మాజీ మంత్రి విడదల రజినికి ఏసీబీ ఉచ్చు.. అసలు ఈ కేసు ఏంటి? రేపోమాపో ఆమెను అరెస్ట్ చేస్తారా?

విడదల మీద ఏసీబీ కేసు నమోదు కావడంతో వైసీపీలో టెన్షన్ క్రియేట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Vidadala Rajini

వైసీపీ నేతలను కేసులు వదలడం లేదు. విడతల వారీగా వంతుల వారీగా కేసులు, అరెస్టులతో ఫ్యాన్ పార్టీ నేతలకు ముప్పతిప్పలు తప్పడం లేదు. సినీ నటుడు, వైసీపీ నేత పోసాని క్రిష్ణమురళి బెయిల్‌పై రిలీజ్ అయ్యారని రిలాక్స్ అవుతున్నలోపే..కూటమి ప్రభుత్వం వైసీపీకి మరో షాక్ ఇచ్చింది.

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడదల రజినిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రితోపాటు ఐపీఎస్ అధికారి జాషువా, విడదల గోపి, పీఏ రామక్రిష్ణపై కేసులు ఫైలయ్యాయి. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రిని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది.

వైసీపీ అధికారంలో ఉండగా, చిలకలూరిపేట నియోజకవర్గం పరిధిలోని యడ్లపాడు మండలంలోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని మాజీ మంత్రి విడదల రజినిపై కేసు నమోదైంది. 2020లో ఈ ఘటన జరగగా, గతేడాది కూటమి ప్రభుత్వం అధికాంలోకి వచ్చిన వెంటనే బాధితుడు ఫిర్యాదు చేశారు.

Also Read: విశాఖ మ్యాచుకు కేఎల్‌ రాహుల్ దూరం.. మ్యాచు గురించి అక్షర్ పటేల్ ఆసక్తికర కామెంట్స్‌

ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని లేటెస్ట్‌గా ఏసీబీ కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలతో గవర్నర్ అనుమతి తీసుకుని మాజీ మంత్రి రజినిపై కేసు పెట్టింది ఏసీపీ.

రజిని బెదిరించారని ఫిర్యాదు
వ్యాపారం చేసుకోవాలంటే తనకు రూ.5 కోట్లు ఇవ్వాల్సిందిగా అప్పట్లో మంత్రిగా ఉన్న రజిని బెదిరించారని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. అన్ని అనుమతులు ఉన్నా తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని ఎదురుతిరిగితే, అప్పట్లో గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువాను పంపి రూ.50 కోట్ల ఫైన్ వేయిస్తానని బెదిరించినట్లు ఆరోపిస్తున్నాడు.

జాషువా బెదిరింపులతో తాను రూ.2 కోట్లు విడదల రజినికి, విడదల మరది గోపి, ఎస్పీ జాషువాకు చెరో రూ.పది లక్షలు చొప్పున ఇచ్చినట్టు బాధితుడు చెప్పుకొచ్చాడు. దీంతో అధికార దుర్వినియోగం, అవినీతి వ్యవహారాలపై మాజీ మంత్రి విడదల రజినితోపాటు ఐపీఎస్ అధికారి జాషువాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీలో మరో టెన్షన్ మొదలైంది.

ఈ వసూళ్లే కాదు..చిలకూరిపేటలో జగనన్న కాలనీలకు సేకరించిన భూములకు చెందిన రైతుల నుంచి కోటి 16 లక్షల రూపాయల కమీషన్‌ తీసుకున్నారని విడదల రజినిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ భాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రైతులకు ఆ మొత్తం తిరిగిచ్చేశారట. దీంతో పోలీసు కేసు నుంచి తప్పించుకున్నారు రజిని.

ఎన్నికల ముందు చిలకలూరిపేట టికెట్‌ ఇప్పిస్తానని అప్పటి వైసీపీ ఇన్‌చార్జి మల్లుల రాజేశ్‌ నాయుడు నుంచి దాదాపు ఆరు కోట్లు తీసుకున్నారని ఆయన ఆరోపించారు. రాజేశ్‌కు కొంత మొత్తం తిరిగిచ్చి ఆ వివాదం తెరమీదకు రాకుండా జాగ్రత్త పడుతన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు స్టోన్‌ క్రషర్‌ యజమానుల నుంచి డబ్బులు తీసుకున్నారని విజిలెన్స్ రిపోర్ట్‌..తర్వాత ఏసీబీ కేసుతో ఆమెకు తలనొప్పిగా మారింది.

ఆయన డైరెక్షన్‌లోనే కేసులు పెడుతున్నారంటూ
మరోవైపు ఏసీబీ కేసు నమోదు కావడంతో విడదల రజిని మీడియా ముందుకు వచ్చి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులను టార్గెట్‌ చేశారు. రెడ్‌బుక్‌ పాలనలో భాగంగానే తనను టార్గెట్ చేశారని.. ఫిర్యాదుదారులను తాను ఎప్పుడూ కలవలేదని అంటున్నారు.

శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్‌లోనే కేసులు పెడుతున్నారన్న ఆమె..ఎంపీపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. 2021 సెప్టెంబర్‌లో శ్రీకృష్ణదేవరాయలు తనతో పాటు తన సిబ్బంది, వ్యక్తిగత ఫోన్ కాల్ డేటాను ఓ సీఐ, డీఎస్పీతో ట్రాక్ చేయించారని వివరించారు. అయితే విడదల ఆరోపణలకు లావు శ్రీకృష్ణదేవరాయలు కౌంటర్ వేశారు. కాల్‌ డేటా తీయించారన్న అలిగేషన్స్‌పై తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఏ తప్పు చేయకపోతే కేసును ఆపాలని..ఓ వ్యక్తిని తన దగ్గరికి రాయబారానికి ఎందుకు పంపారని ప్రశ్నించారు లావు శ్రీకృష్ణదేవరాయలు.

విడదల మీద ఏసీబీ కేసు నమోదు కావడంతో వైసీపీలో టెన్షన్ క్రియేట్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. మాజీ మంత్రి అరెస్ట్‌ అవుతారేమోనన్న ఆందోళన ఫ్యాన్ పార్టీ పెద్దల్లో ఉందంటున్నారు. అయితే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అరెస్టులు చేస్తూ వస్తోన్న కూటమి ప్రభుత్వం..ఇప్పుడు కాస్త వైసీపీ నేతల అవినీతి, అక్రమాల మీద ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. ఈ కేసు ఎటువైపు టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.