Volunteer system: వలంటీర్లకు స్వస్తి చెబుతున్న ప్రభుత్వం?

ఇక మీ సేవలు చాలు అంటూ సెలవు తీసుకోమని చెబుతోందా? వలంటీర్ల విధుల్లో కీలకమైన..

ఒకటో తారీకు వచ్చేసింది. పింఛన్ల పంపిణీ వేళయింది.. ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా పింఛన్‌ తెచ్చే వలంటీర్లు మాత్రం ఈ సారి కనిపించరు. లబ్ధిదారుల ఇళ్ల వద్దనే పింఛన్‌ పంపిణీ చేస్తామని చెబుతున్న ప్రభుత్వం… వలంటీర్లను మాత్రం ఇన్వాల్వ్‌ చేయొద్దని ఖరాకండీగా చెప్పేసింది. దీంతో ఐదేళ్లుగా ఒకటో తేదీ ఉదయాన్నే కనిపించే వలంటీర్లు… ఇక చిత్తగించవల్సిందేనా? సంక్షేమ సారథులు అంటూ గత ప్రభుత్వం కీర్తించిన వలంటీర్ల తాజా పరిస్థితి ఏంటి?

ఠంచనుగా పింఛన్‌ అందించే వలంటీర్లకు కొత్త ప్రభుత్వం స్వస్థి చెప్పేసినట్లేనా.. ఇక మీ సేవలు చాలు అంటూ సెలవు తీసుకోమని చెబుతోందా? వలంటీర్ల విధుల్లో కీలకమైన పింఛన్ల పంపిణీకి దూరంగా పెట్టడం ద్వారా చంద్రబాబు సర్కార్ ఇస్తున్న సంకేతాలేంటి? ప్రభుత్వ వేతనం తీసుకుని పనిచేసినా, వైసీపీకి అనుబంధంగా వ్యవహరించారనే ఆరోపణలే వలంటీర్ల కొనసాగింపునకు ప్రధాన ప్రతిబంధకంగా కనిపిస్తోంది. 2019లో జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థ అంటూ ప్రభుత్వానికి సమాంతరంగా ఓ వ్యవస్థను సృష్టించారు.

సంక్షేమ పథకాల అమలుకు వలంటీర్లు, సచివాలయాలనే ఎక్కువగా వాడుకున్నారు. ప్రజా ప్రతినిధులతో కూడా సంబంధం లేకుండా, వలంటీర్లు, సచివాలయాల సిబ్బందిపైనే ఎక్కువగా ఆధారపడ్డారు. దీంతో గత ప్రభుత్వంలో వలంటీర్లకు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. ఐదు వేల రూపాయల గౌరవ వేతనంతోపాటు అలవెన్సు కింద మరో రెండు వందల రూపాయలను ప్రభుత్వం వలంటీర్లకు చెల్లించేది. ఐతే ఎన్నికల ముందు వలంటీర్ల వ్యవస్థపై కోర్టుకు వెళ్లిన టీడీపీ…. ఎన్నికల ప్రక్రియలోనూ, పింఛన్ల పంపిణీలోనూ వలంటీర్లు లేకుండా కోర్టు ఆదేశాలు పొందింది.

విమర్శలు ఎదుర్కొన్న వలంటీర్లు
ఐదేళ్లుగా గ్రామాల్లో అన్నీతామై అన్నట్లు వ్యవహరించిన వలంటీర్లకు కోర్టు నిర్ణయం షాక్‌ ఇచ్చింది. ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నా, వైసీపీకి అనుబంధంగా ఉంటున్నారనే విమర్శలు ఎదుర్కొన్న వలంటీర్లు… కొన్ని చోట్ల వివాదాలకు కారణమయ్యారు. మరికొందరు కోర్టు ఉత్తర్వులు, అధికారుల ఆదేశాలను ధిక్కరించి బహిరంగంగా గత ప్రభుత్వ పెద్దలతో తిరిగారు. ఇదే సమయంలో కోర్టు ఉత్తర్వులు వైసీపీని నిరాశకు గురిచేశాయి.

సంక్షేమ పథకాలతో ప్రతి ఓటరుతో పరిచయాలు పెంచుకున్న వలంటీర్ల ద్వారా ఓట్లు వేయించుకోవాలని ఆ పార్టీ వ్యూహం దెబ్బతినడంతో వ్యూహం మార్చింది. వలంటీర్లతో రాజీనామాలు చేయించి పార్టీ పనులకు వాడుకోవాలని నిర్ణయించింది. కొందరు స్వచ్ఛందంగా.. మరికొందరు బలవంతంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం రాష్ట్రంలో లక్షా 50 వేల మంది వలంటీర్లు మాత్రమే మిగిలారు. వైసీపీ ఒత్తిళ్ల వల్లో సూచనల వల్లో సుమారు లక్షా 8 వేల మంది రాజీనామాలు చేసేశారు.

ఇక కొందరు తప్పుకోవడంతో ఉన్నవారిని ఎలా తప్పించాలనేది పరిశీలిస్తోంది ప్రభుత్వం. ఈ కారణంతోనే ఈ నెల పింఛన్ల విధుల నుంచి తప్పించింది. సచివాలయాల్లో సరిపడా సిబ్బంది ఉండటంతో.. వారి ద్వారానే లబ్ధిదారుల ఇళ్లకు పింఛన్‌ డబ్బులు పంపించాలని భావిస్తోంది. దీంతో వలంటీర్ల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చిన తర్వాత వలంటీర్ల ద్వారా పింఛన్‌ పంపిణీ నిలిపివేయాలని కోర్టు ఉత్తర్వులిచ్చింది.

విధులు నిర్వహించే చాన్స్‌ ఉన్నా..
ఎన్నికల ప్రక్రియ ముగియడంతో వారు యథావిధిగా విధులు నిర్వహించే చాన్స్‌ ఉన్నా, కొత్త ప్రభుత్వం మాత్రం వారి విషయంలో ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో రాజీనామా చేసిన వలంటీర్లు తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని వైసీపీ నేతలపై పోలీసుస్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. కానీ, ప్రభుత్వం వలంటీర్లపై సానుకూల దృక్పథంతో లేదనే అంటున్నారు. మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడుతోపాటు సంక్షేమ, గ్రామ సచివాలయాల శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామిని కలిసిన వలంటీర్లకు ఎలాంటి హామీ ఇవ్వలేదు.

ప్రభుత్వ పెద్దల అడుగులు గమనిస్తే… వలంటీర్లకు ఉద్వాసన ఖాయమన్న అభిప్రాయమే వ్యక్తమవుతోంది. మెజార్టీ టీడీపీ శ్రేణులు సైతం ఇప్పుడున్న వలంటీర్లను తొలగించాలని పట్టుబడుతున్నారంటున్నారు. ఐతే వలంటీర్లుగా నియమితులైన వారు అందరూ వైసీపీ సానుభూతిపరులేనా? తటస్థులు లేరా? అన్నది కూడా ప్రభుత్వం తెలుసుకుంటోందంటున్నారు.

ఎన్నికల సమయంలో వలంటీర్లను తొలగించమని, తాము అధికారంలోకి వస్తే వలంటీర్ల వేతనాన్ని పది వేల రూపాయలకు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు వలంటీర్లను తొలగిస్తే ఇచ్చిన మాటను తప్పినట్లు అవుతుందనే ఆలోచనతో ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. మొత్తం వలంటీర్లను తొలగించడమా? సంస్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నవారిని తీసుకోవడమా? అనే విషయంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోందంటున్నారు. ఏదిఏమైనా సరే మెజార్టీ వలంటీర్లపై వేటు ఖాయమంటున్నారు. అందుకే జూలైలో పింఛన్ల పంపిణీకి వలంటీర్లను వాడుకోదల్చుకోలేదని చెబుతున్నారు.

అమెరికాలో బిజినెస్‌ యోచనలో వల్లభనేని వంశీ!

ట్రెండింగ్ వార్తలు