థల అధినేత జగన్మోహన్ రాజు.. టికెట్ ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఇద్దరు నేతలు చురుకుగా పాల్గొంటూ.. జనాల మనసుగెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఇద్దరిలో టికెట్ ఎవరిని వరిస్తుందన్నది ఇంట్రస్టింగ్‌గా మారింది. ఇక పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరుగుతుండడంతో… గ్లాస్ పార్టీ నుంచి కూడా పలువురు నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. జనసేన ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీకోసం కష్టపడుతున్న మలిశెట్టి వెంకటరమణతో పాటు.. ప్రముఖ పారిశ్రామిక వేత్త అతికారి వెంకటయ్య కుమారుడు దినేష్ పేర్లు టికెట్ రేసులో వినిపిస్తున్నాయ్.

srikanth reddy, ramesh reddy
రాయచోటి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి మరోసారి బరిలో… టిడిపి నుండి బరిలో రమేష్ రెడ్డి
రాజంపేట పార్లమెంట్ పరిధిలో మరో కీలక నియోజకవర్గం రాయచోటి. ఇది వైసీపీకి కంచుకోట. గడికోట శ్రీకాంత్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా నాలుగుసార్లు ఆయన ఇక్కడి నుంచి విజయం సాధించారు. 2009 తర్వాత జరిగిన ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రీకాంత్‌నే విజయం వరించింది. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన శ్రీకాంత్ రెడ్డి.. 2011లో వైసీపీ ఏర్పాటుతో ఆ పార్టీలో చేరి విజయం సాధించారు. 2024లోనూ వైసీపీ నుంచి మరోసారి శ్రీకాంత్ రెడ్డి బరిలోకి దిగడం ఖాయం. రాయచోటిలో టీడీపీని వర్గవిభేదాలు వెంటాడుతున్నాయ్. టీడీపీ ఇక్కడ చివరిసారిగా గెలిచింది 2004లోనే ! 2004లో సుగువాసి పాలకొండ్రాయుడు ఇక్కడ టీడీపీ తరఫున విజయం సాధించారు. 2009నుంచి రమేష్ రెడ్డి ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. ఐతే సైకిల్ పార్టీలో గ్రూప్ వార్ పీక్స్‌కు చేరింది. రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుగువాసి పాలకొండ్రాయుడు కుమారుడు టీటీడీ బోర్డు మాజీ సభ్యులు సుగువాసి ప్రసాద్‌బాబుకు సఖ్యత కుదరడం లేదు. దీంతో ఇక్కడ టీడీపీకి గడ్డు పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇద్దరు నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. 2024 ఎన్నికల్లో ప్రసాద్‌బాబుకు రాయచోటి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి.. రమేష్‌రెడ్డిని ఎంపీగా పోటీ చేయించాలన్న ఆలోచనలో టీడీపీ ఉన్నట్లు కనిపిస్తోంది. లేదంటే ప్రసాదబాబును ఎంపీగాను… రమేష్ రెడ్డిని ఎమ్మెల్యేగానూ అవకాశం ఇచ్చి.. ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు టీడీపీ పెద్దలు పావులు కదుపుతున్నారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలో బలిజ ఓట్లు ఎక్కువ. దీంతో ప్రసాద బాబును ఎంపీగా దింపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయ్.

korumutla srinivas,prasad
రైల్వే కోడూరు లో మరోసారి బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొరముట్ల శ్రీనివాసులు.. పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేనకు కేటాయించే ఛాన్స్
రైల్వేకోడూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్‌డ్. ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో.. ఇప్పుడు వైసీపీ పాగా వేసింది. కొరముట్ల శ్రీనివాసులు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచిన కొరముట్ల.. 2014, 2019లో వైసీపీ తరఫున విజయం సాధించారు. 2024లోనూ కొరకుట్ల శ్రీనివాసులకు బెర్త్ దాదాలు కన్ఫార్మ్. గత 20 ఏళ్లుగా ఇక్కడ టీడీపీ విజయం సాధించింది లేదు. 2019ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన పంతగాని ప్రసాద్.. ఈసారి కూడా టికెట్ తనకే దక్కుతుందన్న ధీమాతో కనిపిస్తున్నారు. రకరకాల కార్యక్రమాలతో జనాల్లోకి వెళ్తూ.. ఓటర్ల మనసు గెలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంతగాని ప్రసాద్‌తో పాటు.. శిరీష ఇక్కడ టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. పొత్తు కుదిరితే ఈ స్థానాన్ని జనసేన డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయ్. ఈ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓటర్లు ఎక్కువ. ఐతే జనసేనకు టికెట్ దక్కితే.. ఆ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దిగుతారన్న దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
READ ALSO : Jana Sena Avirbhava Sabha : మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభ.. తొలిసారి వారాహి వాహనంలో రానున్న పవన్ కల్యాణ్

korumutla srinivas,prasad
పుంగనూరుపై మంత్రి పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి ప్రత్యేక దృష్టి.. టిడిపి నుండి బరిలో చల్లా బాబు
పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. పుంగనూరు ఒకరంగా పెద్దిరెడ్డికి అడ్డాగా మారింది. ఇక్కడ ఆయన మాటే శాసనం. బయట ఆయనపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు ఉన్నా… నియోజకవర్గంపై పెద్దిరెడ్డి ఎప్పుడూ ప్రత్యేక దృష్టి సారిస్తారు. 9 వందల గ్రామాలను మంత్రి పెద్దిరెడ్డి సందర్శించారంటే అర్థం చేసుకోవచ్చు.. ఆయన ఎలాంటి దృష్టిసారిస్తారు అని ! మరోసారి పుంగనూరు బరిలో పెద్దిరెడ్డి నిలవడం ఖాయం. ఆయనను ఢీకొట్టడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. పుంగనూరులో చల్లా బాబు టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. చల్లా బాబుది పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. ఆయన తండ్రి చల్లా ప్రభాకర్ రెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. 1985 ఎన్నికల్లో పీలేరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించిన చరిత్ర చల్లా ప్రభాకర్ రెడ్డిది. ఇప్పుడు చల్లా ప్రభాకర్ రెడ్డి కుమారుడు చల్లా బాబు.. పెద్దిరెడ్డిని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్నారు. టీడీపీ తరఫున ఆయనకే టికెట్ దాదాపు ఖాయం. ఇక అటు మరో నేత రామచంద్ర యాదవ్ పేరు నియోజకవర్గ రాజకీయాల్లో పదేపదే వినిపిస్తోంది. 2019లో జనసేన తరఫున పోటీ చేసిన రామచంద్ర యాదవ్.. 16వేలకు పైగా ఓట్లు సాధించారు. రామచంద్ర యాదవ్ ఇంటిపై ఈ మధ్య జరిగిన దాడి.. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. తనకున్న ఢిల్లీ పరిచయాలతో వై ప్లస్ భద్రత సాధించుకున్నారు రామచంద్ర. ఐతే జనసేనకు దూరంగా ఉంటున్న ఆయన.. టీడీపీ తరఫున బరిలో నిలిచి పెద్దిరెడ్డిని ఢీకొట్టాలని భావిస్తున్నారు. దీంతో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది.

dwarakanadh reddy
తంబళ్లపల్లి ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి పనితీరుపై ఇక్కడ మిశ్రమ స్పందన…నియోజకవర్గానికి దూరంగా టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి శంకర్ యాదవ్
తంబళ్లపల్లిలో పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి తమ్ముడు.. పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యే పనితీరుపై ఇక్కడ మిశ్రమ స్పందన ఉంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడిగా గుర్తింపు తప్ప…. ద్వారకనాథ్ రెడ్డి వ్యక్తిగతంగా ఎలాంటి పేరు సంపాదించుకోలేకపోయారనే అభిప్రాయం ఉంది. ఐతే మరోసారి వైసీపీ తరఫున ఆయనకే టికెట్ దక్కే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయ్. మాజీ ఎమ్మెల్యే శంకర్‌యాదవ్ టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన శంకర్ యాదవ్.. అధికారంలో ఉన్న ఐదేళ్లు నియోజకవర్గాన్ని చిన్న చూపు చూశారనే విమర్శలు ఉన్నాయ్. బెంగళూరుకి ఎక్కువ సమయం పరిమితం అవుతారన్నది ఆయనపై ఉన్న ప్రధాన ఆరోపణ. 2019ఎన్నికల్లో ఓటమి తర్వాత కూడా శంకర్ యాదవ్ చాలారోజులు నియోజకవర్గం వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో ఇంచార్జిని మారుస్తారని టీడీపీలో పెద్దఎత్తున ప్రచారం జరిగింది. ఐతే అనూహ్యంగా మళ్లీ శంకర్‌యాదవ్‌నే ఇంచార్జిగా కొనసాగిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. తంబళ్లపల్లి టీడీపీలో గ్రూప్ వార్ కూడా ఎక్కువే ! శంకర్‌యాదవ్‌కు వ్యతిరేకంగా.. టీడీపీలో ఓ వర్గం గొడవలకు దిగిన సందర్భాలు కూడా ఉన్నాయ్. ప్రస్తుతం శంకర్ యాదవ్ ఇంచార్జగా కొనసాగుతున్నా.. చివరి నిమిషంలో అభ్యర్థి విషయంలో ఇక్కడ మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదనే ప్రచారం కూడా జరుగుతోంది.

ramachandrareddy, kishorekumar reddy
పీలేరు సిట్టింగ్ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఈసారి టిక్కెట్ దక్కేనా? వచ్చే ఎన్నికల్లో టిడిపి నుండి బరిలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి
పీలేరులో చింతల రాంచంద్రారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా రెండుసార్లు విజయం సాధించిన రాంచంద్రారెడ్డి.. హ్యాట్రిక్ విజయం దిశగా అడుగులు వేస్తున్నారు. నియోజకవర్గ జనాలతో మంచి సంబంధాలే ఉన్నా.. పెద్దిరెడ్డి కుటుంబంతో చింతల అంటీ ముట్టనట్లుగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈసారి చింతలకు పీలేరు టికెట్ దక్కే అవకాశాలు లేవని.. పెద్దిరెడ్డి కుటుంబం నుంచే ఎవరో ఒకరు ఇక్కడ బరిలో ఉంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఐతే ఇవేవీ పట్టించుకోకుండా నియోజకవర్గంలో.. తన పని తాను చేసుకుపోతున్నారు చింతల. పీలేరు నుంచి మళ్లీ బరిలో నిలిచేది తానే అనే ధీమాతో కనిపిస్తున్నారు. ఇక్కడ టీడీపీ ఇంచార్జిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పీలేరు నుంచి ఆయనే బరిలో దిగడం దాదాపు ఖాయం. 2014 ఎన్నికల్లో తన అన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి… 2019లో టీడీపీ నుంచి పోటీ చేసిన కిషోర్ కుమార్ రెడ్డి.. ఓటమి చవిచూశారు. ఐతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తన విజయాన్ని ఎవరూ ఆపలేరని ఆయన ధీమాగా కనిపిస్తున్నారు. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీల్లో.. పీలేరు ఫైట్ ఆసక్తికరంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Dommalapati Ramesh, Nawaz Basha
మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే నవాజ్ భాషాపై వైసీపీ క్యాడర్ లో అసంతృప్తి.. టీడీపీ ఇంచార్జిగా ఉన్న దొమ్మలపాటి రమేష్‌కు టిక్కెట్ దక్కే అవకాశం
మదనపల్లిలో నవాజ్ భాషా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి ఆశీస్సులతో టికెట్ దక్కించుకున్న నవాజ్.. మంచి విజయం సాధించారు. గత నాలుగేళ్లుగా నియోజకవర్గంపై ఎమ్మెల్యే నవాజ్ భాషా.. పెద్దగా తన మార్క్ చూపించలేదనే విమర్శలు ఉన్నాయ్. పైగా పెద్దిరెడ్డి కుటుంబంతో ఆయనకు పొసగడం లేదన్న ప్రచారం నియోజకవర్గంలో జోరుగా సాగుతోంది. పార్టీ కేడర్ కూడా నవాజ్ తీరుపై సానుకూలంగా లేరని తెలుస్తోంది. దీంతో ఈసారి అభ్యర్థిని మార్చే ఆలోచనలో వైసీపీ పెద్దలు ఉన్నారనే చర్చ నడుస్తోంది. మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి టికెట్ రేసులో ముందు ఉన్నారు. టీడీపీలో టికెట్ ఫైట్ భారీగా ఉంది. నియోజకవర్గ ఇంచార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్‌తో పాటు.. మాజీ ఎమ్మెల్యే షానవాజ్ భాషా కూడా టీడీపీ నుంచి పోటీకి సై అంటున్నారు. ఇక్కడ ఎవరికి టికెట్ ఇచ్చినా.. మిగిలినవారు కలిసికట్టుగా పనిచేస్తారనే నమ్మకం లేదు. దీంతో మదనపల్లి విషయంలో చంద్రబాబు పెద్దగా పట్టింపులకు పోవడం లేదు. జనసేనతో పొత్తు కుదిరితే.. ఈ ప్రాంతాన్ని జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయ్. బలిజ సామాజికవర్గం ఇక్కడ బలంగా ఉంది. జనసేన పార్టీకి ఇక్కడ గంగారపు రాందాస్ చౌదరి అనే అభ్యర్థి సిద్ధంగా ఉన్నారు. గత ఎన్నికల్లోనూ జనసేన తరఫున రాందాస్ చౌదరి భార్య స్వాతి పోటీ చేశారు. 15వేల ఓట్లు సాధించారు. పొత్తుల్లో భాగంగా ఈ స్థానం జనసేనకు దక్కితే.. రాందాస్ చౌదరి లేదా ఆయన భార్య స్వాతి మరోసారి పోటీ చేసే అవకాశం ఉంది. టీడీపీ, జనసేన గట్టిగా నిలిస్తే.. వైసీపీకి గట్టి పోటీ ఖాయం.
ఆశావహులు ఒకవైపు.. నేతల ఆశయాలు మరోవైపు.. ఈ మధ్యలో పార్టీల అంచనాలు ఇంకోవైపు.. దీంతో రాజంపేట ఫైట్ రసవత్తరంగా మారింది. ఒకటిరెండు నియోజకవర్గాల సంగతి పక్కనపెడితే.. మిగతా స్థానాల్లో టఫ్ ఫైట్ కనిపించడం ఖాయంగా కనిపిస్తోంది. రాజంపేటతోపాటు అన్ని అసెంబ్లీల్లో విజయం సాధించి మరోసారి క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా వైసీపీ ముందుకు సాగుతుంటే.. ఫ్యాన్ పార్టీ స్పీడ్‌కు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రేకులు వేయాలని టీడీపీ డిసైడ్ అయింది. ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే రాజకీయం రకరకాల మలుపులు తిరుగుతుండగా.. రాజంపేట రాజకీయం రసవత్తరంగా మారింది.