ఏపీ పాలిటిక్స్ మరోసారి హీటెక్కుతున్నాయి. వైసీపీ హయాంలో మద్యం స్కాం జరిగిందంటూ కూటమి సర్కార్ చేస్తున్న ఆరోపణలతో ఓవైపు మాట యుద్ధం నడుస్తూనే ఉంది. ఇంతలోనే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. బెయిల్ కోసం ఆయన హైకోర్టుకు వెళ్లడం..కోర్టు అందుకు నిరాకరించడంతో..మిథున్ రెడ్డిని ఇవాళో రేపో అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది.
ఇదంతా ఇలా జరుగుతుండగానే టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పార్లమెంట్ వేదికగా లిక్కర్ దందాపై ఆరోపణలు చేయడంతో వైసీపీ ఉలిక్కిపడింది. జగన్‌ను అరెస్ట్ చేసి ఆయన ఫాలోయింగ్‌కు తగ్గించే కుట్ర జరుగుతోందంటూ ఫ్యాన్ పార్టీ లీడర్లు అటాకింగ్ స్టార్ట్ చేశారు. ఇంతలోనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా కలిసి ఫిర్యాదు చేశారు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు. దీంతో వైసీపీ హయాంలో ఇంప్లిమెంట్ అయిన లిక్కర్ పాలసీ వ్యవహారంపై దర్యాప్తునకు ఆదేశిస్తారన్న ప్రచారం జరుగుతోంది.
లిక్కర్ కేసు విషయంలో కూటమి ప్రభుత్వం..ఢిల్లీ నుంచి నరుక్కొస్తోందన్న టాక్ వినిపిస్తోంది. రాష్ట్రంలో సిట్, సీఐడీ, ఏసీబీతో పాటు ఏ సంస్థతో విచారణ చేపట్టినా..స్టేట్ సర్కార్ ఇన్‌ఫ్లుయెన్స్ చేసిందన్న అపవాదు వస్తుందని భావిస్తోందట. వైసీపీ పెద్ద నేతలే ఇరుక్కునే అవకాశం ఉన్న కేసులో..కేంద్ర దర్యాప్తు సంస్థతో ఇన్వెస్టిగేషన్ చేయించేలా ఒత్తిడి తెస్తుందట.
Also Read: రూ.25 వేలకే బోలెడన్ని ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్.. ఇక కెమెరా ఎలా ఉంటుందో తెలిస్తే..
ఢిల్లీ లిక్కర్ స్కాంపై సీబీఐ, ఈడీతో కేంద్రం ఇప్పటికే దర్యాప్తు చేయిస్తోంది. అలాగే ఏపీ లిక్కర్ దందా కూడా అంతకు మించి అంటోంది టీడీపీ. ఏకంగా బాహుబలి..పుష్ప కలెక్షన్ల ప్రస్తావన తెచ్చి చర్చకు తెరలేపారు. బాహుబలి..RRR..పుష్ప సినిమాలు రూ.1700 కోట్ల నుంచి రూ.2వేల కోట్ల వరకు వసూళ్లు చేశాయన్న ఎంపీ లావు శ్రీక్రష్ణదేవరాయలు..గడిచిన ఐదేళ్లలో ఏపీలో మద్యం పేరుతో అంతకు మించిన వసూళ్లు జరిగాయని ఆరోపించారు.
ఐదేళ్లలో రూ.99వేల కోట్ల మద్యం వ్యాపారం సాగితే అందులో రూ.18వేల కోట్లు మిస్ యూజ్ అయినట్లు చెప్పుకొచ్చారు. లిక్కర్ దందాలో సంపాదించిన అక్రమ సంపాదనలో రూ.4 వేల కోట్లు బినామీ పేర్లతో దుబాయ్, ఆఫ్రికాలకు తరలించారని అమిత్‌షాకు కంప్లైట్ చేసినట్లు తెలుస్తోంది. తమ ఫిర్యాదుపై కేంద్రం విచారణకు ఆదేశిస్తే వైసీపీ హయాంలో జరిగిన మద్యం యాపారంపై కూడా సీబీఐతో పాటు ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని స్కెచ్ వేస్తోందట కూటమి సర్కార్.
లిక్కర్ కేసులో అరెస్టులు పక్కా?
మాజీ సీఎం జగన్ టార్గెట్‌గానే లిక్కర్ ఫైల్స్ తెరుస్తోందట కూటమి ప్రభుత్వం. జే బ్రాండ్ లిక్కర్ సేల్స్‌తో వేల కోట్లు అక్రమంగా వెనకేశారని..ఆ లెక్క కక్కాల్సిందేనని అంటున్నారు టీడీపీ నేతలు. అయితే కూటమి లీడర్లు చేస్తోన్న ఆరోపణలతో..ఈ మధ్య మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి చేసిన కామెంట్స్ కూడా బలం చేకూర్చాయి. మద్యం స్కామ్‌కు సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని కుండబద్దలు కొట్టారు విజయసాయి. ఆ తర్వాత మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ వేయడంతో లిక్కర్ కేసులో అరెస్టులు పక్కా అన్న టాక్ బయలుదేరింది.
వైసీపీ టైమ్‌లో జరిగిన మద్యం సేల్స్ విషయంలో గతేడాది సెప్టెంబర్ 23న సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో రకరకాల మద్యం బ్రాండ్లు తెచ్చి వేల కోట్ల రూపాయల అవినీతి చేశారని ఎప్పటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది టీడీపీ. అప్పటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరిపై తీవ్ర అలిగేషన్స్ ఉన్నాయి.
అయితే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ టీమ్..ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో తనిఖీలు చేసింది. కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లను సీజ్ చేసి ల్యాబ్‌కు పంపి నివేదిక తెప్పించుకుంది. ఆ రిపోర్ట్‌లో సిట్ సంచలన అంశాలను గుర్తించిందట. ఇలా అన్ని అంశాలను బేస్ చేసుకునే..ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో ప్రస్తావించడంతో పాటు..కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు కూడా కంప్లైంట్ చేశారట.
ఏపీలో కూటమి సర్కార్ పవర్‌లోకి వచ్చినప్పటి నుంచి డైలీ ఎపిసోడ్‌గా లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ పీక్ లెవల్‌కు చేరుకున్నాయి. అమరావతి నుంచి హస్తినకు వెళ్లిన ఏపీ మద్యం ఫైల్స్‌లో..ఏం గుట్టు దాగుందోనన్న చర్చ జరుగుతోంది. అయితే కేంద్రప్రభుత్వం తీసుకునే నిర్ణయం మీదే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. అప్పటి లిక్కర్ దందాపై విచారణకు ఆదేశిస్తారా.? ఒకవేళ దర్యాప్తు జరిగితే వైసీపీ పెద్దల్లో ఎవరికి ఉచ్చు బిగియబోతుందోనన్న డిస్కస్ అయితే హాట్ టాపిక్‌గా మారింది.