Weather Updates: ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన తీవ్ర వాయుగుండం ఎట్టకేలకు తీరం దాటింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ తీవ్ర వాయుగుండం.. ఒడిశా రాష్ట్రం గోపాల్ పూర్ వద్ద తీరాన్ని తాకింది. ఉత్తర వాయవ్య దిశగా పయనిస్తోంది. క్రమంగా బలహీన పడనుంది. తీవ్ర వాయుగుండం తీరం దాటినప్పటికీ.. దాని ప్రభావం రేపు కూడా కొనసాగనుంది. ఉత్తరాంధ్రపై ఎఫెక్ట్ చూపే అవకాశం ఉంది.
రానున్న 24 గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఆకస్మిక వరదలు సంభవిస్తాయని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు.
తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. అటు ఈదురు గాలులు సైతం బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా ఆకస్మిక వరదల ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ వర్షాలు, వరద ముప్పుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఉత్తరాంధ్ర జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాలన్నారు. మంత్రులు, విపత్తు నిర్వహణ బృందాలు పరిస్థితులను పరిశీలిస్తూ ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. విశాఖలో ఈదురుగాలుల బీభ్సతంతో పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈదురుగాలుల ధాటికి జీవీఎంసీ కార్యాలయం సమీపంలో భారీ వృక్షం నేలకొరిగింది. పార్కింగ్ లో ఉన్న లారీ, కారుపై చెట్టు పడింది. అక్కయ్యపాలెం పరిధిలోని శ్రీనివాస్ నగర్ లో కారుపై రావి చెట్టు కూలింది. ఈ ఘటనలో ఓ ఇంటి గోడ పూర్తిగా కూలిపోయింది.
51వ వార్డు కళింగనగర్ మెయిన్ రోడ్ పై పార్క్ చేసిన చెట్టు కూలింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖ కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
Also Read: విశాఖలో గాలివాన బీభత్సం.. భయపెడుతున్న భీకర గాలులు.. నేలకొరిగిన భారీ వృక్షాలు..