Rain Alert : మళ్లీ కుమ్ముడే.. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. Rain Alert

Low Pressure : తెలుగు రాష్ట్రాలకు మరో 24 గంటలు వర్షాలు తప్పవని హెచ్చరించింది వాతావరణ శాఖ. ఒడిశా తీర ప్రాంతాన్ని ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటల్లో తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయంది.

Also Read..Kadem Project: టెన్షన్ పెడుతున్న కడెం ప్రాజెక్టు.. గేట్లు తెరుచుకోకపోవడంతో ఆందోళన

సోమవారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణ, ఏపీ, ఒడిశా, మధ్యప్రదేశ్, కేరళ, కర్నాటకలలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. 13 జిల్లాలకు ఆరెంజ్, 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాలతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మత్స్యకారులు మరో 5 రోజుల పాటు చేపలవేటకు వెళ్లొద్దని తుపాను హెచ్చరికల కేంద్రం చెప్పింది. కుండపోత వానల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. వృద్ధులు, చిన్నపిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

Also Read..Telangana Politics: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల నుంచి వానలు దంచికొడుతున్నాయి. నాలుగో రోజు కాస్త విరామం ఇచ్చాయి. శుక్రవారం కొన్ని జిల్లాల్లో భారీగా, మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వానలు పడ్డాయి. రాష్ట్రంపై నైరుతి రుతుపవనాలు ఉధృతంగా ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో హైదరాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానల నేపథ్యంలో జీహెచ్ఎంసీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది.

ట్రెండింగ్ వార్తలు